ముంబయి : ఈ ఏడాది జూన్‌లో బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యతో దేశ వార్తా చానళ్లలో, సోషల్‌ మీడియా నెట్‌వర్కర్లలో, ఇంకా రాజకీయ ప్రపంచంలో కుట్ర సిద్ధాంతాలు వెలుగుచూశాయి. బాలీవుడ్‌లో బంధుప్రీతి, నటీనటుల మాదక ద్రవ్యాల వాడకం, ముంబై పోలీసుల ఆటంకం కలిగించే అంశాలు అందులో ఉన్నాయి. ఇప్పటి వరకు ముంబయి పోలీసులు చెబుతున్న ఆత్మహత్య కథనాన్నే ధ్రువ పరస్తూ ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వడంతో పైన చెప్పిన అంశాలన్నీ మరుగున పడిపోయాయి. దీంతో హత్య అన్న అనుమానాలకు ముగింపు ఇచ్చినట్లయింది.

అయితే గత మూడు నెలలుగా సుశాంత్‌ మరణం అనంతరం సృష్టించిన పుకార్లు ప్రజా జీవనంలో కీలక పాత్ర పోషించాయి. మంగళవారం సమాచార సాంకేతిక చట్టం కింద రెండు ఎఫ్‌ఐఆర్‌లను ముంబయి పోలీసులు నమోదు చేశారు. సుశాంత్‌ ఆత్మహత్యను హత్యగా చిత్రీకరించడం కోసం 80వేల ఫేక్‌ సోషల్‌ మీడియా ఖాతాలు పనిచేసినట్లు గుర్తించారు. అంటే పనిగట్టుకుని మరీ పుకార్లను వ్యాప్తి చేశారు. పోలీసుల దర్యాప్తును పక్కదోవ పట్టించేందుకు పుకార్లు కూడా అందులో భాగస్వామ్యమయ్యాయి. జూన్‌ 12 నుండి సెప్టెంబర్‌ 14 వరకు సుశాంత్‌ పై సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన అంశాలపై మిచిగాన్‌ యూనివర్శిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జోయోజీత్‌ పాల్‌ నేతృత్వంలో భారత్‌ మైక్రోసాఫ్ట్‌ రీసెర్చ్‌ ఇండియాలో ప్రిన్సిపల్‌ రీసెర్చర్‌ ఓ అధ్యయనం చేశారు. ఎలా కుట్ర సిద్ధాంతాన్ని బలవంతంగా తెరపైకి తీసుకువచ్చారో ఆ నివేదిక తెలుపుతుంది. ఆ అధ్యయనంలో న్యూస్‌ చానళ్లను ఆధారంగా చేసుకుని యూట్యూబ్‌ పేజీలు ఉండటం, ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ హ్యాష్‌ట్యాగ్‌లు, రాజకీయ నేతలు, జర్నలిస్టులు, మీడియా, ప్రభావవంతమైన వారికి సంబంధించిన ట్వీట్లు, అదేవిధంగా తప్పుడు సమాచారమని తెలిసి ఫ్యాక్‌ చెకర్ల తొలిగించిన అంశాలపై ఆధారంగా ఈ అధ్యయనం రూపుదిద్దుకుంది. ఇక అసలు విషయానికి వస్తే…దీని వెనుక ప్రధాన ఉద్దేశం.. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో ఉన్న మహాకూటమి ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకు బిజెపి చేసిన వ్యూహాత్మక రచన. కరోనా…లాక్‌డౌన్‌..వాటి మరణాలు..వలసకార్మికుల గురించి విని విని ఉన్న జనం..దానిపై ప్రశ్నించే ఆలోచన లేకుండా..వారి ఆలోచన శక్తిని మరల్చడానికి.. బిజెపి చేతుల్లో ఉన్న ఎల్లో మీడియా చేసిన ఓ పొలిటికల్‌ డ్రామానే సుశాంత్‌ ఆత్మహత్య అనంతరం పుకార్లను షికారు చేయించడం. అందుకోసం బిజెపి 80 వేల సోషల్‌ మీడియా నకిలీ అకౌంట్లను వాడుకుంది.

