* కాశ్మీర్‌లో అనధికార ఎమర్జెన్సీ
* ఐఎఎస్‌ అధికారి కన్నన్‌ గోపీనాధన్‌

జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఆ రాష్ట్రంలో ఆంక్షలు విధించారు. అనేక ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో బలగాలను మోహరించారు. టెలిఫోన్‌, ఇంటర్నెట్‌ సర్వీసులను రద్దు చేశారు. రహదారుల్లో తిరిగేందుకు కూడా అనుమతించలేదు. రాష్ట్రంలో దాదాపు 15 రోజుల పాటు కర్ఫ్యూ విధిం చారు. దీంతో కేంద్రం తీసుకున్న చర్యలపై ఆ రాష్ట్ర ప్రజలు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయింది. దీనికి నిరసనగా కేరళకు చెందిన ఒక ఐఎఎస్‌ అధికారి కన్నన్‌ గోపీనాధన్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. జమ్ముకాశ్మీర్‌ లో కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ అనధికార అత్యవసర పరిస్థితులపై స్వేచ్ఛగా మాట్లాడేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు గోపీినాధన్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ‘ది వైర్‌’ అనే మీడియా సంస్థతో మాట్లాడారు. ‘ఇది యెమెన్‌ కాదు, 1970 దశాబ్ధం నాటి అత్యవసర పరిస్థి తులు అంతకంటే కాదు. రాష్ట్ర ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసు కోలేదు’ అని బిజెపి ప్రభుత్వ విధానాలను విమర్శించారు. ‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించి ఇప్పటికి దాదాపు 20 రోజులు పైగా గడిచింది. ఇకపై దీనిమీద నేను ఎంతమాత్రం నిశ్శబ్ధంగా ఉండలేను. ప్రజా స్వామ్య హక్కుల అణచివేతపై తాను ‘స్వేచ్ఛ’గా మాట్లాడేందుకే ఐఎఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేశానని పేర్కొన్నారు. గోపీనాధన్‌ 2012లో ఐఎఎస్‌ అధికారిగా విధుల్లో చేరారు. ఆ సమయంలో అతన్ని అరుణాచల్‌, గోవా, మిజోరాం, కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేశారు. అనంతరం జమ్ముకాశ్మీర్‌కు వెళ్లారు. ప్రస్తుతం అది కూడా కూడా కేంద్రపాలిత ప్రాంతంగా మారి పోయింది. అయితే ప్రస్తుతం ఆయనను దాద్రానగర్‌ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతానికి అటాచ్‌ చేశారు. కానీ, ఈనెల 21న తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ లేఖను పంపారు. తన రాజీనామా అమోదం పొందే వరకూ బహిరంగంగా ఏమీ చెప్పకూడదని అనుకున్నట్లు గోపీనాధన్‌ పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని తన సహోద్యోగులు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో బయటకు వచ్చిందన్నారు. ఇతర దేశాల నుంచి దాడులు, సాయుధ తిరుగుబాటులకు అవకాశం ఉన్న నేపథ్యంలోనే దేశంలో అత్యవసర పరిస్థితి విధించేందుకు భారత రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది, కానీ కాశ్మీర్‌లో అటువంటి పరిస్థితులు ఏమీ లేకుండానే ప్రజల స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోందని అన్నారు. 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. అంతర్గత ఆందోళనలు వంటి పరిస్థితులు కూడా ఎమర్జెన్సీ విధిం చేందుకు అవకాశం కల్పించట్లేదని పేర్కొ న్నారు. ‘అధికారికంగా ఎమర్జెన్సీ విధించి ఉండక పోవచ్చు, పాలనను మొత్తం ఐఎఎస్‌ అధికారులకు అప్పగించి ఉండవచ్చు, న్యాయ పరిష్కారాన్ని కోరేందుకు ప్రజలను నిరోధించనప్పటికీ, కోర్టులు స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు’ అని గోపీనాధన్‌ అన్నారు. ప్రధానంగా ఈ ఏడాది జనవరిలో ఐఎఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేసిన షా ఫైసల్‌ను అరెస్టు చేసిన విధానంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఈ నెల 19న ఢిల్లీ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలైంది. సాధారణంగా ఇటువంటి పిటిషన్లను అత్యవసర విచారణకు స్వీకరిస్తారు. అయితే సెప్టెంబర్‌ 3న మాత్రమే ఈ విషయాన్ని పరిశీలిస్తామని కోర్టు చెప్పడం గమనార్హం. రాజకీయ నాయకులు చెప్పిందే అధికారులు చేస్తారన్న భ్రమలు నేడు తొలగిపోతున్నాయని గోపినాధన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రాజీనామా తదుపరి కార్యాచరణపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ., ‘నేను అంత దూరం ఆలోచించలేదు. కానీ దేశంలోని ఒక రాష్ట్రంలో అనధికారికంగా ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఏం చేశారని 20 సంవత్సరాల తరువాత ఎవరైనా నన్ను అడిగితే, కనీసం ఐఎఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేశానని అయినా చెప్పుకోవాలి కదా..!’ అని అన్నారు.

(CourtacyPrajashakti)