• ఫామ్‌హౌస్‌-గుట్టకు రహదారి విస్తరణ.. బోరును పూడ్చడంతో ఎండిన పైరు

యాదాద్రి: ఆయన రెండెకరాల రైతు. ఆ భూమినే నమ్ముకుని జీవిస్తున్నారు. ఆరు బోర్లు వేస్తే ఒకే ఒక బోరుబావిలో నీళ్లు పడ్డాయి. రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇప్పుడు ఆ బోరుబావిని పూడ్చటంతో రైతు రోడ్డున పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాల మర్రి గ్రామంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫామ్‌హౌ్‌సకు, యాదగిరిగుట్టకు మధ్య రోడ్డును రోడ్లు భవనాల శాఖ విస్తరిస్తోంది. అందులో భాగంగా లక్కాకుల మల్లేశం పొలంలో వేసుకున్న బోరుబావిని పూడ్చేశారు.దీంతో సాగుకు సిద్ధం చేసిన దుక్కిమళ్లు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దాంతో రైతు బోరును తిరిగి తెరిచారు. అదనంగా కేసింగ్‌ వేసి, సాగునీటి అవసరాల కోసం తాపత్రయ పడుతున్నాడు. తమ భూమిలో రోడ్డు నిర్మాణం పై అధికారులను నిలదీస్తే పొంతన లేని సమాధానాలతో దాటవేశారని నిర్వాసిత రైతు మల్లేశం తెలిపారు. వాహనాలే తిరగని మార్గంలో ఎప్పుడో ఒకసారి సీఎం వెళ్లడానికి తమ పంట పొలాలు, బోరు బావులను పూడ్చి వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

పంటను కాపాడేందుకు రైతు తిప్పలు.. బోరును తెరిచి కేసింగ్‌ వేసిన వైనం
సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ఉన్న ఎర్రవెల్లి గ్రామం నుంచి యాదగిరిగుట్టకు నేరుగా విశాలమైన రహదారి నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదించారు. ఎర్రవెల్లి నుంచి కొండాపూర్‌ వరకు ఇప్పటికే రహదారి ఉంది. అక్కడి నుంచి వాసాలమర్రి వరకు 4.6 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు వేయనున్నారు. ఇందుకు రూ.7 కోట్లు మం జూరు చేశారు. యాదగిరిగుట్ట ఆలయ ఉద్ఘాటన నాటికి ఎర్రవెల్లి నుంచి యాదాద్రికి కేసీఆర్‌ నేరుగా రాకపోకలు సాగించడానికి అనువుగా రోడ్డును సిద్ధం చేయనున్నారు. ఎలాంటి భూసేకరణ, టెండరు లేకుండా చేపట్టారు. పంట పొలాలను ధ్వంసం చేస్తూ 50-60 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల ఇళ్లు కూడా తొలగించడానికి సిద్ధమయ్యారు. సీఎం ఆదేశమని, నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని దబాయించి మరీ పనులు చేస్తున్నారు. నిర్వాసితులు జేసీకి ఫిర్యాదు చేశారు. తుర్కపల్లిలో రైతులు రాస్తారోకో చేశారు.

(Courtesy Andhrajyothi)