సాధారణ మనుషులను అసాధారణంగా ప్రభావితం చేసిన విశిష్ట న్యాయమూర్తి జస్టిస్ సురేశ్. చత్తీస్ ఘఢ్ అడవుల్లో అణచివేతకు గురి అవుతున్న ఆదివాసీలను పరామర్శించటం దగ్గర నుండి, తమిళనాడులో జరిగిన కులహత్యల వరకూ భారతదేశం నలుమూలలా ఎక్కడ ప్రాథమిక హక్కులు భగ్నం అయినా అక్కడ ఆయన ఉండేవారు. కోర్టు లోపల కంటే కోర్టు వెలుపల జస్టిస్ సురేశ్ చేసిన పని గొప్పది, కఠినమైనది, సుదీర్ఘమైనది. భారత న్యాయమూర్తులలో ఆయన అతి పెద్ద స్త్రీవాది. న్యాయ నిబద్ధతే వర్తమాన, భావి తరాలకు జస్టిస్ సురేశ్ వారసత్వం.

కొన్నిజీవితాలను మరణానంతరం తలుచుకొని పండగ చేసుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి. ఆలాంటి జీవితమే జస్టిస్ హోస్బెట్ సురేశ్‌ది. మొన్న జూన్ 11న, 91 సంవత్సరాల వయస్సులో మరణించిన హోస్బెట్ సురేశ్ న్యాయవృత్తిలోనూ, ప్రజాజీవితంలోనూ తనదైన ముద్ర వేశారు. భారత రాజ్యాంగ విలువలను సామాన్య ప్రజలకు తెలియచేసిన అరుదైన వ్యక్తి జస్టిస్ సురేశ్. భారత ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠపరచి, సమున్నతం చేసేందుకు తన 70 సంవత్సరాల జ్యుడీషియల్ జీవితాన్ని వెచ్చించిన మానవతా మూర్తి జస్టిస్ సురేశ్. కోర్టు లోపల కంటే కోర్టు వెలుపల జస్టిస్ సురేశ్ చేసిన పని గొప్పది, కఠినమైనది, సుదీర్ఘమైనది.

కర్ణాటకలోని సూరత్ కల్ జిల్లా హోస్బెట్ పట్టణం జస్టిస్ సురేశ్ స్వస్థలం. ఆయన అతి కొద్దికాలం (1987-–91) మాత్రమే బొంబాయి (ఇప్పటి ముంబాయి) హైకోర్టు జడ్జిగా ఉన్నారు. 1991లో పదవీవిరమణ జరిగిన వెంటనే ప్రజాజీవితంలోకి ఆయన దూకారు. ఆయనకే గుర్తులేనన్ని ప్రజాకోర్టులు, ప్రజా సంప్రదింపులు, విచారణలు నిర్వహించారు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకూ ఎక్కడ బలహీనుల గొంతుకలు వినబడతాయో అక్కడకు జస్టిస్ సురేశ్ పరుగులు పెట్టేవారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. పదవిలో ఉన్నప్పటి కంటే పదవీవిరమణ అనంతరం దాదాపు 30 సంవత్సరాలు ఆయన చేసిన పని సుదీర్ఘమైనది. ‘జడ్జిగా రిటైర్ అయ్యాను కానీ, అలిసిపోలేదు’ అని ఆయన తరుచుగా తన ప్రసంగాలలో అంటుండేవారు. జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ పీబీ సావంత్‌లకు సమకాలికుడు అయిన సురేశ్ వారితో కలిసి నిర్వహించిన విచారణలు ఎన్నో ఉన్నప్పటికీ, వారికి అతీతంగా ఆయన చాలా పనులు చేశారు. కుల, మత, ప్రాంత, వర్గ, జెండర్ -హింసలు, వివక్షలు ఉన్న దగ్గరకు ఆయన వెళ్లారు. అక్కడ బాధితుల పక్షాన నిలబడ్డారు. భారత రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కుల రక్షణ స్పృహను వారికి కల్పించటమే కాదు, న్యాయపరమైన సహాయాలను అందించారు. లెక్కలేనన్ని నిజనిర్ధారణ పత్రాలను ఆయన తయారు చేశారు.

