ఆట వస్తువుల్లో మార్పు, ఆలోచనల్లో ఉద్రేకం, ఉద్విగత
పలు అధ్యయనాల్లో వెల్లడి

న్యూఢిల్లీ: మత ఘర్షణల సందర్భంగా జరిగే హింసాత్మక సంఘటనలు చిన్నారులు, టీనేజర్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి..? చిన్నారులు ఆడుకునే వస్తువుల ఎంపికలో మార్పు, టీనేజర్లలో ఉద్వేగాలు, ఉద్రేకాలకూ కారణమవుతున్నాయా..? భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు పసి మొగ్గల మనసుల్లో రేపే కల్లోలంపై ప్రత్యేక కథనం..

1992 డిసెంబర్‌ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత దేశంలోని పలు పట్టణాలు, నగరాల్లో జరిగిన హింస, 1993 మార్చి 12న ముంబయిలోని పలు చోట్ల బాంబు పేలుళ్ల ఘటనల తర్వాత పరిశోధక సంస్థలు ఈ అంశంపై అధ్యయనం నిర్వహించాయి. మొదటి ఘటనలో హిందూ సంస్థలకు చెందినవారు నిందితులు కాగా, రెండో సంఘటనలో మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, అతని అనుచరులు నిందితులు. ఇలాంటి ఘటనల తర్వాత చిన్నారులు, టీనేజర్లలో విషాదానంతర ఒత్తిడి రుగ్మత(పీటీఎస్‌డీ)ని గుర్తించినట్టు టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ పరిశోధక బృందం తెలిపింది.
పీటీఎస్‌డీ లక్షణాలు: బయటకు వెళ్లాలంటే భయం, ఇతర మతస్తుల చిన్నారులతో ఆడుకోవాలంటే భయం, పదపదే కడపు, తల నొప్పి సమస్యలు, ఉద్వేగపూరిత తిరస్కరణ భావన, మానసిక కృంగుబాటు, ఆందోళనతో కూడిన ఎడబాటు… హింసాత్మక ఘటనల తర్వాత చిన్నారులు, టీనేజర్లలో కనిపించే లక్షణాలుగా వీటిని గుర్తించారు. కొన్ని నెలలుగా పాఠశాలలు మూతపడటం, ఇంటర్‌నెట్‌పై నిషేధం, నిత్యావసరాల కోసం కూడా బయట స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి.. ఇది నేటి కాశ్మీర్‌ దుస్థితి. అలాంటి చోట చిన్నారుల మనసుల్లో నాటుకుపోయే భావాలు ఎలా ఉంటాయి..? అక్కడి కొందరు చిన్నారులు సైనిక అధికారులుగా, మరికొందరు చిన్నారులు సైనికులపై దాడులకు పాల్పడే ముజాహిదీన్‌ తీవ్రవాదులుగా భావించుకుంటూ కొత్త ఆటల్ని కనిపెట్టినట్టుగా గుర్తించారు.

1992-93 మత కలహాల సందర్భంగా ముంబయికి చెందిన 11 ఏండ్ల బాలిక వ్రాసిన కవిత ఇలా ఉన్నది.. ‘ రక్తం..రక్తం..చుట్టూ రక్తం..నేలమీద రక్తం..ప్రేలుడు..ప్రేలుడు..అరుపులు..రక్తం..రక్తం.. ఎందుకో నాకు తెలియదు..’ అంటూ అమాయకంగా ముక్తాయించింది.

ఇప్పుడు ఈశాన్య ఢిల్లీలో జరిగిన భయానక మతకలహాలు పిల్లలపై ఇప్పటికే ప్రభావం చూపాయనేందుకు ఓ జర్నలిస్ట్‌ కంటపడ్డ దృశ్యాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇనుప రాడ్లు, క్రికెట్‌ బ్యాట్లు ధరించిన బృందాలు వీధుల్లో తిరుగుతూ విద్వేష నినాదాలిస్తూ హింస, విధ్వంసానికి పాల్పడ్డ తీరు అక్కడి చిన్నారులు, యువకులపై ప్రభావం చూపాయి. బాబర్‌పురాలో ఓ మతానికి చెందిన యువకుడు క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకొని ఆత్మరక్షణకు సిద్ధపడగా, విజరుపార్క్‌లో మరో మతానికి చెందిన టీనేజర్‌ ఇనుప రాడ్‌ పట్టుకొని అలర్టయ్యాడు. చిన్నారులు, టీనేజర్లలోనూ మతం పేరుతో వేరు భావన కలిగిస్తున్నదెవరు..? ఓ మతానికి మరో మతంవాళ్లు పరాయివాళ్లు అన్న సంకుచిత సిద్ధాంతాలతో పసి మనసుల్ని కలుషితం చేస్తున్నది ఎవరైనా సంఘ విద్రోహులు కాదా..? ఎందుకీ మతాల గొడవ..? మతాల మధ్య విద్వేషాలు రగిల్చి, తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూడటం ఎంత దిగజారుడుతనమో సహేతుకంగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది.

Courteys Nava telangana