బిజెపి కుట్ర ఎలా సాగిందంటే…
జూన్‌ 14న సుశాంత్‌ మరణం అనంతరం ఆయనదీ ఆత్మహత్యేనంటూ తొలుత అన్ని మీడియాలు కొడై కూశాయి. అనుకోకుండా కొన్ని రోజులకు యూటర్న్‌ తీసుకుని కుట్ర సిద్ధాంతాలకు తెరలేపాయి. సుశాంత్‌ది హత్యేనంటూ పదేపదే చెప్పడం మొదలు పెట్టాయి. ఈ ధోరణి వెనుక బిజెపి ప్రత్యేక పాత్ర ఉందని నివేదికలో తేలింది. కాంగ్రెస్‌ ఆయనది ఆత్మహత్యే అని చెబుతుండగా…కాదూ కాదూ అది హత్యేనని బిజెపి..తన అలవాటైన వాదనను తీసుకువచ్చింది. జులై నుండి అది హత్యేనంటూ పదేపదే చెప్పుకొచ్చిందని డేటా తెలిపింది.

తదుపరి శివసేనపై గురి
రంగుల ప్రపంచం, రాజకీయం వేర్వేరు అయినప్పటికీ.. ఒక ఒరలో రెండు కత్తులు లాంటివే. సుశాంత్‌ చనిపోతే..అది కేంద్రంలోని రాజకీయ పార్టీ జోక్యం చోటుచేసుకోవడమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌-శివసేన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని కుట్ర సిద్ధాంతాలను బిజెపి రచించింది. ఈ కుతంత్రపరమైన వ్యూహాంలో ముంబయి పోలీసులను కూడా ఇరికించింది. ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న బిజెపి…సోషల్‌ మీడియాకు పనిచెప్పింది. అదే పనిగా శివసేన ప్రభుత్వంపై బురద జల్లేలా..చిలువలు..పలువలు చేసి ఆత్మహత్యను..హత్యగా మార్చేసింది. ముంబయి పోలీసులు అసమర్థులుగా మార్చేసి.. బీహార్‌ పోలీసులను రంగంలోకి దింపి ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టేలా చర్యలు చేపట్టింది. అంతేకాకుండా.. ఆరోపణల్లో శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ తనయుడు ఆదిత్య థాకరేను లక్ష్యంగా చేసుకుని పావులు కదిపింది. ఏ సోషల్‌ మీడియా చూసినా శివసేన ప్రభుత్వానికి వ్యతిరేకంగా హ్యాష్‌ట్యాగ్‌లే. చ ఉద్ధవ్‌ రిజైన్‌ లేదా సిబిఐ ఫర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌, చ షేమ్‌ ఆన్‌ మహా గవర్నమెంట్‌ , చ బేబీ పెంగ్విన్‌(ఆదిత్య) వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో మీడియాలో ఫేక్‌ ప్రభంజనాన్ని సృష్టించింది.

సాధారణ ఆసక్తి
జనాల్లో ఆసక్తిని పెంచేందుకు సుశాంత్‌ ఆత్మహత్యను.. కుటిల సిద్ధాంతాలను బిజెపి తీసుకురాగా…అందులో మీడియా సైతం పాలుపంచుకుంది. అందులో భాగంగానే సుశాంత్‌ స్నేహితురాలు రియా చక్రవర్తిని…మహిళ అని కూడా చూడకుండా.. ఇష్టానుసారమైన వ్యాఖ్యలు చేశాయి. ఆగస్టులో రియాను అరెస్టు చేయాలంటూ పిలుపునిస్తూ ..ఇవే న్యాయ వ్యవస్థలై వ్యవహరించాయి. సుశాంత్‌ మరణంలో ఆమె పాత్ర ఉందనడానికి ఎటువంటి రుజువులు లేనప్పటికీ.. తన కోసం మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసినందుకు నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అరెస్టు చేసింది. ఇక రియాను మీడియా చీల్చి చెండాడింది. మీడియాలో ఎల్లో మీడియాగా వ్యవహరిస్తున్న రిపబ్లికన్‌ టివి అయితే ఒక అంకె ఎక్కువ చదివింది. ఇంకేం సమస్యలు లేనట్లు సుశాంత్‌ డ్రగ్స్‌ కోణాన్ని పదేపదే టెలికాస్ట్‌ చేస్తూనే ఉంది. దీంతో దాని ఫాలోవర్లు విపరీతంగా పెరిగిపోయారు. అనంతరం టౌమ్స్‌ నౌ, సిఎన్‌ఎన్‌18, ఇండియా టుడే వంటి చానళ్లు ఇదే అంశాన్ని ఊదరగొట్టి..టిఆర్‌పిలను పెంచుకున్నాయి. ఇవన్నీ కూడా అధ్యయనంలో వెల్లడయ్యాయి. ఈ మీడియా పాత్ర చూస్తుంటే… బహుశా బిజెపి ప్రొద్భలంతోనే పని చేశాయనే అనుమానం రాకతప్పదు.

Courtesy Prajashakti