జస్టిస్ సురేశ్ అభ్యుదయ, లౌకిక, మానవతా భావాలు కలిగిన ప్రజా న్యాయమూర్తి. చాలా ధైర్యశాలి కూడా. పదవీ విరమణకు కొన్ని నెలల ముందు బొంబాయిలో శివసేనకు వ్యతిరేకంగా ఆయన వెలువరించిన తీర్పు ప్రఖ్యాతమైనది. సుభాష్ దేశాయి వర్సస్ శరద్ రావుగా పేరు పొందిన ఈ కేసు తీర్పులో ఆయన జనతాదళ్ అభ్యర్థి శరద్ రావు మీద శివసేన అభ్యర్థి సుభాష్ దేశాయి గెలుపును కొట్టి వేశారు. ఎన్నికల ప్రచారంలో మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ సుభాష్ చేసిన ప్రసంగాలను ఉదహరిస్తూ ఆయన ఈ ఎన్నికను రద్దు చేశారు. న్యాయమూర్తులు అంత నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఉన్న రోజులవి. ఈశాన్య ఢిల్లీలో మతదాడులను దగ్గరుండి రెచ్చగొట్టిన కపిల్ మిశ్రాను వెనుకేసుకొచ్చి, అతని మీద కేసులు పెట్టినవారిని వెంటాడి వేధిస్తున్న న్యాయవ్యవస్థ పరిఢవిల్లుతున్న ఈ కాలంలో-జస్టిస్ హోస్బెట్ సురేశ్ యాది మర్చిపోలేనిది. రాడికల్ భావాలు ఉండటం వలన ప్రభుత్వాన్ని సవాలు చేసే కేసులు తనకు అప్పగించేవారు కాదని జస్టిస్ సురేశ్ చెబుతూ ఉండేవారు.

1991లో పదవీ విరమణ పొందగానే జస్టిస్ సురేశ్ నిర్వహించిన మొదటి విచారణ కావేరి నదీజలాల వివాద పర్యవసానాలకు సంబంధించినది. ఆ వివాదం కారణంగా దక్షిణ కర్ణాటకలోని తమిళులపై దాడులు జరిగాయి. కర్ణాటకలో భాషా మైనారిటీలుగా ఉన్న తమిళుల మీద కన్నడిగులు దాడి చేసినపుడు జరిగిన కాల్పుల్లో 16మంది చనిపోయారు. ఈ సందర్భంగా జస్టిస్ సురేశ్ వెలువరించిన రిపోర్టు కర్ణాటకలోని మైనారిటీలయిన బాధితులు తమిళులకు ఎంతో ఉపయోగపడింది.

బాబ్రీ మసీదు విధ్వంసానంతరం 1992-–93లో బొంబాయిలో జరిగిన దాడులపై విచారణకు మానవ హక్కుల కమిషన్ ఆయనను నియమించింది. రోజుల తరబడి బాధితుల దగ్గర కూర్చొని వాస్తవాలను సేకరించి, సాక్ష్యాలను ఆయన నమోదు చేశారు. బొంబాయి దాడులకు సంబంధించి ఆయన అప్పుడు తయారు చేసిన నివేదికను ‘ప్రజల తీర్పు’ అన్నారు. అది ఎంత పకడ్బందీగా తయారయ్యిందంటే ఆనాడు భారత ప్రభుత్వం అధికారికంగా తయారు చేయించిన శ్రీకృష్ణ కమిషన్ నివేదిక కూడా దానిముందు వెలవెలబోయింది. 1994లో సంజయ్ గాంధీ నేషనల్ పార్కును పరిరక్షించే పేరుతో బొంబాయి కార్పొరేషన్ మురికివాడలను కాల్చివేసి, భయపెట్టి, బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తుండగా జస్టిస్ సురేశ్ భాగస్వామ్యంతో విచారణ బృందం కలగచేసుకొని దాన్ని ఆపించగలిగింది. ‘ముందు బొంబాయి చుట్టూ ఇనుపముళ్ల కంచె వేసి తరువాత మురికివాడలను ఖాళీ చేయించండి’ అని ఆయన అన్నమాటను సుమోటోగా తీసుకొని కార్పొరేషన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. ఇతర రిటైర్డ్ జడ్జిలతో కూడిన ఈ బహిరంగ విచారణలో ఆయన తయారు చేసిన పత్రం ఫలితంగా సుమారు 60,000 మంది తిరిగి అక్కడే తమ ఇళ్లను నిర్మించుకోగలిగారు. నదుల, సముద్రాల అంచుల్లో నుంచీ, భూముల, అడవుల నుంచీ నిర్వాసితులను చేసే ప్రయత్నాలను ఆయన తన పదునైన వాదనలు, ప్రజా కోర్టుల ద్వారా చాలావరకు అడ్డుకోగలిగారు.

