• 74వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?
  • కేసీఆర్‌.. చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
  • జ్యుడీషియల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
  • సీబీఐ విచారణ కోరతాం: భట్టి

ఆంధ్రప్రదేశ్‌లో రివర్స్‌ టెండరింగ్‌ సాహసోపేత నిర్ణయమని సీఎం కేసీఆర్‌ అభివర్ణించడాన్ని తాను స్వాగతిస్తున్నానని, తెలంగాణలోనూ ఆ విధానాన్ని అమలు చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని ప్రాజెక్టుల టెండరింగ్‌ విధానాలపై జ్యుడీషియల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మాట్లాడారు. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తే తెలంగాణలోనూ కనీసం 12 నుంచి 13% తక్కువకు టెండర్లు వేసేవారని అభిప్రాయపడ్డారు. కాంట్రాక్టర్లు కనీసం 10% మార్జిన్‌ చూసుకుని పనిచేస్తారని చెప్పారు. మొత్తంగా నీటిపారుదల, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులపై లెస్‌, మార్జిన్‌ కలిపి 20% లెక్కేసుకున్నా దాదాపు రూ.74వేల కోట్లు తేలుతోందని, ఆ డబ్బు అంతా ఎవరి జేబుల్లోకి పోయిందో సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇరిగేషన్‌ కోసం ఇప్పటికే రూ.లక్ష కోట్లను ఖర్చు చేశామని, రానున్న రోజుల్లో మరో రూ.1.25లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని గుర్తు చేశారు. మొత్తంగా రూ.2.25 లక్షల కోట్లలో 12% తక్కువకు టెండర్లు వేసి ఉంటే కనీసం రూ.28వేల కోట్లు ఆదా అయ్యేది అన్నారు. ఇక, మిషన్‌భగీరథ ప్రాజెక్టులో రూ.50వేల కోట్లు ఖర్చు చేశారని, దాంట్లో 12% తక్కువ అనుకుంటే రూ.6వేల కోట్లు మిగిలేవన్నారు. మొత్తంగా ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథ ప్రాజెక్టుల్లో కలిపి రూ.34వేల కోట్లు దుబారా అయ్యేవికాదని వివరించారు. టెండరింగ్‌ విధానంపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. వివరాలన్నీ సేకరించి తాము సీబీఐ విచారణను కోరుతామని ఆయన చెప్పారు.

Courtesy AndhraJyothy..