బకాయిలు రూ.20 వేల కోట్లు పైనే
దాదాపు లక్ష బిల్లులు పెండింగ్‌
అధికారికంగా వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం
ఆర్టీఐ కింద దరఖాస్తుకు జవాబు
10 వేల కోట్లతో ఇరిగేషన్‌ ప్రథమ స్థానం
ఆర్‌అండ్‌బీలో 1,127 కోట్ల బకాయిలు
ఉపకారం, ఫీజులు వెయ్యి కోట్లకుపైగా
చిరుద్యోగుల జీతాలకు వెయ్యి కోట్లు

హైదరాబాద్‌ : వివిధ అభివృద్ధి పనులు, ప్రభుత్వ శాఖలకు సంబంధించి రాష్ట్రంలో దాదాపు లక్ష బిల్లులు పెండింగులో ఉన్నాయి. రూ.20 వేల కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈసారి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా అంగీకరించింది. పెండింగ్‌ బకాయిల వివరాలు తెలపాలంటూ సమాచార హక్కు చట్టం కార్యకర్త జి.శ్రీనివాసరావు చేసిన దరఖాస్తుకు ప్రభుత్వం ఈ మేరకు సమాధానమిచ్చింది. ఆర్థిక సంక్షోభంతో రాష్ట్రంలో పెండింగ్‌ బిల్లులకు మోక్షం లభించడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వస్తున్నా.. ప్రభుత్వం బిల్లులను క్లియర్‌  చేయలేకపోతోంది. ఇంకా చెప్పాలంటే.. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలైన కల్యాణ లక్ష్మి, రైతు బంధు వంటి సంక్షేమ పథకాలకూ నిధుల మంజూరు లేదు. ఖరీఫ్‌, రబీ సీజన్లకు సంబంధించి దాదాపు రూ.3 వేల కోట్ల వరకూ రైతు బంధు బకాయులు పేరుకుపోయిన విషయం తెలిసిందే. అలాగే, మూడు లక్షల వరకూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని కథనాలు వచ్చాయి. పరిశ్రమలకు రాయితీల కింద రూ.1500 కోట్లు చెల్లించాల్సి ఉంది.

తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించలేని పరిస్థితి. విద్యార్థులకు ఉపకార వేతనాలు, కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా భారీ ఎత్తున బకాయిలే! పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే ప్రయోజనాల కోసమూ పలువురు నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి. కొన్ని జిల్లాల్లో ఆసరా పింఛన్లు కూడా ఒకటి రెండు నెలలు ఆలస్యంగా అందిస్తున్నారు. నిజానికి, సంక్షోభంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్‌ బకాయిలకు సంబంధించి గతంలోనే ‘ఆంధ్రజ్యోతి’ పలు కథనాలను ప్రచురించింది. ‘ఖజానా ఉల్టా పల్టా’; ‘పెండింగ్‌ బిల్లులు రూ.27 వేల కోట్లు’; ‘నిధుల్లేక పనులన్నీ పెండింగ్‌’ శీర్షికలతో గత ఏడాది మే, ఆగస్టు నెలల్లో ‘ఆంధజ్ర్యోతి’ కథనాలను ప్రచురించింది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వివిధ శాఖల్లో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయని, కాంట్రాక్టర్లు నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వెల్లడించింది. అప్పట్లో ఆ కథనాలను ప్రభుత్వం ఖండించింది.

అప్పట్లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ఖండించారు. పెండింగ్‌ బిల్లులు అంతగా లేవని చెప్పారు. ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాలు నిజమేనని ఇప్పుడు తేలింది. రూ.20 వేల కోట్లకుపైగా పెండింగ్‌ బిల్లులు ఉన్నట్లు ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకొంది. వివిధ శాఖల్లో కాంట్రాక్టర్లకు, ప్రభుత్వంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెల్లడించింది. గత ఏడాది డిసెంబరు 31 వరకు మొత్తం రూ.20,628 కోట్ల విలువైన 98,598 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది.

సగం బకాయిలు ఇరిగేషన్‌లోనే..
రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల్లో సగానికిపైగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న సాగునీటి శాఖలోనే ఉన్నాయి. కాళేశ్వరంతోపాటు వివిధ ప్రాజెక్టుల పరిధిలో రూ.10 వేల కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. కాళేశ్వరం ముందుకు సాగుతున్నా.. మిగిలిన సాగునీటి ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్న విషయం తెలిసిందే. అలాగే, మిషన్‌ భగీరథ కాంట్రాక్టర్లకు కూడా పెద్దఎత్తున బకాయిలను చెల్లించాల్సి ఉంది. బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు కొన్నిచోట్ల భగీరథ పనులను ఎక్కడికక్కడే నిలిపి వేశారు. కొన్ని జిల్లాల్లో ట్యాంకులు, పైప్‌ లైన్ల పనులు కూడా మధ్యలోనే ఆపేశారు. బకాయిల్లో తర్వాతి స్థానంలో రహదారులు, భవనాల శాఖ ఉంది. రహదారుల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గతంలో కొంతమేర నిధులు విడుదల చేసింది.

కానీ, చేపట్టిన పనులకు అవి ఏమాత్రం సరిపోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ శాఖలో మొత్తం రూ.1,127 కోట్లకు సంబంధించి 2,757 బిల్లులు చెల్లించాల్సి ఉంది. పంచాయతీరాజ్‌ శాఖ పరిఽధిలో మొత్తం 1,718 బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. వీటి విలువ రూ.792 కోట్లు. భారీగా పేరుకుపోయిన బకాయిల కారణంగానే కొత్త రోడ్లకు అనుమతులు ఇవ్వడం లేదని, ఇప్పటికే చేపట్టిన కొన్ని పనులను కూడా కాంట్రాక్టర్లు మధ్యలోనే నిలిపి వేశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రుణ మాఫీ, నిరుద్యోగ భృతి వంటి కొత్త హామీల అమలుకు నిధుల కటకటే కారణమని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి.

తాత్కాలిక ఉద్యోగుల జీతాలకూ కటకటే
ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిన్నర కిందే పీఆర్సీ ప్రకటించాల్సి ఉంది. దీని జాప్యం వెనక ప్రధాన కారణం నిధుల కటకటేనని స్పష్టమవుతోంది. ఇక, వివిధ ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పని చేస్తున్న ఉద్యోగులూ నెలల తరబడి జీతాల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. కాంట్రాక్టు లెక్చరర్లకు ఆరు నెలలకుపైగా జీతాల్లేవు. విద్యా వలంటీర్లకు 3-4 నెలలకోసారి జీతాలను చెల్లిస్తున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, సంక్షేమ శాఖల్లో పని చేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర తాత్కాలిక ఉద్యోగులూ జీతాలకు నెలల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి. ఇలా, ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించే 18,482 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విలువ రూ.927 కోట్లు. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజునే వారికి రావాల్సిన ప్రయోజనాలు అన్నింటినీ చెల్లించి.. కారులో ఇంటికి చేర్చాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కానీ, రిటైర్మెంట్‌ తర్వాత తమకు రావాల్సిన ప్రయోజనాల కోసం రిటైర్డ్‌ ఉద్యోగులు ఇప్పుడు నెలల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.

బకాయిలు రూ.20 వేల కోట్లు పైనే

Courtesy Andhrajyothi