దళితులకు, అందులో దళిత స్త్రీలకు మంత్రం శక్తులు ఉంటాయనే మూఢనమ్మకం గ్రామాలలో ఇంకా వుంది. అవే వుంటే తమపై విచ్చలవిడిగా రెచ్చిపోయే కుల, మగ దౌర్జన్యకారులనుంచి తమకు రక్షణ కల్పించమని పోలీసు స్టేషన్లకు వెళ్ళకుండా తమ మంత్ర శక్తితో వారిని అదుపు చెయ్యడమో, మొత్తంగా నిర్మూలించడమో చేసేవారు కదా!

సమాజంలో ఇంకా చేతబడి, బాణామతి, చిల్లంగి, వంటి ఆచారాలు నిస్సిగ్గుగా అమలౌతూ వున్నాయి. దేవుడి పేరుతో జోగిని, బసివి, మాతంగి, వంటి ప్రచ్చన్న వ్యభిచారం గ్రామాలలో కొనసాగుతుంది. ఈ దురాచారాలకు బలైపోయేవారు పేద దళితులూ, దళిత స్త్రీలు అనేది బహిరంగ రహస్యం. బాణామతి చేశారనే నెపంతో దళిత కుటుంబాలకు చెందిన వ్యక్తులను సజీవ దహనం చేయడం, కొన్నిసార్లు ఆ బాణామతిలో మంత్రం పనిచెయ్యకుండా అడ్డుకోడానికి అది చేశారని భావించే వారికి పళ్ళు రాలగొట్టడం వంటి సంఘటనలు తెలంగాణలో చాలాసార్లు చూస్తాం. ఆ అభాగ్యుల సజీవ దహనాలను గ్రామమంతా సుతారం చూడ్డం కూడా మనకు తెలుసు.

కుల పంచాయితీలు రచ్చబండల్లో కొందరు బలహీనులను శిక్షిస్తూ కులంలో కూడా ధనబలం, కండబలం వున్నవారిదే రాజ్యం అన్నట్టు సాగుతుంది. ఇక కులం బైట గ్రామాలలో పెత్తనదారీ కులాలు దళితులపై వివక్ష చూపించడం, భౌతిక దాడులు చెయ్యడం, అదేమని ప్రశ్నిస్తే వారిని సాంఘిక బహిష్కరణకు గురిచెయ్యడం కారంచేడు నుంచి గరగపర్రు వరకూ కొనసాగుతూనే వుంది. చనిపోయిన వారిని బొందపెట్టుకోడానికి ఆరడుగుల నేల దొరకని దుస్థితి ఇంకా కులసమాజంలో దళితులకు వుంది.

డా. నరేంద్ర దభోల్కర్ మహారాష్ట్రలో మూఢనమ్మకాలకు, వెలికి వ్యతిరేకంగా పోరాడి వాటిని అధికారికంగా అరికట్టడానికి ఒక చట్టం చెయ్యాలని కృషి చేస్తూ మత గూండాల చేతిలో 2013, ఆగస్ట్, 20 హత్యకు గురయ్యాడు. ఆయన మరణం దేశంలో లౌకిక ప్రజాతంత్ర శక్తులకు తీరని దుఃఖాన్ని కలిగించింది. దభోల్కర్ చనిపోయిన తర్వాత 2016లో మహారాష్ట్ర ప్రభుత్వం The Maharastra Protection of People from Social Boycott Act-2016 పేరున మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం చేసింది. గ్రామాలలో దళితుల పెళ్లి ఊరేగింపులు, పండుగ వూరేగింపులను అడ్డుకోవడం, మనిషి చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేసుకోడానికి వారిని స్మశానాలకు వెళ్ళే దారినివ్వకుండా అడ్డుకోవడం,అందరికీ సంబంధించిన పబ్లిక్ స్థలాలు, చెరువులు, బావులను ఉపయోగించుకోకుండా అడ్డుకోవడం వంటివి ఈచట్టం పరిధిలోకి వస్తాయి. ఇటువంటి చట్టం అన్ని రాష్ట్రాలలో తీసుకురావాల్సిన అవసరం వుంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాదినేతలే స్వయంగా జోగినీల చేత ‘రంగం’ చెప్పించుకుంటున్నారు. ఒకపక్క అంటరానితనం నేరం అని రాజ్యాంగం చెబుతున్నా రకరకాల అంటరానితనాలు అధికారుల అండదండలతో నిరాటకంగా కొనసాగుతున్నాయి. మూఢనమ్మకాలపై చట్టం అనేది వుంటే దాన్ని అమలు చెయ్యమని కనీసం అడగడానికి ఒక హక్కు, ఆసరా బాధితులకు వుంటుంది.

సమాజంలో మూఢనమ్మకాలు అంతరించి శాస్త్రీయ దృష్టి పెంపొందాలని కృషి చేస్తూ ఆప్రయత్నంలో తన జీవితాన్ని త్యాగం చేసిన దభోల్కర్ తన ఇంట్లో జరిగే శుభకార్యాలకు తిధి, నక్షత్రాలు చూడకుండా, నిరాడంబరంగా జరిపి అందరికీ మార్గదర్శి అయ్యాడు. దభోల్కర్ ని స్మరించుకోవడం అంటే మూడత్వంపై పోరాటానికి మనల్ని మనం సన్నద్ధం చేసుకోవడమే!

– చల్లపల్లి స్వరూపరాణి