గుంటూరు: విజయవాడ శివారులోని ఓ వసతిగృహంలో దారుణ హత్యకు గురైన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికలో దిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో శవపరీక్ష నిర్వహిస్తున్నారు. అయేషా మీరా మృతదేహం అవశేషాలను కూలీలు బయటకు తీశారు. సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య పర్యవేక్షణలో ఫోరెన్సిక్‌ నిపుణులు అవశేషాలను నమోదు చేసుకున్నారు. ఎముకలు, కేశాలు, గోళ్లను క్షుణ్ణంగా పరిశీలించి ఫోరెన్సిక్‌ బృందం నివేదికను తయారు చేయనుంది.

2007 డిసెంబర్‌ 27న అయేషా మీరా హత్య జరిగింది. ఈ కేసులో అప్పట్లో నిందితుడుగా ఉన్న సత్యంబాబును 2008 ఆగస్టు 11న అరెస్టు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన విజయవాడ మహిళా సెషన్స్‌ ప్రత్యేక కోర్టు 2010లో సత్యంబాబుకు 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అనంతరం 2017 మార్చి 31న సత్యంబాబును నిర్దోషిగా తేల్చుతూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల జైలు శిక్ష తర్వాత సత్యంబాబు విడుదలయ్యారు. మరోవైపు 2018 నవంబర్‌ 29న హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. 2019 జనవరిలో సీబీఐ విచారణ ప్రారంభమైంది. సీబీఐ విచారణలో భాగంగా ఇవాళ అయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

Courtesy Eenadu…