రూ.వెయ్యి కోట్ల భూమిపై టిటిడికి అనుకూలంగా ఇనాం కోర్టు తీర్పు
తిరుపతిలో కలకలం
నోటీసులు ఇచ్చేందుకు టిటిడి మల్లగుల్లాలు తిరుమల

దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువచేసే 188 ఎకరాల భూమి తిరుమల తిరుపతి దేవస్థానా నికి చెందినదంటూ చిత్తూరు ఇనాం కోర్టు ఆగస్టు 27న ఇచ్చిన తీర్పు తిరుపతిలో సంచలనమవుతోంది. ఇనామ్స్‌ డిప్యూటీ తహశీల్దార్‌ చిత్తూరు కోర్టు ఏపీ ఇనామ్స్‌ చట్టం (1956) సెక్షన్‌ (3) సబ్‌సెక్షన్‌ (4), (3) కింద ఈ భూమి టిటిడికి చెందుతుందని స్పష్టం చేసింది. అయితే, నేటికీ ఈ తీర్పును గుట్టుచప్పుడు కాకుండా ఉంచారు. 80 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత సాధించిన ఆస్తిని ఎలా దక్కించుకోవాలని టిటిడి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. స్టార్‌ హౌటళ్లు, తిరుపతి సెంట్రల్‌ బస్‌స్టేషన్‌తో పాటు వందలాది నివాస గృహాలు ఈ తీర్పుతో ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇనాం కోర్టులో ఓడినవారు అప్పీలుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.ూస్తి స్వాధీనానికి టిటిడి అడుగు ముందుకేస్తే తిరుపతిలో పెద్దఎత్తున అలజడి చెలరేగనుంది.
కేసు పూర్వాపరాలిలా…

శ్రీవారి దివ్యనామ సంకీర్తనలు తిరుమల కొండపై పాడిన తాళ్లపాక అన్నమాచార్య కుటుంబానికి తిరుపతిలోని 188 ఎకరాల స్థలాన్ని 1865లో ఆనాటి తిరుమల పాలకులు (అప్పట్లో టిటిడి ఏర్పడలేదు) సేవా ఇనాంగా ఇచ్చారు. ఎప్పుడైతే శ్రీవారి సంకీర్తనల సేవను నిలిపివేస్తారో, అప్పుడు ఆ భూమిని తిరిగి తమకు అప్పగించాలని అప్పట్లోనే రాతపూర్వకంగా రికార్డు చేశారు. ఈ మేరకు ఒప్పందం జరిగింది. తాళ్లపాక కుటుంబీకులు తమ సేవలను 1,925లో ముగించారు కానీ, ఆ భూమిని తిరిగి వెనక్కివ్వలేదు. అంతేగాకుండా తాళ్లపాక వంశీయులు ఈ భూమిని తిరుపతికి చెందిన పాండ్రివేటి సుబ్బారెడ్డి, గురవారెడ్డి కుటుంబాలకు లీజుకిచ్చారు. ఏడాదికి ‘కౌలు’ రూపంలో లబ్ధి పొందుతూ వచ్చారు. 1935లో సర్వహక్కులూ తమవేనంటూ ఆర్‌డిఒ నుంచి పాండ్రివేటి కుటుంబాలు పట్టాలు తెచ్చుకున్నాయి. కొత్తగా ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈ భూమి తమదేనంటూ అన్ని వివరాలతో కూడిన సాక్ష్యాధారాలు, ఒప్పందాల పత్రాలతో చంద్రగిరి సబ్‌కలెక్టర్‌ను ఆశ్రయించింది. అప్పటి సబ్‌కలెక్టర్‌ పూర్వాపరాలను పరిశీలించి ఈ భూమి టిటిడిదేనని 1945లో తేల్చారు. ఆ తరువాత పాండ్రివేటి కుటుంబాల వారు, అలాగే తాము లీజుకిచ్చామని, ఆ భూములను తమకే సొంతం చేయాలని తాళ్లపాక వంశీయులు 1986లో సిసిఎల్‌ఎను ఆశ్రయించారు. ఈ కేసును చిత్తూరు ఇనాం కోర్టుకు సిసిఎల్‌ఎ బదలాయించింది. 2002లో పాండ్రివేటి, తాళ్లపాక వంశస్తులు హైకోర్ట్టుకెళ్లగా 2014లో కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఇనాం డిప్యూటీ తహశీల్దార్‌ కోర్టు పూర్వాపరాలన్నీ పరిశీలించి 2019 ఆగస్టు 27న తుది తీర్పు వెలువరించింది. ఈ భూములు టిటిడికి చెందినవేనని వెల్లడించింది. 80 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం టిటిడి గెలుపొందింది. అయితే, తిరుపతి నడిబొడ్డున ఈ భూమి ఉండడం, అనేక నిర్మాణాలు చోటుచేసుకోవడంతో ఇరకాటంలో పడింది. తిరుపతి సగం టిటిడికేనా?

చిత్తూరు ఇనాం కోర్టు తీర్పు వెలువడడంతో తిరుపతిలో అలజడి రేగనుంది. 80 ఏళ్లపాటు అనుభవించిన పాండ్రివేటి కుటుంబీకులు సుబ్బారెడ్డి, గురవారెడ్డి తమదే ఈ భూమి అంటూ అమ్ముకుంటూ వచ్చేశారు. ఇప్పటికే ఈ భూములన్నీ ఎన్నో చేతులు మారాయి. ప్రస్తుతం తిరుపతి సెంట్రల్‌ బస్‌స్టేషన్‌ కూడా ఆ స్థలంలోనిదే. పెద్దపెద్ద అపార్టుమెంట్లు, కళ్యాణ మండపాలు, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు, త్రీస్టార్‌ హోటళ్లు ఈ స్థలంలోనే ఉన్నాయి. చింతలచేను మురికివాడ ఈ ప్రాంతంలోనిదే. పెద్దకాపు లేఅవుట్‌, చిన్నకాపు వీధి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఎల్‌ఆర్‌ గ్రాండ్‌ కూడా ఇందులోనిదే.

అంతా శ్రీవారి దయ :
టిటిడి ఎస్టేట్‌ ఆఫీసర్‌ విజయసారథి
ఇనాం డిప్యూటీ తహశీల్దార్‌ కోర్టు తీర్పుపై ‘ప్రజాశక్తి’ టిటిడి ఎస్టేట్‌ ఆఫీసర్‌ విజయసారథి స్పందన కోరగా, ‘అంతా శ్రీవారి దయ’ అని పేర్కొన్నారు. టిటిడి నోటీసులను ఇవ్వనుందా? అని అడగ్గా, తాను ఏమీ చెప్పకూడదని, పెద్దవారు చెబుతారని దాటవేశారు.

ఆ భూమి టిటిడిదే : లక్కిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, అడ్వకేట్‌
ఎనభై ఏళ్ల న్యాయ పోరాట ఫలితం టిటిడి పక్షాన నిలిచింది. ఈ భూమి టిటిడికి చెందినదే. శ్రీవారి గర్భగుడిలో సంకీర్తనలు పాడే తాళ్లపాక అన్నమయ్య వంశీకులకు అప్పటి పాలకులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రం కూడా టిటిడి దగ్గర ఉంది. తాళ్లపాక వంశీయులు తిరుపతి వాసులకు లీజుకు ఇవ్వడం వల్ల వారి నుంచి చేతులు మారి పట్టాలయ్యాయి. ఇన్నేళ్లకు టిటిడిదని తేలింది. శ్రీవారి ఆస్తి శ్రీవారికి దక్కడం ఆనందంగా ఉంది.

Courtesy Prajashakthi…