పౌర వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లి షాహీన్‌బాగ్‌
కేరళ, బెంగాల్‌, త్రిపురల్లోనూ ఆందోళనలు
గణతంత్ర దినోత్సవం నాడూ కొనసాగిన నిరసన ప్రదర్శనలు

న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధాని ఢిల్లీతో పాటు కేరళ, బెంగాల్‌, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాల్లో సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి. ముఖ్యంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో పౌర వ్యతిరేక నిరసనలు ఉధృతంగా సాగాయి. రిపబ్లిక్‌ డే సందర్భంగా షాహీన్‌బాగ్‌లో నిరసనకారులు ముందుగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత జాతీయ జెండాలను చేతబట్టుకొని సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలు, విద్యార్థులు, చిన్నారులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ), అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ), జామియా మిలియా ఇస్లామియా(జేఎంఐ) విశ్వవిద్యాలయంతో పాటు పలు వర్సిటీలు విద్యాసంస్థల నుంచి విద్యార్థులు ఇక్కడకు పెద్ద ఎత్తున వచ్చి ఆందోళన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’, ‘సీఏఏ-ఎన్నార్సీ ముర్దాబాద్‌’ వంటి నినాదాలతో షాహీన్‌బాగ్‌ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. కాషాయమూక వేధింపులకు ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)కి చెందిన తెలుగు విద్యార్థి వేముల రోహిత్‌ తల్లితో పాటు జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) మాజీ అధ్యక్షుడు ఉమర్‌ ఖాలీద్‌, జునైద్‌ ఖాన్‌ తల్లి కలిసి సంయుక్తంగా షాహీన్‌బాగ్‌ ప్రాంతంలో జాతీయ జెండాను వేలాది మంది సమక్షంలో ఎగురవేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు జాతీయగీతాన్ని ఆలపించారు. రాజ్యాంగ పీటికను నిరసనకారులు చదివారు. అనంతరం ‘భారత్‌ మాతా కీ జై’, ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’, ‘ఎన్నార్సీ-సీఏఏ ముర్దాబాద్‌’ అంటూ విద్యార్థులు, మహిళలు, చిన్నారులు, స్థానిక ప్రజలు పెద్దపెట్టున నినాదాలతో హౌరెత్తించారు. గతనెల 15 నుంచి దాదాపు 40 రోజులకు పైగా షాహీన్‌బాగ్‌లో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కోల్‌కతాలోనూ…
పశ్చిమబెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో పౌర వ్యతిరేక నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. కోల్‌కతాలో నిరసనకారులు కదం తొక్కారు. దాదాపు 11 కిలోమీటర్ల మేర మానవహారంగా ఏర్పడ్డారు. మహిళలు, చిన్నారులు, విద్యార్థులు, లాయర్లు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు ఇలా పలు రంగాలకు చెందిన వారితో పాటు కుల, మతాలకతీతంగా ఈ నిరసనలో ప్రజలు పాల్గొన్నారు. ది యునైటెడ్‌ ఇంటర్‌ఫెయిత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్యాబజార్‌లోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం నుంచి జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ వరకూ నిరసనకారులు ఒకరిచేతులను ఒకరు పట్టుకొని వరసగా నిలబడ్డారు. దాదాపు 15 నిమిషాల పాటు ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ” సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లను వ్యతిరేకిస్తూ మేము వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నాం. పౌర చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి” అని నిరసనలో పాల్గొన్న అనుభవ్‌ సేన్‌ అన్నారు. ఇటు కోల్‌కతాలోని పలు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రిపబ్లిక్‌డే వేడుకలతో పాటు సీఏఏ వ్యతిరేక నిరసనలు కొనసాగాయి. పలు చోట్ల ఆందోళనకారులు రాజ్యాంగ పీఠికను చదివారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలూ నిరసనలతో అట్టుడికి పోయాయి. ముంబయి, థానేల్లో పెద్ద ఎత్తున పౌర వ్యతిరేక ఆందోళనలు, ర్యాలీలు జరిగాయి. అసోం, త్రిపురతో పాటు మిగతా ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఆందోళనలు ఎగిశాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతిలో పట్టుకొని జెండా వందనం అనంతరం సీఏఏ వ్యతిరేక నినాదాలతో హౌరెత్తించారు.

సమయం ఉన్నప్పుడు చదవండి:ప్రధానికి రాజ్యాంగప్రతిని పంపిన కాంగ్రెస్‌
గణతంత్ర దినోత్సవం నాడు ప్రధానికి రాజ్యాంగ ప్రతిని కాంగ్రెస్‌ పంపింది. దేశాన్ని విభజించే ప్రయత్నంలో సమయం దొరికినప్పుడు రాజ్యాంగాన్ని చదవాల్సిందిగా కోరుతూ చురకలంటించింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌లో కాంగ్రెస్‌ పార్టీ పలు పోస్టులను పెట్టింది. రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని ఆరోపించింది.

Courtesy Nava telangana