ఇద్దరం కలిసి ప్రదీప్‌ ఇంట్లో బాగా మద్యం తాగాం. మొబైల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు చూశాం. అప్పటికి సాయంత్రం ఆరు గంటలైంది. ఇద్దరం బయటికొచ్చి దారిలో మరోసారి తాగాం. మాకు శృంగారంలో పాల్గొనాలనిపించింది. మా ఇంటి వద్దకు వెళ్లేసరికి ఐదేళ్ల అమ్మాయి అక్కడ ఆడుకుంటూ కనిపించింది. వెంటనే నేను బయటికెళ్లి చాక్లెట్‌ తీసుకొచ్చి.. అదిస్తానని చెప్పి లోపలికి తీసుకెళ్లి రేప్‌ చేశాను. పాపకు తీవ్ర రక్తస్రావం అవుతున్నా.. నా తర్వాత ప్రదీప్‌ కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం బయటపడితే ప్రమాదమని భావించి ఆమె గొంతుకు ఉరి బిగించాం.

  • ఢిల్లీలో 2013లో ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన మనోజ్‌కుమార్‌ వాంగ్మూలం
  • విచక్షణ మరిచేలా చేసే పోర్న్‌ వీక్షణం
  • పోర్న్‌ ప్రభావం తమపై ఉందన్న పలువురు నిందితులు
  • 2001 నుంచి 2017కు దేశంలో రేప్‌లు రెట్టింపు
  • అత్యాచారాలకు, మొబైల్‌ డేటా విప్లవానికి లంకె
  • పోర్న్‌ సైట్లను దేశంలోకి రానివ్వని చైనా
  • గ్రేట్‌ ఫైర్‌వాల్‌ ఆఫ్‌ చైనాతో పూర్తి కట్టడి

‘‘మేమంతా మొబైల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు చూశాం. మా పొరుగునే ఉన్న అమ్మాయికి చాక్లెట్‌ ఆశ చూపించి లోపలికి తీసుకెళ్లి రేప్‌ చేశాం’’ 2013లో ఢిల్లీలో 8 ఏళ్ల బాలికను గ్యాంగ్‌ రేప్‌ చేసిన ఐదుగురు మైనర్ల వాంగ్మూలం సారాంశమిది. ఆ ఐదుగురూ 9 నుంచి 14 ఏళ్లలోపు బాలురు.

..నాటి నిర్భయ ఘటన నుంచి నిన్నమొన్నటి దిశ, సమత హత్యాచార ఘటనల దాకా దేశవ్యాప్తంగా ఎన్నో అకృత్యాలు! దేశంలో ప్రతి ఆరు గంటలకూ ఒక మహిళపై అత్యాచారం జరుగుతోందని ‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో’ గణాంకాలు చెబుతున్నాయి. సాక్షాత్తూ దేశ రాజధానిలోనే సగటున రోజుకు ఐదుగురు మహిళలు అత్యాచారానికి నీలిచిత్రాల వీక్షణం. అశ్లీల చిత్రాలను చూడడం వల్ల వారిలో ఆ కోరిక తగ్గి, లైంగిక నేరాలు తగ్గుతాయని కొందరు వాదిస్తే.. పోర్న్‌వల్లే లైంగిక నేరాల సంఖ్య మరింతగా పెరుగుతోందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకప్పుడు కంప్యూటర్లకు మాత్రమే పరిమితమైన ఇంటర్‌నెట్‌, పోర్న్‌ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల కారణంగా అరచేతిలోకి విచ్చలవిడిగా వచ్చేయడానికి.. నిర్భయ, దిశ, సమత వంటి హత్యాచార ఘటనలు పెరగడానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే.. ఉందని కొన్ని అధ్యయనాలు తేల్చిచెబుతున్నాయి. తరచుగా నీలిచిత్రాలను వీక్షించేవారి మెదడులో ప్రీఫ్రంటల్‌ కార్టెక్స్‌ భాగం దెబ్బతింటుందని పలు అధ్యయనాల్లో తేలిందని కెనడాకు చెందిన ‘యూనివర్సిటీ లావల్‌’ పరిశోధకుడు రాచెల్‌ యాన్‌ బార్‌ తెలిపారు. ఇది దెబ్బతినడం వల్ల వారు జువెనైల్‌ స్టేట్‌లోకి.. అంటే, విచక్షణ జ్ఞానంలోని పిల్లల స్థితిలోకి వెళ్లిపోతారని ఆయన వివరించారు. ఈ ప్రీఫ్రంటల్‌ కార్టెక్స్‌ దెబ్బతినడం వల్ల వారిలో నిర్ణయం తీసుకునే శక్తి లోపిస్తుందని.. తాము చేసేది తప్పని తెలిసినా, దాన్ని చేయకుండా ఉండలేని స్థితిలోకి నెట్టేస్తుందని (కంపల్సివ్‌ బిహేవియర్‌) రాచెల్‌ వెల్లడించారు. ‘‘పెద్దల’ చిత్రాలు వీక్షించేవారి మెదడులోని నాడుల నిర్మాణం అందుకు విరుద్ధంగా ‘చిన్నపిల్లల స్థితి (యుక్తాయుక్త విచక్షణ తెలియని జువెనైల్‌ స్టేట్‌)’లోకి వెళ్లిపోతుంది. ఇంకా విషాదమేంటంటే.. నీలిచిత్రాల వీక్షణం వల్ల శృంగారపరమైన సంతృప్తి లభిస్తుందని అంతా అనుకుంటారు. కానీ, కాలక్రమంలో దానికి విరుద్ధమైన ఫలితాలు వస్తాయి’’అని రాచెల్‌ హెచ్చరించారు. ‘‘పోర్న్‌ వీక్షణం మన నాడీ వ్యవస్థ నిర్మాణాన్ని లొంగదీసుకుని.. కుంగుబాటు నుంచి అంగస్తంభన వైఫల్యం దాకా దారుణమైన పర్యవసానాలకు దారితీస్తోంది. దీర్ఘకాలంగా నీలిచిత్రాలను చూసే మగవారిలో అంగస్తంభన, మహిళలైతే భావప్రాప్తికి చేరడం కష్టంగా మారుతుంది’’అని రాచెల్‌ హెచ్చరిస్తున్నారు.

