• రూ.2.65 లక్షల కోట్లతో ప్యాకేజీ
 • కేబినెట్‌ నిర్ణయాలకు తోడు మరికొన్ని వరాలు
 • కొత్తగా ఉద్యోగాలిచ్చే సంస్థలకు ఈపీఎఫ్‌ రాయితీ
 • 24 శాతం రెండేళ్లు చెల్లించనున్న కేంద్రం
 • ఫ్లాట్లు, ఇళ్ల కొనుగోలుపై 20శాతం ఐటీ రాయితీ
 • సూక్ష్మ, చిన్నతరహా సంస్థలకు అదనపు రుణాలు
 • కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధికి 900 కోట్లు: నిర్మల 
 • ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని వెల్లడి

న్యూఢిల్లీ : కరోనా రికవరీ దశలో.. ఉపాధి కల్పన రంగానికి ఊతమిచ్చేలా మరో ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. పది ఉత్పాదక రంగాలకు బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన రూ.1.46 లక్షల కోట్ల ప్యాకేజీకి మరికొన్ని చర్యలు, రాయితీలను జోడించి.. మొత్తం రూ.2,65,080 లక్షల కోట్లతో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన-3’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. తాజాగా యాజమాన్యాలకు, ఉద్యోగులకు రాయితీలు ప్రతిపాదించారు. వీటిప్రకారం.. కొత్తగా ఉద్యోగాలిచ్చే సంస్థలకు ఈపీఎఫ్‌ (ఉద్యోగుల భవిష్య నిధి)లో సబ్సిడీ ఇస్తారు. 1,000 మంది వరకు ఉద్యోగులు కలిగిన సంస్థలు, వాటి ఉద్యోగుల ఈపీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌లో కేంద్రం ఇప్పటికే చెరో 12 శాతం సబ్సిడీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ 24 శాతం రాయితీని కొత్త స్కీం ద్వారా రెండేళ్లపాటు అందిస్తామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

1,000 మందికి పైగా ఉద్యోగులు ఉండే సంస్థల్లో మాత్రం కేవలం ఉద్యోగుల వాటాలోనే సబ్సిడీ ఇస్తామన్నారు. ఈపీఎ్‌ఫవోలో నమోదు చేసుకున్న యాజమాన్య సంస్థలు.. నెలకు రూ.15 వేలలోపు వేతనంతో కొత్త ఉద్యోగులను తీసుకుంటే.. ఈ సబ్సిడీ వర్తిస్తుంది. అలాగే కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందిన ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబరు 30 వరకు ఉపాధి కోల్పోయి.. మళ్లీ కొత్తగా ఉద్యోగంలో చేరినవారికీ (రూ.15 వేల వేతనం ఉన్నవారు) ఈ పథకం అందుతుంది. కొత్త స్కీం ప్రకారం.. 50 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఇద్దరు కొత్త ఉద్యోగులను నియమించాలి. 50 మందికిపైగా ఉద్యోగులున్న సంస్థలు కనీసం ఐదుగురు కొత్తవారికి ఉద్యోగాలివ్వాల్సి ఉంటుంది. ఈ పథకం వచ్చే జూన్‌ 30 వరకు అ మల్లో ఉంటుంది. గృహ నిర్మాణ రంగానికి కూడా రాయితీలు ప్రకటించారు. రూ.2 కోట్ల విలువ చేసే గృహ యూ నిట్ల మొదటి విక్రయంపై 20ు ఆదాయ పన్ను రాయితీ ప్రకటించారు. ఈ మేరకు ఆదాయ పన్ను చట్టంలో సవరణలు చేస్తారు. దీనివల్ల కొనుగోలుదారులు, స్థిరాస్తి వ్యాపారులకూ మేలు చేకూరుతుంది. వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. కరోనా వల్ల ఆర్థిక ఇక్కట్ల వల్ల చాలా ఇళ్లు, ఫ్లాట్ల అమ్మకం నిలిచిపోయి ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న స్థిరాస్తి వ్యాపారులకు ఈ రాయితీతో ఎంతో ఊరట లభిస్తుందని నిర్మల అభిప్రాయపడ్డారు. అలాగే ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారెంటీ స్కీం (ఈసీఎల్‌జీఎ్‌స)ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. దీని విలువ రూ.3 లక్షల కోట్లు. 26 రంగాలకు కూడా రాయితీలు ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి రూ.50 కోట్లు, అంతకుమించి రుణం తీసుకుని ఉన్న సంస్థలకు.. ఆ మొత్తంలో 20 వరకు అదనపు రుణంగా పొందే అవకాశమిచ్చారు. ఈ అదనపు రుణాన్ని ఐదేళ్లలో చెల్లించవచ్చు. ఇందులో  అసలు చెల్లింపుపై ఒక ఏడాది మారటోరియం ఉంటుంది. వచ్చే మార్చి 31 వరకు స్కీం అమల్లో ఉంటుంది.

