కుల భూస్వామ్యం దురహంకారానికి చిరునామాగా మారిన కారంచేడు మంచినీటి చెరువు పాచిపట్టిపోయింది అచ్చం కమ్మ దొరతనంలాగే! తమకు ఆత్మగౌరవాన్నివ్వని కారంచేడు, తమని పశువులకన్నా హీనంగా చూసిన కారంచేడు, కుల నేరస్తుల కండకావరానికి నిలయమైన కారంచేడు తమకి అక్కర్లేదని దాన్ని వదిలేసి తమ పోరాటానికి ఫలితమైన తమదైన సొంత వూరిని వారు నిర్మించుకున్నారు. కాలనీ ముందు భాగంలో ‘పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప’ అని రాసివున్న అమరవీరుల స్మృతి చిహ్నం, దానిపై సంకెళ్ళు తెంచుకుని విజయోత్సాహంతో చేతులు పైకెత్తిన ముగ్గురు బానిసవీరులు, నిజంగానే సంకెళ్ళు తెగే దృశ్యం…

కారంచేడు దళితులపై జరిగిన నరమేధం సందర్భంగా పుట్టుకొచ్చిన దళిత ఆత్మగౌరవ నినాదం పీడిత కులాల్లో గొప్ప ఉద్యమ స్పృహని పెంపొందించింది. ఎవరూ లారీలు, బస్సులు, ట్రాక్టర్లలో జనాన్ని తోలుకురాకుండానే రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షలమందిని చీరాలకు రప్పించిన నిప్పుల నినాదం కారంచేడు. అప్పటికి నాలుగు దశాబ్దాల స్వాతంత్ర్యం, గాంధేయవాద ‘హరిజనోద్ధరణ’, ‘సోషలిస్టు’ నెహ్రూ పాలన, కమ్యూనిస్టు, విప్లవ పార్టీల వర్గవాదం అణగారిన వర్గాలకు ఏమి చేశాయి? అనే ప్రశ్నతో పీడిత కులాలన్నింటినీ ఏకం చేసిన కారంచేడు ఉద్యమానికి ముప్పై ఐదేళ్ళు వచ్చేశాయి. కానీ కారంచేడు ముందుకు తెచ్చిన ప్రశ్నలు అలాగే మిగిలి వుండడం విషాదం.

నీళ్ళకోసం నెత్తుటిని
ధారపోసిన దేశంలో
నెత్తురు అడిగే ప్రశ్నలు
కొద్దిగా చిక్కగానే వుంటాయి మరి!
అక్కడ
పెద్ద పెద్ద సమాధులతోపాటు
పెద్ద పెద్ద ఇళ్ళు కూడా వచ్చాయి
బాధిత పల్లె విజయనగర్ కాలనీ అయ్యింది…
అయితే,
కారంచేడులో కదలబారిన
నల్లదండు ఇప్పుడేమయ్యింది?
నిర్దిష్టతలవైపు ప్రయాణించిన వుద్యమం
తన దశా, దిశా మార్చుకుందా?
ముప్పై ఐదేళ్ళ కారంచేడు ఇచ్చిన
పోరాట పటిమ మకిలిబారడానికి
కారణాలను వెదకాలి!
ఆవూరే కాదు,
మొత్తం దళిత సమాజం
ఆత్మపరిశీలన చేసుకోవాలి!
మర్చిపోడానికి కారంచేడు
ఒక సంఘటనా?
ఒక పల్లె కార్చిన నెత్తుటి కన్నీరు…
ఒక జాతి మొత్తం పెట్టిన
పెనుమంటల పెనుకేక…
అంతపెద్ద ఆక్రోశాన్ని
నేలమాళిగలో
ఎట్లా నిద్రపుచ్చుతాం?

చల్లపల్లి స్వరూపరాణి