2002 గుజరాత్ మారణహోమం తరువాత తీస్తా సెతల్వాడ్ తదితరులు ఏర్పాటు చేసిన ‘సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్’ (సిజెపి) సంస్థలో భాగంగా హోస్బెట్ సురేశ్ గుజరాత్ అంతా విరామం లేకుండా పర్యటించి ఒక నివేదిక తయారు చేశారు. ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి ఈ అమానుష మారణకాండలో ఉన్న భాగస్వామ్యం గురించి బీజేపీ మంత్రి హరేన్ పాండ్య దగ్గర జస్టిస్ సురేశ్ సేకరించిన సాక్ష్యాలు చాలా కీలకమైనవి. అవి బహిర్గతమయ్యాక హరేన్ పాండ్యా హత్యకూ, తరువాత కాలంలో అమిత్ షా అరెస్టుకూ కారణమయ్యాయి. ఆ కేసులో కీలక సాక్ష్యం ఇచ్చిన ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇప్పుడు జైల్లో ఉన్నాడు. 2010 జనవరిలో మానవ హక్కుల చట్ట నెట్వర్క్ శ్రీనగర్‌లో నిర్వహించిన ట్రిబ్యునల్‌కు జస్టిస్ సురేశ్ నాయకత్వం వహించి కశ్మీర్‌లో మానవహక్కుల అణచివేత గురించి విశాల భారతదేశానికి తెలియజేశారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం కింద ఈశాన్య రాష్ట్రాలు నలిగిపోతున్నపుడు, మణిపూర్‌లో జస్టిస్ సురేశ్ బృందం నిజనిర్ధారణ పర్యటన చేసింది. నలుపక్కల ముట్టడించివున్న సైనిక నిఘా కింద వాళ్ల పర్యటన జరిగింది. అక్కడ జరిగిన హత్యలనూ, అత్యాచారాలనూ, హింసనూ చూసి ఆయన చలించిపోయారు. ఈరోమ్ షర్మిలా తమ బృందంతో బాటు సైకిలు మీద అనుసరించిందనీ; జస్టిస్ సురేశ్ ఉపన్యాసాలను ఆమె శ్రద్ధగా విన్నదనీ, తరువాత కాలంలో మనోరమ అత్యాచారం హత్యల తరువాత ఆమె సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నదని ఆయనతో మణిపూర్ ప్రయాణించిన సీనియర్ అడ్వకేట్ కొలిన్ గోన్సల్వెస్ చెబుతారు. సాధారణ మనుషులను అసాధారణంగా ప్రభావితం చేయగలిగిన విశిష్ట వ్యక్తిత్వం జస్టిస్ సురేశ్‌ది.

పర్యావరణ పరిరక్షణ వాదిగా జస్టిస్ సురేశ్ అత్యద్భుతమైన కృషి చేశారు. పారిశ్రామిక రొయ్యల సాగు గురించి వేసిన నిపుణుల కమిటీలో భాగంగా ఉండి, పర్యావరణానికి తీవ్ర నష్టం చేస్తున్న రొయ్యల సాగును నిషేధించాలని సిటిజన్ రిపోర్ట్‌లో సిఫార్సు చేసి ఈ ఉద్యమానికి విజయం తెచ్చిపెట్టారు. పెట్రో కెమికల్ పార్క్ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం తలపెట్టినపుడు పులికాట్ సరస్సు, కాటుపల్లి పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటాయని ఆయన రిపోర్టు రాశారు. ఇలాంటి పనులు చేస్తున్నపుడు పారిశ్రామికవేత్తల నుండి వచ్చే బెదిరింపులను, దాడులను ఆయన ఏ మాత్రం ఖాతరు చేసేవారు కాదు.

2015లో ఆంధ్రప్రదేశ్ శేషాచలం కొండల్లో చందనం స్మగ్లర్ల పేరుతో 20మంది కూలీలను చంపివేసినపుడు 86ఏళ్ల వయసులో ఆయన అక్కడికి వచ్చారు. అడవుల లోపలికి వెళ్లటానికి అనుమతినివ్వకపోతే అధికారులు వచ్చేంతవరకూ అక్కడే తిష్ట వేసి కూర్చున్నారు. ఛత్తీస్ ఘఢ్ అడవుల్లో అణచివేతకు గురి అవుతున్న ఆదివాసీలను పరామర్శించటం దగ్గర నుండి, తమిళనాడులో జరిగిన కులహత్యల వరకూ భారతదేశంలో నలుమూలల ఎక్కడ ప్రాథమిక హక్కులు భగ్నం అయినా అక్కడ ఆయన ఉండేవారు. జస్టిస్ సురేశ్ ఈ యుగానికి సంబంధించిన అతి పెద్ద స్త్రీవాది అని ఆయనతో పని చేసిన మహిళా యాక్టివిస్టులు చెబుతారు.

మానవ హక్కుల చట్ట నెట్వర్క్ లాంటి అనేక సంస్థలను, వేదికలనూ ఆయన ఏర్పాటు చేసి నడిపించారు. ఆయనకున్న అపారమైన శక్తి సామర్థ్యాలు, వృద్ధాప్యాన్ని లెక్కచేయని ఆయన నిబద్ధతను ఈనాటి తరానికి ఆయన వారసత్వంగా ఇచ్చారు. భారతదేశంలో సకల హక్కులకు పరిరక్షకుడిగా, వాటి దారిదీపంగా ప్రజల హృదయంలో ఆయన ఎప్పటికీ నిలిచి ఉంటారు.

రమాసుందరి

Courtesy Andhrajyothy