 1. ఆర్థిక రంగానికి చేయూతనిచ్చేందుకు.. పెట్టుబడులు, ఎగుమతులు, ఉపాధి కల్పన భారీగా పెంచడానికి.. 10 ప్రధాన ఉత్పాదక రంగాలకు.. అడ్వాన్స్‌ సెల్‌ కెమిస్ర్టీ బ్యాటరీ, ఎలక్ర్టానిక్‌ టెక్నాలజీ ఉత్పత్తులు, ఆటోమొబైల్స్‌, ఔషధ ఉత్పత్తులు, టెలికం, నెట్‌ వర్కింగ్‌, జౌళి, ఆహార ఉత్పత్తులు, అత్యధిక సామర్థ్యం గల సోలార్‌ పీవీ మాడ్యూల్స్‌, ఏసీలు, ఎల్‌ ఈడీలు, ప్రత్యేక ఉక్కు మొదలైన వాటికి రూ.1.46 లక్షల కోట్ల మేరకు ప్రోత్సాహకాలు కల్పించాలని కేంద్రం బుధవారమే ఆమోదం తెలిపింది. వీటిని నిర్మల మళ్లీ ప్రస్తావించారు.
 2. తాజా చర్యల్లో.. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) కింద ఇప్పటికే కేటాయించిన రూ.8 వేల కోట్లతో పాటు మరో రూ.18 వేల కోట్ల కేటాయించారు. 12 లక్షల ఇళ్ల నిర్మాణానికి.. ఇంకో 18 లక్షల ఇళ్ల పూర్తికి.. అదనంగా 78 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు.. సిమెంటు, ఉక్కు ఉత్పత్తి పెరగడానికి ఇది తోడ్పడుతుందని అంచనా.
 3. టెండర్లలో ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌, పనితీరు సెక్యూరిటీ కింద కట్టాల్సిన మొత్తాన్ని 5-10 శాతం నుంచి 3 శాతానికి తగ్గించారు. దీని వల్ల కాంట్రాక్టర్లకు ఊరట లభిస్తుంది. ఈ తగ్గింపు వచ్చే ఏడాది డిసెంబరు 31 వరకు వర్తిస్తుంది.
 4. స్వదేశీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ పరిశోధన, అభివృద్ధికి రూ.900 కోట్ల గ్రాంటు.
 5. జాతీయ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల నిఽధిలో ప్రభుత్వం రూ.6 వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు పెడుతుంది.
 6. సబ్సిడీ ఎరువుల కోసం 65 వేల కోట్లు.
 7. గ్రామీణ ఉపాధిని పెంచేందుకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద రూ. 10 వేల కోట్లు.
 8. భారత అభివృద్ధి, ఆర్థిక సహాయ పథకం (ఐడియాస్‌) కింద ఎగుమతుల ప్రోత్సాహానికి ఎగ్జిమ్‌ బ్యాంక్‌కు రూ.3 వేల కోట్లు.
 9. పెట్టుబడి, పారిశ్రామిక ఉద్దీపనకు 10,200 కోట్లు.

మూడో ప్యాకేజీ..
కరోనా ప్రారంభ దశలో మార్చి నుంచి ఇప్పటివరకు కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల్లో ఇది మూడోది. దీంతో ఇప్పటివరకు మొత్తం రూ.29,87,641 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించామని, ఇది స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 15 శాతమని కేంద్ర ఆర్థిక మంత్రి తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా, దృఢంగా కోలుకుంటోందన్నారు. జీఎస్‌టీ వసూళ్లలో పెరుగుదల, ఇంధన వినియోగంలో వృద్ధి, బ్యాంకు రుణాల పెరుగుదల మొదలైనవి దీనికి సంకేతాలని చెప్పారు. గత నెలలో పర్చేజ్‌ మేనేజింగ్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) 58.9 శాతానికి చేరిందని.. తొమ్మిదేళ్లలో ఇది గట్టి పెరుగుదలేనని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత త్రైమాసికంలో వృద్ధిరేటు బాగా పెరిగే అవకాశముందని ఆర్‌బీఐ అంచనా వేసిందని.. దీనిపై తాను ఆశాభావంతో ఉన్నానని తెలిపారు.

Courtesy Andhrajyothi