-ప్రమాదంలో 18 లక్షల ఉద్యోగాలు
– ఉపశమన ప్యాకేజీ ఇవ్వాలి
– రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడి

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సంక్షోభం రిటైల్‌ రంగాన్ని అతలాకుతలం చేయనుందని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరి మొదట్లో ఆరంభమైన కరోనాతో మాల్స్‌, రిటైల్‌ స్టోర్స్‌కు వచ్చే వారి సంఖ్య భారీగా పడిపోయిందని, రెవెన్యూ క్షీణించిందని ఓ రిపోర్టులో పేర్కొంది. ఫిబ్రవరి ముగింపు నాటికే దాదాపుగా తమ వ్యాపారంలో 20-25 శాతం తగ్గుదల చోటు చేసుకున్నట్టు పేర్కొంది. దేశంలో దాదాపుగా 15 లక్షల మోడ్రన్‌ రిటైల్‌ స్టోర్లు ఉన్నాయని.. ఇవి ఏడాదికి రూ.4.74 లక్షల కోట్ల వ్యాపారం నమోదు చేస్తున్నాయని తెలిపింది. ఇందులో దాదాపుగా 60 లక్షల ఉద్యోగాలు పని చేస్తున్నారని పేర్కొంది. గడిచిన నెలన్నర రోజుల నుంచి వ్యాపారం భారీగా పడిపోయినట్టు వెల్లడించింది. మొత్తం మీద, దుస్తులు, ఆభరణాలు, పాదరక్షలు, కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, డ్యూరబుల్స్‌, ఐటి, టెలిఫోన్లు తదితర రిటైల్‌పై గణనీయమైన ప్రభావం చూపిందని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం అమలవుతున్న లాక్‌ డౌన్‌ పరిస్థితులు వచ్చే జూన్‌ వరకు కొనసాగితే 30 శాతం రిటైల్‌ స్టోర్లు మూత పడతాయని రిటైలర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సీఇఓ కుమార్‌ రాజ గోపాలన్‌ పేర్కొన్నారు. రిటైల్‌ స్టోర్లలో పని చేసే 18 లక్షల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో తెరిచి ఉంచడానికి అనుమతించబడిన అవసరమైన వస్తువులను విక్రయించే దుకాణాలకు నష్టాలు తప్పడం లేదన్నారు. ఇతర సాధారణ సరుకులను విక్రయించడానికి అనుమతి లేకపోవడంతో ఆయా సంస్థలను నష్టాలను చవి చూస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్‌, కెనడా, అమెరికా ప్రభుత్వాల మాదిరిగానే రిటైల్‌ పరిశ్రమకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై భారత ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. తమ కంపెనీల్లో చాలా మంది చిల్లర వ్యాపారులు తమ ఉద్యోగులకు 35-40 రోజుల చెల్లింపు సెలవు ఇస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. తమ ఉద్యోగులు, వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పామని అన్నారు. లాక్‌ డౌన్‌ సమయంలో వారికి వేతనం లభించేలా చూస్తామని వి-మార్ట్‌ రిటైల్‌ సీఎండి లలిత్‌ అగర్వాల్‌ చెప్పారు. ఉద్యోగులకు జీతాల భరోసా ఇవ్వడంతో పాటు, సంస్థ తన అమ్మకందారులకు మద్దతుగా రూ .1.5 కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని హౌస్‌ ఆఫ్‌ అనితా డోంగ్రే మేనేజింగ్‌ డైరెక్టర్‌ కవి మిశ్రా తెలిపారు. ఏప్రిల్‌ తర్వాత కూడా లాక్‌డౌన్‌ కొనసాగితే అనేక సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని రిటైలర్లు పేర్కొన్నారు.

Courtesy Nava Telangana