అందరూ రేపిస్టులు కారుగానీ
నిత్యం నీలిచిత్రాలు చూసేవారందరూ రేపిస్టులు కారు. కానీ.. అత్యాచారాలకు పాల్పడినవారిలో చాలామందికి ఆ అలవాటు ఉండడం యాదృచ్ఛికం కాదు. అమెరికాలోని మిచిగన్‌ పోలీసు డిపార్ట్‌మెంట్‌ దర్యాప్తు చేసిన లైంగిక నేరాలను పరిశీలిస్తే.. నేరాలకు పాల్పడినవారిలో 41 శాతం మందికి నీలిచిత్రాలను వీక్షించే అలవాటు ఉందని, ఆ చిత్రాల్లో తాము చూసిన వాటినే వారు అనుకరించారని తేలింది. అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ హ్యాంప్‌షైర్‌’ పరిశోధకులు చేసిన మరో అధ్యయనంలో.. పోర్న్‌ మ్యాగజైన్లు చదివే పాఠకులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అత్యాచారాల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని తేలింది. మొదటి దశలో మామూలు నీలిచిత్రాలు చూసేవారు కూడా కొన్నాళ్ల తర్వాత వాటివల్ల ఆనందం లభించక.. వికృతమైన రేప్‌ పోర్న్‌కు అలవాటు పడతారని మనస్తత్వ శాస్త్రనిపుణులు చెబుతున్నారు. అత్యాచారాలకు అడ్డుకట్ట వేయాలంటే ఆన్‌లైన్‌ పోర్న్‌కు కళ్లెం వేయడం అందుకు ఒక ప్రధాన మార్గమని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇచ్చేముందు.. పోర్న్‌ వీక్షించడానికి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
గణాంకాలు కలిగిస్తున్న ఆందోళన
మన దేశంలో రేప్‌ల సంఖ్యకు.. డేటా విప్లవానికి మధ్య సంబంధాన్ని చెప్పడానికి ఈ గణాంకాలు సరిపోతాయి. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం మనదేశంలో 2001లో ఫిర్యాదుకు నోచుకున్న అత్యాచారాల సంఖ్య 16,075. డేటా అందుబాటులోకి వచ్చిన 2012-13 నాటికి ఆ సంఖ్య రెట్టింపైంది. 2016లో 38 వేలకు చేరింది. ఆ లెక్కలు చూస్తే..
2010 – 22172
2011 – 24206
2012 – 24923
2013 – 33707
2014 – 36735
2015 – 34651
2016 – 38997
2017 – 32559

పోర్న్‌పై చైనా యుద్ధం 

పలు ఇతర దేశాలదీ అదే బాట
‘‘కాకులు దూరని కారడవి’’.. ‘‘చీమలు దూరని చిట్టడవి’’.. అని పుస్తకాల్లో చదువుకున్నాం. అలాంటి అడవులున్నాయోలేదో కానీ.. పోర్న్‌ (అశ్లీలత) దూరని నెట్‌వర్క్‌ను మాత్రం డ్రాగన్‌ దేశం చైనా సమర్థంగా నిర్వహిస్తోంది. ‘ఇంటర్నెట్‌ సెన్సార్‌షిప్‌’ విషయంలో ఎంతో ముందంజలో ఉంది. రెండు దశాబ్దాల క్రితం నుంచి చేపట్టిన చర్యలతో.. వెబ్‌లో ఒక్కో ఇటుకా పేర్చి.. శక్తిమంతమైన ఫైర్‌‘వాల్‌’ను నిర్మించగలిగింది. దాన్ని ‘గ్రేట్‌ ఫైర్‌వాల్‌ ఆఫ్‌ చైనా’గా వ్యవహరిస్తున్నారు. సెన్సార్‌షి్‌పను పర్యవేక్షించే సైబర్‌స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ చైనా(సీఏసీ) ఏదైనా ఒక కీవర్డ్‌ను ఎంచుకుందంటే.. ఆ దేశంలో ఆ పదానికి సంబంధించిన సమాచారం వెబ్‌లో దొరకడం అసాధ్యం. వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ (వీపీఎన్‌), టోర్‌ లాంటి బ్రౌజర్ల ద్వారా అలాంటి పదాలను సెర్చ్‌ చేయగలిగినా.. పాకెట్‌ ఇన్‌స్పెక్షన్‌ ద్వారా నిరంతర నిఘా ఉంటుంది. అలాంటి నెటిజన్లను బ్లాక్‌లిస్టులో పెడతారు. అదే జరిగితే.. వారికి ఎక్కడా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ దొరకదు. ఈ కారణాలతో అక్కడి యూజర్లు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. ఆ స్థాయిలో కాకున్నా.. దక్షిణ కొరియా, యూకే, ఉగాండా, జపాన్‌, ఆస్ట్రేలియా సైతం ఆన్‌లైన్‌ పోర్న్‌ నిరోధానికి చర్యలు తీసుకుంటున్నాయి. కానీ.. డార్క్‌నెట్‌ ద్వారా చాలా మంది వాటిని యాక్సెస్‌ చేయగలుగుతున్నారు.

(Courtesy Andhrajyothi)