పెన్‌రోజ్‌, రెయిన్‌హార్డ్‌, ఆండ్రియాలకు భౌతిక శాస్త్రంలో పురస్కారం
బ్లాక్‌హోల్స్‌పై తిరుగులేని ఆధారాలకు గుర్తింపుగా..

స్టాక్‌హోం: విశ్వంలో అత్యంత నిగూఢ ఆకృతులుగా గుర్తింపు పొందిన కృష్ణబిలాల(బ్లాక్‌ హోల్స్‌) గుట్టు విప్పిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్‌ పురస్కారం వరించింది. బ్రిటన్‌కు చెందిన రోజర్‌ పెన్‌రోజ్‌, జర్మనీ శాస్త్రవేత్త రెయిన్‌హార్డ్‌ గెంజెల్‌, అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త ఆండ్రియా గెజ్‌లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. నోబెల్‌ పురస్కారం కింద దక్కే సుమారు 11 లక్షల డాలర్లలో సగం మొత్తాన్ని పెన్‌రోజ్‌కు ఇవ్వనున్నట్లు ఎంపిక కమిటీ ‘రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’ మంగళవారం తెలిపింది. మన పాలపుంత గెలాక్సీ మధ్య భాగంలో ఉన్న భారీ కృష్ణబిలాన్ని రెయిన్‌హార్డ్‌ గెంజెల్‌, ఆండ్రియా గెజ్‌లు కనుగొన్నారని, అవార్డు మొత్తంలో రెండో సగభాగాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలకు సమానంగా పంచనున్నట్లు వెల్లడించింది. ‘‘విశ్వంలో అత్యంత విచిత్రమైన కృష్ణబిలాల పరిశోధకులకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతిని ఇస్తున్నాం’’ అని నోబెల్‌ కమిటీలోని శాస్త్రవేత్తలు తెలిపారు.
విశ్వంలో ప్రతి గెలాక్సీలోనూ అత్యంత భారీ కృష్ణబిలాలు ఉన్నాయి. చిన్నపాటి బ్లాక్‌హోల్స్‌ విశ్వమంతటా.. అక్కడక్కడా వ్యాపించి ఉన్నాయి. వీటికి అపార గురుత్వాకర్షణ శక్తి ఉంది. వాటి నుంచి కాంతి కూడా తప్పించుకోలేదు. వీటిలో సూర్యుడి కన్నా అనేక రెట్లు ఎక్కువగా ఉండే పదార్థం.. ఒక నగరమంత ప్రాంతంలో కుక్కేసి ఉంటుంది. అందువల్ల వీటి సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి సమీపంలోని భారీ నక్షత్రాలనూ తమ వైపునకు ఆకర్షించి, మింగేస్తాయి.

గణితం సాయంతో..
కృష్ణబిలాల ఆవిర్భావం సాధ్యమేనని గణితశాస్త్ర విధానాల సాయంతో పెన్‌రోజ్‌ రుజువు చేశారు. ఈ క్రమంలో ఆయన విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టెయిన్‌ సూత్రీకరించిన సాపేక్ష సిద్ధాంతంపై ఆధారపడ్డారు. నిజానికి.. అంతుచిక్కని ఈ ఆకృతుల ఉనికిపై ఐన్‌స్టెయిన్‌కు అంతగా నమ్మకం లేదు. అయితే కృష్ణబిలాలు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయని 1965లో పెన్‌రోజ్‌ రుజువు చేశారు. వాటిని సవివరంగా వర్ణించారు. కృష్ణబిలాల మధ్య భాగంలో ‘సింగ్యులారిటీ’ అనే ప్రాంతం ఉంటుందని, అక్కడ ప్రకృతికి సంబంధించిన సిద్ధాంతాలేవీ పనిచేయవని పేర్కొన్నారు.

