• రూ.100 కోట్ల భూమిని కాజేసిన భూస్వాములు
  • దళితులు తమకు అమ్మినట్లు తప్పుడు రికార్డులు
  • రెవెన్యూశాఖలోని తమ వారి సహకారంతో దందా
  • 15 ఏళ్లుగా పోరాటం.. అమలు కాని కోర్టు తీర్పులు

మహబూబ్‌నగర్‌ : దళితులు ఏళ్ల తరబడి సాగు చేసుకుని.. కౌలుదారీ చట్టం ప్రకారం పొందిన భూమి.. వారికి తెలియకుండానే భూస్వాముల చేతికి వెళ్లిపోయింది. రెవెన్యూశాఖలో పాతుకుపోయిన భూస్వాముల వారసులు తప్పుడు రికార్డులు సృష్టించి.. సుమారు రూ.100 కోట్ల విలువైన దళితుల భూమిని అమ్మేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీలోని బాదేపల్లి రెవెన్యూ శివారులో ఉన్న భూమి విషయంలో ఈ అన్యాయం జరిగింది. దళితుల వారసులు విరాసత్‌ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది. పదిహేనేళ్లుగా దళితులు పోరాడుతున్నా, కోర్టులు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లు అనుకూలంగా తీర్పులిచ్చినా.. రెవెన్యూ అధికారులు వీరికి విరాసత్‌ చేయడంలేదు. 1980లోనే భూస్వాములు రాజేశ్వరరావు, రంగారావుకు చెందిన సర్వే నంబర్‌ 64, 65లలో కౌలుదారీ చట్టాన్ని వర్తింపజేశారు. మాదిగ పెద్దబాలయ్య తదితరులకు సర్వే నంబర్‌ 64లో 9.17 ఎకరాలు, సర్వే నంబర్‌ 65లో 6.35 ఎకరాలు కలిపి మొత్తం 16.12 ఎకరాల భూమికి 38-ఈ సర్టిఫికెట్‌ జారీ చేశారు. 1981లో వీరికి టైటిల్‌ డీడ్‌, పట్టాదారు పాసుపుస్తకాలు కూడా జారీ అయ్యాయి. అయితే 1983లో పెద్దబాలయ్య తదితరులు 64 సర్వే నంబర్‌లోని 9.17 ఎకరాల భూమిని అమ్మినట్లు, 65 సర్వే నంబర్‌లోని భూమికి మరో ఇద్దరికి జీపీఏ ఇచ్చినట్లు రికార్డులు సృష్టించారు. దీంతో పట్టాలు పొందిన బాలయ్య, అతని సోదరుల కుటుంబీకులు, వారసులకు ఈ భూములు దక్కకుండా పోయాయి.

రికార్డులు తారుమారు..
ఈ భూముల రికార్డుల నిర్వహణ అనుమానాలకు తావిస్తోంది. 1983లో భూమిని విక్రయించినట్లు డాక్యుమెంట్లు ఉంటే.. రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ వివరాలు నమోదు చేయాల్సి ఉంది. కానీ, 1986-87లో కూడా పెద్దబాలయ్య తదితరులపైనే 64/1లో ఈ భూమి నమోదైంది. అంతేకాకుండా 64/3లో మరో 4 ఎకరాల భూమి కూడా పెద్దబాలయ్య పేరున రికార్డయింది. 1987-88కి వచ్చేసరికి 64/1లో 8.21 ఎకరాల భూమిని భూస్వాములు రాజేశ్వరరావు, రంగారావు పేరున, 64/2లో 0.01 ఎకరాల భూమిని రాజేశ్వరరావు పేరున, 64/3లో మళ్లీ పెద్దబాలయ్య పేరున 4 ఎకరాల భూమిని నమోదు చేశారు. 1988-89 పహాణీల్లో ఇదే వివరాలు కొనసాగించగా, 1989లో వచ్చిన కొత్త ఆర్వోఆర్‌లో 64/3లో బాలయ్య పేరు తొలగించి 1983లో భూములు కొన్నట్లు పేర్కొన్నవారి పేర్లను చేర్చారు. అదే ఏడాది పహాణీల్లో వచ్చిన బాలయ్య తదితరుల పేర్లను, ఆర్వోఆర్‌లో కనిపించకుండా చేశారు. విరాసత్‌ కల్పించాలని పెద్దబాలయ్య కుమారుడు శ్యాంసుందర్‌ తహసీల్దార్‌ నుంచి కలెక్టర్‌ దాకా పలుమార్లు పిటిషన్లు వేశారు. జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ కోర్టులతో పాటు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌, హైకోర్టును ఆశ్రయించగా, అనుకూలంగా తీర్పురావడంతో పాటు భూములకు విరాసత్‌ చేయాలని ఆదేశాలొచ్చాయి. కానీ, స్థానిక తహసీల్దార్లు ఈ ఆదేశాలను అమలు చేయలేకపోయారు.

Courtesy Andhrajyothi