Image result for గస్తీకి సుస్తీ!"లక్షలాది సీసీ కెమెరాలు..
వేలాదిగా వాహనాలు
భారీగా సిబ్బంది..
అయినా ఆగని నేరాలు
అక్కరకురాని సాంకేతికత
ఐదేళ్లలో రూ. 2000 కోట్ల ఖర్చు
గతనెల 27వ తారీఖు రాత్రి.. తొండుపల్లి టోల్‌గేట్‌..  యువ వైద్యురాలు దిశపై రాక్షసకాండ జరిగిన ప్రాంతం..
ఆ రాత్రి అదే ప్రాంతంలో 12 పెట్రోలింగ్‌ వాహనాలు, 50కు పైగా ద్విచక్ర వాహన బృందాలు గస్తీ తిరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
రాత్రి 9 గంటల ప్రాంతంలోనే దిశపై లారీ డ్రైవర్లు, క్లీనర్లు కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడి చంపేశారు.
మృతదేహాన్ని లారీలో వేసుకుని 28 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లారు.
పెట్రోలు పోసి తగులబెట్టాక కొంత సమయానికి మళ్లీ ఆ ప్రాంతానికి వచ్చి మృతదేహం కాలిందా లేదా అని కూడా పరిశీలించి వెళ్లారు.
ఇంత జరిగినా ఏ గస్తీ బృందం వీటిని పసిగట్టలేకపోయింది.
అక్కడొక మృతదేహం కాలి ఉందని స్థానికులు సమాచారం ఇచ్చిన తరువాతే పోలీసులు కదిలారు.
అంటే.. గస్తీ బృందాలు మొక్కుబడిగానే తిరుగుతున్నాయా?
అసలు తిరుగుతున్నాయా?
ఇవీ ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలు.
* ఇటీవలి కాలంలో మూడు కమిషనరేట్లలో గస్తీ వాహనాలు తిరుగుతుండగానే నేరాలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
* బాహ్యవలయ రహదారిలో మహిళలపై నేరాలు జరిగే ప్రాంతాలు దాదాపు 20 వరకు ఉన్నట్లు గుర్తించారు.
* దిశ హత్య జరిగిన తొండుపల్లి టోల్‌ గేట్‌ ప్రాంతం కూడా వాటిలో ఒకటి.
వందలాది గస్తీ వాహనాలు… వేలాది పోలీసులు… లక్షలాది సీసీ కెమెరాలు. ఎక్కడికక్కడ కంట్రోల్‌ రూంలు. ఆపదలో ఉన్న వారు ఫోన్‌ చేసిన అయిదు నిమిషాల్లోనే పోలీసులు చేరుకునే వెలుసుబాటు. కానీ ఇవేవీ నేరాలను ఆపలేకపోతున్నాయి. పశువైద్యురాలి హత్యోదంతమే దీనికి నిదర్శనం. గ్లోబల్‌ సిటీగా చెప్పుకొనే రాజధానిలో అతివలకు రక్షణ ఎక్కడుందనే ప్రశ్న పదే పదే తలెత్తుతోంది. గస్తీ వ్యవస్థ గాడి తప్పడం… నిఘా పటిష్ఠంగా నిర్వహించకపోవడం భద్రత వ్యవస్థను డొల్లగా మార్చేస్తోంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మహిళలపై దాడులకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో నిఘా లేదు. పదుల సంఖ్యలో వాహనాలపై గస్తీ తిరుగుతున్నట్లు రోజూ రికార్డుల్లో నమోదు చేస్తున్నా, ఇలాంటి నేరాలను ఎందుకు పసిగట్టలేకపోతున్నారో పోలీసులే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీసు శాఖను పటిష్ఠం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధిక ప్రాధాన్యమిచ్చారు. రూ. 2,000 కోట్ల వరకు కేటాయించారు. డీజీపీగా మహేందర్‌ రెడ్డి బాధ్యతలను స్వీకరించిన తరువాత పోలీసు శాఖ బలోపేతానికి అనేక చర్యలు తీసుకున్నారు. జిల్లాల్లోని పాత పోలీసు స్టేషన్ల స్థానే కొత్త భవనాలను నిర్మించడంతో పాటు అనేక సదుపాయాలు కల్పించారు. వాహనాలపై పోలీసులు నిరంతరం గస్తీ తిరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ నాణానికి ఒక వైపు మాత్రమే. క్షేత్రస్థాయిలో మాత్రం పోలీసులు పౌరుల భద్రతపై తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ విమర్శలు రేగుతున్నాయి.
