సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: రిజర్వేషన్‌ ప్రాథమిక హక్కు కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 కింద దీనిని సవాలు చేయలేరంది. తమిళనాడు వైద్య కళాశాలల్లో ప్రవేశాల విషయమై అక్కడి రాజకీయ పక్షాలు వేసిన పిటిషన్ల విచారణ

సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. 2020-21కి సంబంధించి గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వైద్య, దంతవైద్య కోర్సులను నీట్‌ ద్వారా భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఆలిండియా కోటాలో తమిళనాడుకు సంబంధించిన సీట్లను సగం మేర ఓబీసీలకే కేటాయించాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది. అయితే ఇందుకు కేంద్రం అనుమతి నిరాకరించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే, డీఎంకే, సీపీఎం, సీపీఐ, తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ అంశంలో కేంద్ర ఆరోగ్యశాఖ, భారత వైద్య మండలి, జాతీయ పరీక్షల మండలిని ప్రతివాదులుగా పేర్కొంటూ నేతలు వైకో, అన్బుమణి రాందాస్‌లు కూడా వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌ల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ‘‘రిజర్వేషన్‌ ప్రాథమిక హక్కు కాదు. రాజ్యంగంలోని ఆర్టికల్‌ 32 కింద దీనిని సవాలు చేయలేరు’’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ అంశంపై మద్రాస్‌ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతిస్తూ, పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించింది. ఒక అంశంపై తమిళనాడు రాజకీయ పక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం పట్ల ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మరోవైపు… రిజర్వేషన్‌ ప్రాథమిక హక్కు కాదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.

Courtesy Eenadu