• రూ.10 వేలుసాయం అందలేదని
  • రోడ్డెక్కిన వరద బాధితులు
  • జఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల ఇళ్ల ముట్టడి
  • జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల వద్ద ధర్నా
  • ప్రధాన రహదారులపై రాస్తారోకో
  • నేతలపై బాధిత కుటుంబాల ఆగ్రహం
  • ఆందోళన వద్దు.. అందరికీ సాయం: కేటీఆర్‌
  • నేడు అధికారులతో సమీక్ష తర్వాత నిర్ణయం

హైదరాబాద్‌ సిటీ : వరద సాయం అందక పోవడంపై రాజధాని ముంపు ప్రాంత వాసుల్లో ఆగ్రహం పెల్లుబికింది. అసలు బాధితులను వదిలేసి చుక్క వరద రానిచోట సాయం పంపిణీ చేస్తారా? టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే రూ.10 వేలు ఇస్తారా? అని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  రేపు ఎన్నికలు లేవా? ఓట్ల కోసం రారా? మేమేంటో చూపిస్తామని మహిళలు మండిపడ్డారు. సాయం నిలిపివేతతో కార్పొరేటర్ల ఇళ్లు మొదలు ఎమ్మెల్యేల కార్యాలయాలు, మునిసిపల్‌ కార్యాలయాలు, ప్రగతి భవన్‌ వరకు శనివారం ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల పరంపర కొనసాగింది. పలుచోట్ల రాస్తారోకో చేశారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వారికి సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్‌ రోడ్డు నం.11 ఉదయ్‌నగర్‌కు చెందిన కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికుడు కె.భిక్షపతి గుండెపోటుతో మరణించారు. అంబర్‌పేట ఎమ్మెల్యే వెంకటేష్‌ కార్యాలయం ముందు ఐదు డివిజన్ల బాధితులు బైఠాయించారు. గోల్నాక డివిజన్‌ వెంకటేశ్వరనగర్‌ (వడ్డెరబస్తీ)కు చెందిన గండికోట వెంకటేశ్‌ (55) ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఉప్పల్‌ కార్పొరేటర్‌ మేకల అనలారెడ్డి భర్త హన్మంత్‌రెడ్డి, చిలుకానగర్‌ కార్పొరేటర్‌ గోపు సరస్వతి భర్త సదానంద్‌లు బాధితులతో కలిసి ధర్నా చేశారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్‌ చాంబర్‌ వద్ద బాధితులు బైఠాయించారు. కమిషన్‌ ఇవ్వనందుకే పరిహారం దక్కలేదని ఎల్బీనగర్‌లో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని వరద బాధితులు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇచ్చింది తీసుకుని వెళ్ళండి, లేకుంటే ఇండ్లకు వాటర్‌, కరెంట్‌ కనెక్షన్‌ కట్‌ చేస్తామని నేతలు బెదిరించడంతో కూకట్‌పల్లి అస్‌బెస్టాస్‌ కాలనీ మహిళలు టీఆర్‌ఎస్‌ నాయకులతో వాగ్వాదానికి దిగారు. సీఎం నివాసం ప్రగతి భవన్‌ ముందు మహిళలు ధర్నాకు యత్నించగా పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కి తరలించారు. సుభాష్‌నగర్‌ బస్తీ బాధితులు  ప్రగతి భవన్‌కు రాగా పోలీసులు అడ్డుకున్నారు.

ఆందోళన వద్దు.. అందరికీ సాయం: కేటీఆర్‌
ముంపు ప్రాంతాల్లోని ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ.10 వేల తక్షణ ఆర్ధిక సాయం అందజేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అర్హత ఉన్న వారందరికీ సర్కారు సాయం అందుతుందని భరోసా ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులతో ఆదివారం సమావేశమై వరద సాయం పంపిణీపై సమీక్షిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఆర్ధిక సాయం పంపిణీ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అర్హులకు సాయం అందకుంటే మరి కొన్ని రోజుల పాటు సాయం పంపిణీ కొనసాగుతుందని చెప్పారు.

Courtesy Andhrajyothi