పెరుగుతున్న సముద్ర మట్టాలతో 30 కోట్ల మందికి పెను ప్రమాదం

  • అందులో మూడున్నర కోట్ల మంది ముంబై, కోల్‌కతా నగరాల ప్రజలే
  • క్లైమేట్‌ సెంట్రల్‌ అధ్యయనంలో వెల్లడి

భూతాపం వల్ల మంచు ఖండాలు పెరుగుతున్న సముద్రమట్టాలతో 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా పలు సముద్ర తీర నగరాలు ముంపునకు గురికానున్నాయి! ముంపు ముప్పు పొంచి ఉన్న నగరాల్లో మన ముంబై, కోల్‌కతా కూడా ఉన్నాయని అమెరికాకు చెందిన క్లైమేట్‌ సెంట్రల్‌ సంస్థ అధ్యయనంలో తేలింది. పెరుగుతున్న సముద్రమట్టాల వల్ల ఈ నగరాల్లో చాలా భాగాలకు ముంపు ముప్పు ఉందని నాసా షటిల్‌ రాడార్‌ టోపోగ్రఫీ మిషన్‌ (ఎస్‌ఆర్‌టీఎం) ద్వారా గతంలోనే హెచ్చరించింది. ముంబై, కోల్‌కతాల్లో తీరప్రాంతాల మునక వల్ల 50 లక్షల మందికి ప్రమాదం ఉందని నాసా హెచ్చరిస్తే, దాదాపు 3.5 కోట్ల మందికి ముప్పు ఉందని క్లైమేట్‌ సెంట్రల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. నాసా సముద్ర ఉపరితలాల పెరుగుదల ఆధారంగా లెక్కలు వేస్తే క్లైమేట్‌ సెంట్రల్‌ సంస్థ కోస్టల్‌ ఐడీఈఎం విధానంలో కృత్రిమ మేధ సాయంతో అధ్యయనం నిర్వహించింది.

  • కర్బన ఉద్గారాలను ఇప్పటికిప్పుడు పూర్తిగా తగ్గించినా సరే ఈ శతాబ్దంలో సముద్ర మట్టాలు మరో 0.5మీటర్ల మేర పెరుగుతాయి. అంటార్కిటిక్‌ ఐస్‌ షీట్‌ అస్థిరతను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆ పెరుగుదల 2 మీటర్ల దాకా ఉండే ప్రమాదం పొంచి ఉంది. అంటే.. రెండు నుంచి ఏడడగుల ఎత్తు దాకా అన్నమాట!!
  • పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల తీరప్రాంతా లు మునిగి 30కోట్ల మంది ఇబ్బంది పడనున్నారు.
  • ప్రస్తుతం 20 కోట్ల మంది ప్రజలకు ఆవాసంగా ఉన్న తీరప్రాంతాలను 2100 నాటికి సముద్ర జలాలు శాశ్వతంగా ఆక్రమిస్తాయి.
  • సముద్ర జలాలు శాశ్వతంగా ఆక్రమించే స్థలాలు ఎక్కువగా ఉన్నది ఆసియా ఖండంలోనే. చైనా, బంగ్లాదేశ్‌, భారత్‌, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌, వియత్నాం, జపాన్‌ దేశాలకు ముప్పు ఎక్కువ.
  • దక్షిణ వియత్నాం పూర్తిగా మునిగిపోయే ముప్పుంది. అలాగే, థాయ్‌లాండ్‌ భూభాగంలో 10శాతం జలసమాధి కానుంది. షాంఘై నగరంలోకి సముద్ర జలాలు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది.
  • సముద్ర మట్టాల పెరుగుదల వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యే దేశాలు.. బంగ్లాదేశ్‌, చైనా. బంగ్లాదేశ్‌లో 9.3 కోట్ల మంది.. చైనాలో 4.2 కోట్ల మంది ప్రభావితమవుతారు.
  • 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు 11 నుంచి 16 సెంటీ మీటర్ల మేర పెరిగాయి.
  • Courtesy Andhrajyothi…