Image result for ఆర్టీసీ భూముల కబ్జా!"శంషాబాద్‌ దగ్గర ఐదు ఎకరాల ఆక్రమణ
మరో ఐదెకరాలను కాజేసేందుకు యత్నం

శంషాబాద్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం చెంతనే అతి పెద్ద ఆర్టీసీ బస్‌ టెర్మినల్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్ల విలువైన స్థలం కబ్జాదారుల పరమైంది. పరిరక్షణలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా కొంతమంది కబ్జాదారులు దర్జాగా దాదాపు అయిదు ఎకరాల భూమిని ఇప్పటికే ఆక్రమించి నిర్మాణాలు చేస్తుండగా మరో అయిదు ఎకరాలను ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆక్రమణల పర్వాన్ని పరిశీలించడానికి ఈనాడు ప్రతినిధి సంబంధిత ప్రాంతానికి వెళ్తే ఫలానా నేతల అనుచరులం అంటూ బెదిరించడానికి ప్రయత్నించారు. గ్రామస్థులను కూడా వీరు బెదిరిస్తున్నారని తెలిసింది.  విమానాశ్రయం ప్రధాన ద్వారానికి అతి సమీపంలో రషీద్‌గూడ గ్రామపరిధిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బస్‌ టెర్మినల్‌, వర్క్‌షాప్‌ నిర్మించడానికి ఆర్టీసీ అధికారులు కొన్నేళ్ల కిందటే బృహత్తర ప్రణాళికను రూపొందించారు. ఈ నేపథ్యంలోనే బస్‌టెర్మినల్‌ కోసం రషీద్‌గూడలో సర్వే నెంబర్‌ 57లో 6 ఎకరాలు, వర్క్‌షాపు కోసం సర్వే నెంబర్‌ 78లో 4 ఎకరాలను 2011లో రెవెన్యూ అధికారులు కేటాయించారు. దీంతో ఈ భూముల రక్షణకు సరిహద్దుల చుట్టూ దిమ్మెలను నిర్మించి కంచెను ఏర్పాటు చేశారు. అనంతర కాలంలో ఆ నిర్మాణాలను అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ స్థలంలో ముళ్లపొదలు ఏపుగా పెరిగాయి. ఖాళీగా ఉన్న ఈ విలువైన భూములపై కన్నేసిన కొంత మంది బడా నేతలు ఈ స్థలానికి ఆనుకుని ఉన్న ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేశారు. ఆ స్థలాన్ని జేసీబీ యంత్రాలతో చదును చేస్తున్న క్రమంలోనే ఆర్టీసీకి కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని కబ్జా చేశారు. అధికారులు రక్షణగా ఏర్పాటు చేసిన సిమెంట్‌ దిమ్మెలు, బోర్డులు, కంచెను ధ్వంసం చేశారు. దీనిపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఆక్రమణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తాము రాష్ట్ర మంత్రి అనుచరులమంటూ బెదిరించారు. ఆక్రమించిన భూమిలో ఇప్పటికే ఒక భవన నిర్మాణాన్ని మొదలుపెట్టారు. సందట్లో సడేమియా అన్నట్లు ఓ వ్యాపారి ఆర్టీసీకి చెందిన భూమిలోనే బోరు బావిని తవ్వించి భూగర్భ జలాలను తోడుతూ రూ.లక్షల్లో వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. ఈ కబ్జా బాగోతం సంబంధిత అధికారులకు తెలిసినా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

యథేచ్ఛగా అసైన్డ్‌ భూముల విక్రయాలు
ఆర్జీఐ విమానాశ్రయానికి ఆనుకొని ఉన్న రషీద్‌గూడలో అసైన్డ్‌ భూముల క్రయ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రషీద్‌గూడ సర్వే నెంబర్‌ 78లో 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములను రషీద్‌గూడ, పోశెట్టిగూడ, గొల్లపల్లి గ్రామాలకు చెందిన 20 మంది రైతులకు ప్రభుత్వం కేటాయించింది. ఈ భూముల మధ్య నుంచి రెండు వరుసల రహదారిని ఔటర్‌ సర్వీస్‌ రోడ్డుకు అనుసంధానించారు. దీంతో ఈ భూములకు డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలోనే ఇక్కడి అసైన్డ్‌ భూములు, ప్రభుత్వ భూములు భారీగా చేతులు మారుతున్నాయి.

క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించా
ఆర్టీసీకి కేటాయించిన ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనమాట వాస్తవమే. అక్కడ అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను నిలిపివేయించా. ఈ భూముల్లోకి ప్రవేశిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించా.
జనార్దన్‌రావు, తహసీల్దార్‌, శంషాబాద్‌

(Courtesy Eenadu)