కరోనా వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి అనేక దేశాలు అత్యవసర చర్యలు తీసుకున్నాయి. తమ చట్టాల ప్రకారం అత్యవసర పరిస్థితిని ప్రకటించి, లాక్‌డౌన్‌తో రోగవ్యాప్తిని నిరోధించే ప్రయత్నం చేశాయి. సామాజిక దూరం, ప్రయాణాల నియంత్రణతో పాటు, అనుమానిత, నిర్థారిత రోగులను నిర్బంధం, ఒంటరిగా ఉంచడం వంటి విధానాలతో చికిత్స అందిస్తున్నాయి.

అంతర్జాతీయ హెల్త్‌ రెగ్యులేషన్స్‌, 2005 ప్రకారం ప్రపంచ ఆరోగ్యసంస్థలోని 196 దేశాలు ప్రపంచవ్యాధుల నియంత్రణకు ఈ సంస్థ నిబంధనలను అనుసరించాలి. అంతర్జాతీయ ప్రయాణాల నియంత్రణ అనేది ఆర్టికల్‌ 43కు అనుగుణంగా శాస్త్రీయంగా, మానవహక్కులను కాపాడేరీతిలో ఉండాలి. కానీ, పలుదేశాలు ప్రయాణాలపై ఏకపక్షంగా నిషేధం విధించి ‘వియన్నా కన్వెన్షన్‌ ఆన్‌ లా ఆఫ్‌ ట్రీటీ’ని ఉల్లంఘించాయి. చాలాదేశాలు తీసుకున్న రవాణా నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్‌ నిర్ణయాలు ప్రపంచ ఆరోగ్యసంస్థ శాస్త్రీయ నియమాలుగా గుర్తించినవి కావు. ప్రయాణ నియంత్రణ వల్ల జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువని సంస్థ ప్రకటించింది.

ఆర్టికల్‌ 43.1 ప్రకారం అంతర్జాతీయ ప్రయాణాల రద్దుకన్నా, ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలకు, మెళకువలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది. ప్రవేశం, నిష్క్రమణ పరీక్షలు సమర్థవంతంగా చేయాలని సూచించింది. ఇక, ఏ దేశానికీ, ఆర్టికల్‌ 43.2 ప్రకారం అదనపు ఆరోగ్యనియమాలు పెట్టేందుకు అనుమతి లేదని కూడా అన్నది. ఆర్టికల్‌ 3.1 ప్రకారం ప్రభుత్వం తీసుకొనే అదనపు ఆరోగ్యచర్యలన్నీ వ్యక్తుల గౌరవాన్నీ, హక్కులను కాపాడుతూ, ప్రాథమిక స్వేచ్ఛను అందించేవిగా ఉండాలి. ప్రజారోగ్యానికి ప్రభుత్వాలు కల్పించే చర్యలు జాత్యహంకారం, విదేశీయుల పట్ల ద్వేషభావం కలిగించేవిగా ఉండకూడదు. ఆరోగ్యసంస్థ చెబుతున్న ప్రకారం, మూడింట రెండువంతుల దేశాలు తాము తీసుకున్న అదనపు ప్రమాణాల వివరాలు తెలియచేయలేదు. దీనివల్ల మహమ్మారిపై పోరులో జవాబుదారీ తనం లోపిస్తుంది.