నేరాలు జరిగే ప్రాంతాలు గుర్తించినా…
ముగ్గురు పోలీసు కమిషనర్లు గతంలోనే కసరత్తు చేసి మహిళపై నేరాలకు అవకాశమున్న ప్రాంతాలను గుర్తించారు. సైబరాబాద్‌లో 384, రాచకొండలో 340, హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 217, మొత్తం 941 ప్రాంతాలను గుర్తించారు. మొత్తం మీద 941 ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకుంటే మహిళలపై నేరాల సంఖ్య చాలా వరకు తగ్గే అవకాశం ఉందన్న నిర్ణయానికి వచ్చారు. దీనికి అనుగుణంగా గస్తీ ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేశారు. మూడు కమిషనరేట్లలో 874 గస్తీ వాహనాలు, మరో 1730 ద్విచక్ర వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. 58,572 వ్యక్తులు/ సంస్థలు/ ప్రాంతాలకు పోలీసు కానిస్టేబుళ్లు వెళ్లి రోజువారీ తనిఖీ చేసినట్లు సంతకాలు తీసుకంటున్నారు. చూడటానికి ఈ అంకెలు బాగానే కన్పిస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. వేలాది పోలీసులను దీనికోసం వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. గస్తీ వాహనాలు నామమాత్రంగా తిరుగుతున్నాయన్న విమర్శలొస్తున్నాయి.
12 గస్తీ బృందాలు పసిగట్టలేకపోయె…
Image result for గస్తీకి సుస్తీ!"బాహ్యవలయ రహదారిలో దాదాపు 20ప్రాంతాలను మహిళలపై నేరాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించారు. పశువైద్యురాలి హత్య జరిగిన తొండుపల్లి టోల్‌ గేట్‌ ప్రాంతం కూడా ఇందులో ఒకటి. ఆమెపై అత్యాచారం, హత్య జరిగిన రోజున కూడా పన్నెండు గస్తీ వాహనాలు, 50కు పైగా ద్విచక్ర వాహన బృందాలు ఈ ప్రాంతమంతా గస్తీ తిరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలోనే ఆమెపై లారీ డ్రైవర్లు, క్లీనర్లు అత్యాచారం చేసి చంపేశారు. మృతదేహాన్ని 28 కిలో మీటర్ల దూరం తీసుకువెళ్లారు. పెట్రోలు పోసి తగలబెట్టిన కొంత సమయానికి మళ్లీ ఆ ప్రాంతానికి వచ్చి మృతదేహం కాలిందా లేదా అని పరిశీలించారు. ఇంత జరిగినా ఏ గస్తీ బృందం వీటిని పసిగట్టలేకపోయింది. అక్కడొక మృతదేహం కాలి ఉందని స్థానికులు సమాచారం ఇచ్చిన తరువాతే పోలీసులు కదిలారు. దీన్ని బట్టి గస్తీ బృందాలు మొక్కుబడిగానే తిరిగి వస్తున్నాయని భావించాల్సిన పరిస్థితి. ఇటీవల కాలంలో మూడు కమిషనరేట్లలో గస్తీ వాహనాలు తిరుగుతుండగానే నేరాలు జరిగిన సందర్భాలున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు ఈ లోపాలను పరిశీలించి వెంటనే చక్కదిద్దాల్సి ఉంది.
ఇవే నిదర్శనాలు
*  హైదరాబాద్‌ శివార్లలోని రామచంద్రాపురం ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడీ దొంగలు ఉదయం 10.30 సమయంలోనే రూ.14 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. వీరిని ఎవరూ అడ్డుకోలేకపోయారు.
*  బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి 8వ తరగతి చదువుతున్న బాలికను అపహరించి అత్యాచారం చేసి, ఆపై అంతమొందించాడు. ఇది పట్టపగలే జరిగింది. ఈ హంతకుడు అంతకు ముందు మరో ఇద్దరిని కూడా కిడ్నాప్‌చేసి ఇదే తరహాలో అత్యాచారం చేసి హతమార్చినా పోలీసులు పట్టుకోలేకపోయారు.
*  వరంగల్‌ దీనదయాళ్‌నగర్‌కు చెందిన యువతిపై అత్యాచారం చేసి హతమార్చిన డిగ్రీ విద్యార్థి సాయికుమార్‌ ఆమె మృతదేహాన్ని కారులోనే ఉంచుకొని చీకటి పడేవరకూ రోడ్లపై తిరుగుతూనే ఉన్నాడు. మధ్యలో మృతదేహానికి దుస్తులు మార్చాడు. పట్టణంలోకి తీసుకొచ్చి హంటర్‌ రోడ్డులో పడేశాడు. ఇంత జరిగినా ఎవరూ పసిగట్టలేకపోయారు.
* పోలీసు శాఖకు ఆధునిక వాహనాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఇంతవరకు ప్రభుత్వం చేసిన వ్యయం:  రూ.2,000 కోట్లు
* గత అయిదేళ్లలో పోలీసుశాఖకు ఇచ్చిన కార్లు: 1,500;  ద్విచక్ర వాహనాలు: 3,000
* ఎక్కడ ఏం జరిగినా పసిగట్టేలా రాజధానిలో ఏర్పాటైన సీసీ కెమెరాలు: 5,00,000
* ఎవరు ఫోన్‌ చేసినా నిమిషాల్లోనే చేరుకునేలా ఆధునీకరించిన డయల్‌-100
(Courtesy Eenadu)