• టీఎస్‌ఆర్టీసీకి పీఎఫ్‌ కమిషనరేట్‌ తాఖీదు
  • 15 రోజుల్లో ఎండీ హాజరీకి నోటీసు
  • నిన్న ఎంవీ ట్యాక్స్‌, సీసీఎస్‌.. నేడు పీఎఫ్‌
  • వెన్వెంటనే ఆర్టీసీ కట్టాల్సింది 1400 కోట్లు

టీఎ్‌సఆర్టీసీని కష్టాలు చుట్టుముడుతున్నాయి. కార్మికుల సమ్మెతో ఆదాయం కోల్పోతూ నిధుల కటకటను ఎదుర్కొంటుంటే.. మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ప్రభుత్వ విభాగాలు అదను చూసి దెబ్బకొడుతున్నాయి. ఇప్పటికే రూ.452.86 కోట్ల ఎంవీ ట్యాక్స్‌ బకాయి చెల్లించాలంటూ రవాణా శాఖ జాయింట్‌ కమిషనర్‌ బుధవారం నోటీసు పంపించిన సంగతి తెలిసిందే. తాజాగా, తమకు బకాయి ఉన్న రూ.760.62 కోట్లను వెంటనే చెల్లించాలంటూ శుక్రవారం ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనరేట్‌ కూడా నోటీసు పంపించింది. పూర్తి సమాచారంతో 15 రోజుల్లోగా తమ ముందు హాజరు కావాలని ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మను ఆదేశించింది.

ఆర్టీసీ సిబ్బంది నెల వేతనం నుంచి యాజమాన్యం 12 శాతం పీఎఫ్‌ కట్‌ చేస్తుంది. యాజమాన్యం మరో 12 శాతం ఇస్తుంది. ఇందులో 8.33ు పింఛను ఖాతాకు వెళ్లిపోతుంది. దీనిని తప్పకుండా జమ చేయాల్సిందే. మిగతా 15.67 శాతాన్ని పీఎఫ్‌ కార్యాలయంలో ఆర్టీసీ సిబ్బంది ప్రత్యేక ట్రస్టు ఖాతాలో జమ చేయాలి. కానీ.. కొన్నేళ్లుగా ఇది జమ కావడం లేదు. ఇప్పటివరకు రూ.760.62 కోట్లు బకాయి ఉన్నట్లు పీఎఫ్‌ కమిషనర్‌ పేర్కొన్నారు. ఇదే విషయమై 2016, 2017ల్లో రెండుసార్లు పీఎఫ్‌ కమిషనరేట్‌ ఆర్టీసీకి షోకాజ్‌ నోటీసులు పంపినా ఆర్టీసీ స్పందించలేదు. దీంతో, ఆగ్రహించిన పీఎఫ్‌ కార్యాలయం ఆర్టీసీని బ్లాక్‌లిస్టులో పెట్టింది. అయినా.. మార్పు రాకపోవడంతో తాజాగా మరో నోటీసు పంపింది. ఇప్పుడు సకాలంలో చెల్లించకపోతే జరిమానాలు విధించే అవకాశాలున్నట్లు సమాచారం. అలాగే, సీసీఎస్‌కు సంబంధించి రూ.200 కోట్లను బదలాయించాలంటూ బుధవారం కోర్టు నిర్దేశించింది. వెరసి, టీఎ్‌సఆర్టీసీ వెంటనే రూ.1400 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమవుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Courtesy Andhrajyothy…