కేసులు నమోదు చేసిన ముంబయి పోలీసులు

ముంబయి : మోసపూరితంగా టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్‌ (టీఆర్‌ పీ) పెంచుకోవాలని ప్రయత్నించిన రిపబ్లిక్‌ టీవీ గుట్టును ముంబయి పోలీసులు రట్టు చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాలను ముంబయి పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ గురువారం వెల్లడించారు. టీఆర్‌పీ మోసాల ముఠాతో రిపబ్లిక్‌ టీవీ, బాక్స సినిమా, ఫక్తు మరాఠీ ఛానెళ్ల ప్రమేయం ఉందని ఆయన తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఫక్తు మరాఠీ, బాక్స సినిమా యాజమానులను అరెస్టు చేశామని, వారిపై ఐపీసీ సెక్షన్‌ 420, 409ల కింద కేసులు నమోదు చేసినట్టు ఆయన చెప్పారు. ఆయా యాజమాన్యాలు నకిలీ టీఆర్‌పీ రేటింగ్‌లను పొందుతూ అక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. జనాలకు డబ్బులిచ్చి, తమ ఛానెల్‌ మాత్రమే చూడాలన్న నిబంధనతో రేటింగ్‌ను పెంచుకుంటున్నాయని తెలిపారు.

ఇందులో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా కింద పనిచేసే సంస్థ బ్రాడ్కాస్టు ఆడియన్స్‌ అండ్‌ రీసెర్చు కౌన్సిల్‌(బీఏఆర్‌సీ)లో భాగంగా ఉన్న హంసా రీసెర్స్‌ గ్రూప్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఉద్యోగిని అరెస్టు చేసి విచారించగా పలు విషయాలు వెల్లడించినట్టు పరంబీర్‌ సింగ్‌ చెప్పారు. తమకు అప్పగించిన రహస్య డేటాను కంపెనీ దుర్వినియోగం చేసిందని నిందితుడు చెప్పినట్టు తెలిపారు. వివిధ టీవీ ఛానెళ్ల తప్పుడు లాభాల కోసం ఇది స్పష్టంగా జరిగిందని, దీని ఫలితంగా వివిధ ప్రకనటదారులు, వారి ఏజెన్సీలు నష్టం జరిగిందన్నారు. ఈ నేరంలో వందల కోట్ల రూపాయల డబ్బు ప్రమేయం ఉందన్నారు. కాగా, ముంబయి పోలీసుల ప్రకటనను రిప్లబిక్‌ టీవీ ఖండించింది.

Courtesy Nava Telangana