మన పాలపుంతలోనే..
1990ల నుంచి గెంజెల్‌, గెజ్‌ల నేతృత్వంలోని రెండు వేర్వేరు బృందాలు మన పాలపుంత గెలాక్సీ మధ్య భాగంలో ధూళితో నిండిన ‘సాజిటేరియస్‌ ఎ’ అనే భాగాన్ని నిశితంగా పరిశోధించాయి. అక్కడి ప్రకాశవంతమైన నక్షత్రాల గమనాన్ని మ్యాప్‌ చేశాయి. వీరి పరిశీలనల ప్రకారం.. ఆ ప్రాంతంలో అత్యంత భారీ, అదృశ్య ఖగోళవస్తువు ఒకటి చుట్టుపక్కల ఉన్న నక్షత్రాల కక్ష్యలకు మార్గనిర్దేశం చేస్తోంది. ఆ తారలను తన వైపునకు లాగడమే కాకుండా.. తన చుట్టూ శర వేగంగా తిరిగేలా చేస్తోంది. సూర్యుడితో పోలిస్తే దీని ద్రవ్యరాశి 40 లక్షల రెట్లు ఎక్కువగా ఉంది. కానీ అంత పదార్థం మన సౌర కుటుంబమంత ప్రాంతంలో కుక్కేసి ఉంది. దాన్ని అత్యంత భారీ కృష్ణబిలంగా వారు గుర్తించారు. ఈ పరిశోధనల కోసం గెంజెల్‌, గెజ్‌లు అత్యంత శక్తిమంతమైన టెలిస్కోపులను ఉపయోగించారు. దట్టంగా ఉండే వాయు, ధూళి మేఘాలను చీల్చుకుంటూ పరిశీలనలు సాగించే వినూత్న విధానాలను వారు కనుగొన్నారు. ‘‘ఈ క్రమంలో వారు సరికొత్త పరికరాలను అభివృద్ధి చేశారు. దీర్ఘకాల పరిశోధనకు అంకితమయ్యారు. వీరి కృషి వల్ల అత్యంత భారీ కృష్ణబిలాల ఉనికిపై తిరుగులేని ఆధారాలు లభించాయి’’ అని నోబెల్‌ కమిటీ పేర్కొంది.

నాలుగో మహిళ..
భౌతిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం పొందిన నాలుగో మహిళగా ఆండ్రియా గెజ్‌ గుర్తింపు పొందారు. 1903లో మేరీ క్యూరీ, 1963లో మరియా గోపెర్ట్‌ మేయర్‌, 2018లో డోనా స్ట్రిక్‌ల్యాండ్‌లను ఈ పురస్కారం వరించింది. గెజ్‌ తాజాగా స్పందిస్తూ.. ‘‘నాకు అవార్డు రావడం వల్ల ఈ రంగంలోకి మహిళలు ప్రవేశించడానికి స్ఫూర్తి కలిగిస్తుందని ఆశిస్తున్నా. సైన్స్‌ పట్ల మీకు అమితమైన మక్కువ ఉంటే.. ఈ రంగంలో చేయడానికి ఎంతో ఉంది’’ అని చెప్పారు.

హాకింగ్‌కూ వచ్చేదేమో..
1960లలో సాపేక్ష సిద్ధాంతంపై అధ్యయనాల కోసం పెన్‌రోజ్‌ స్ఫూర్తిని నింపారని బ్రిటిష్‌ ఖగోళ శాస్త్రవేత్త మార్టిన్‌రీస్‌ పేర్కొన్నారు. దివంగత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌తో కలిసి ఆయన ‘బిగ్‌ బ్యాంగ్‌’, కృష్ణబిలాలపై గట్టి ఆధారాలను సేకరించడంలో సాయపడ్డారని వివరించారు. ఐన్‌స్టెయిన్‌ తర్వాత గురుత్వాకర్షణ శక్తిపై అవగాహనను పెంచడంలో వీరిద్దరే ఎక్కువగా కృషి చేశారని తెలిపారు. ‘‘దురదృష్టవశాత్తు ఈ అంశంపై నోబెల్‌ బహుమతిని ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరగడం వల్ల ఆ ఘనతను హాకింగ్‌ అందుకోలేకపోయారు’’ అని చెప్పారు. హాకింగ్‌ 2018లో మరణించారు. నోబెల్‌ పురస్కారాలను జీవించి ఉన్నవారికే ఇస్తారు.

Courtesy Eenadu