కరోనా మహమ్మారి నియంత్రణలో తమ విధానం అద్భుతమని కేంద్ర ఆరోగ్యశాఖ తనను తాను ప్రశంసించుకుంది. ప్రభుత్వం అత్యవసరంగా ప్రకటించిన లాక్‌డౌన్‌వల్ల ఎంతో మేలు జరిగిందనీ, లక్షలాదిమందిని కాపాడుకోగలిగామని అన్నది. కానీ, నేడు దేశంలో కరోనా కేసులు దాదాపు లక్షా డెబ్బయ్‌ ఐదువేలకు చేరుకున్నాయి. మరణాలు ఐదువేలను తాకుతున్నాయి. రోజూ వందలాది కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. దీనిద్వారా ప్రభుత్వ లాక్‌డౌన్‌, నియంత్రణ చర్యలు మహమ్మారిని నియంత్రించడం అటుంచితే, ఆరోగ్య ఎమర్జెన్సీ పేరిట ప్రజల హక్కులను ప్రభుత్వం తీవ్రంగా హరించినట్లు అర్థమవుతుంది. ఆకస్మిక లాక్‌డౌన్‌తో కూలీలు, దినసరి వేతనజీవులు, పేదలు, పలు ప్రైవేటు ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి లోనైనారు. ఆర్థికంగా కష్టాల పాలైనారు. పోలీసుల లాఠీ దెబ్బలూ తిన్నారు. మన రాజ్యాంగం అత్యయిక పరిస్థితి విధింపునకు యుద్ధం, విదేశీ దురాక్రమణ, అంతర్గత పోరు అనే మూడు కారణాలకు మాత్రమే అనుమతిస్తుంది.

కరోనా వీటి పరిధిలోకి రాదు కనుక కేంద్రం గతకాలపు చట్టాలను అమలు చేసి ఎమర్జెన్సీ తలపించే చర్యలు చేపట్టింది. మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం కారణంగా వివక్షతను రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15 నిషేధిస్తుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం వివక్షతపై పలు మార్గదర్శకాలను ఇచ్చింది. కానీ, ప్రభుత్వం అండతో, అధికారపక్షానికి అనుబంధంగా ఉన్న సంస్థలు మైనారిటీలపై దుష్ప్రచారానికి పూనుకున్నాయి. ప్రభుత్వాధికారులు సైతం మైనారిటీలు లక్ష్యంగా కరోనా వ్యాప్తిని వారికి ఆపాదించి హక్కులకు విఘాతం కలిగించారు. ఏప్రిల్‌ 18న విడుదలైన ఆరోగ్య–కుటుంబసంక్షేమ శాఖ ప్రకటనలో కరోనా వ్యాప్తిని ఓ మైనారిటీ సంస్థకు ఆపాదించారు. గత ఏడాది ప్రభుత్వం చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని ప్రజాస్వామిక వాదులు, మైనారిటీలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ఉద్యమకారులపై దేశద్రోహం, టెర్రరిస్టు చట్టాలను ప్రయోగించి జైలుకు పంపిస్తున్నది.

సుప్రీంకోర్టు కరోనా తీవ్రతపై ‘సుమోటో’గా స్పందించి జైలులో ఉన్న ఖైదీల ఆరోగ్య, ప్రాణరక్షణ నిమిత్తం సడలింపులతో వారి విడుదలకై ఆదేశించింది. కానీ, కేంద్రప్రభుత్వం కరోనా కాలాన్ని ఓ అదనుగా భావించి సీఏఏకు వ్యతిరేకంగా గళమెత్తిన మేధావులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మైనారిటీప్రజలను దేశద్రోహులన్న ముద్రతో జైళ్ళలోనే ఉంచుతున్నది, పంపుతున్నది. జామియా మిలియా ఇస్లామియా రీసెర్చి స్కాలర్‌ సపూరా జర్కర్‌ను గర్భిణీ అని కూడా చూడకుండా జైలుకు పంపారు. అదేవిధంగా, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసిన పలు రాష్ట్రాల జర్నలిస్టులపై ఊపా చట్టం పెట్టి జైలుకు పంపుతున్నారు. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిటీ ప్రకారం ప్రజలపై ఆరోగ్య ఎమర్జెన్సీని వారి మానవ హక్కులను గౌరవిస్తూ అమలు పరచాలి. కరోనాపై పోరు శాస్త్రీయ విధానంతో సాగుతూ ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.

అప్పం చంద్రశేఖర్‌
న్యాయవాది

Courtesy AndhraJyothy