బ్రిటీష్ ఇండియాలో 1881 లో రెండోసారి జనాభా లెక్కలు కార్యక్రమం చేపట్టినప్పుడు దళితులను హిందూమతంలో భాగంగా చేర్చడాన్ని తమిళ దళిత బౌద్ధ ఉద్యమకారుడు, పండిత అయోతీ దాస్ తీవ్రంగా వ్యతిరేకించి దళితులు ఏవిధంగా చూసినా హిందువులు కారు, వారు కుల వ్యవస్థలో కూడా భాగం కాదని ఆనాటి కుల సమాజం ఉలిక్కిపడేలా చేశాడు. అది ఇప్పటికీ మింగుడుపడని విషయంగానే వుంది.

పండిత అయోతీ దాసు పెరియార్, అంబేడ్కర్‌ల కంటే సుమారు యాభై సంవత్సరాల ముందే తమిళనాట బ్రాహ్మణేతర ఉద్యమాన్ని ప్రారంభించి దళితులు తమపై రుద్దిన కుల వివక్ష నుంచి బైటపడడానికి ఒకవైపు రాజకీయ హక్కులకోసం పోరాడుతూనే మరోవైపు సాంస్కృతిక ఉద్యమం చెయ్యాలని పిలుపునిచ్చాడు. రాజకీయ హక్కుల సాధనకోసం ఆయన ‘ద్రావిడ మహాజన సభ’ని స్థాపించి మరోవైపు దళితులు హిందూమతం నుంచి బైటపడి తమ అస్తిత్వ పునాది అయిన బౌద్ధంలోకి తిరిగి వెళ్లాలని ఆ దిశగా పనిచెయ్యడానికి ‘శాక్య బౌద్ధ సమాజం’ అనే ఉద్యమ సంస్థను 1898 లో స్థాపించాడు. దళితుల సాంస్కృతిక విప్లవం ఈ సంస్థ ద్వారా సఫలీకృతం అయ్యింది. వారి పుట్టుక, పెళ్లి, చావులకు సంబంధించిన కార్యక్రమాలు, క్రతువులు అన్నీ బౌద్ధం ప్రకారం జరుపుకుని తమను తాము ‘పరయాలు’గా కాక ‘బౌద్ధులు’ గా పరిగణించే ఒక ఆత్మగౌరవ చైతన్యం పొందారు. 1911 జనాభా లెక్కలలో అక్కడి దళితులు తమను బౌద్ధులుగానే రికార్డ్ చేయించగలగడం పండిత అయోతీ దాస్ ఉద్యమ విజయంగా భావించవచ్చు.

అయోతీ దాస్ అనంతరం ఆయన శిష్యులైన ప్రొఫెసర్ పోకల లక్ష్మీ నరుసు, అప్పాదురై శాక్య బౌద్ధ సమాజాన్ని నడిపించారు. లక్ష్మీనరుసు పుస్తకాలు అంబేడ్కర్ కి బౌద్ధాన్ని అర్ధం చేసుకోడానికి స్పూర్తినిస్తే, అప్పాదురై అంబేడ్కర్ రాజకీయ ఉద్యమానికి తోడు వెళ్ళాడు. 20 వ శతాబ్దంలో దేశవ్యాప్తంగా ముందుకొచ్చిన ఆది ద్రావిడ, ఆది ఆంద్ర, ఆది కన్నడ, ఆది హిందూ వంటి దళిత ఆత్మగౌరవ ఉద్యమాలకు పండిత అయోతీ దాస్ ఆద్యుడు. పెరియార్ బ్రాహ్మణేతర ద్రావిడ వుద్యమానికి కూడా అయోతీదాస్ ప్రారంభించిన రాజకీయ సాంస్కృతిక ఉద్యమంలోనే పునాదులు ఏర్పడ్డాయి. అయోతీదాస్ మార్గంలో కుల నిర్మూలనకు బౌద్ధం పరిష్కార మార్గమనే అంశాన్ని అంబేద్కర్ గుర్తించి ఆచరించాడు. దళితుల రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాలు చేతిలో చెయ్యి వేసుకుని నడవాలని ప్రతిపాదించిన పండిత అయోతీదాస్ క్రాంత దర్శి, సామాజిక విప్లవకారుడు, ప్రాతఃస్మరణీయుడు.

మే 20 పండిత అయోతీదాస్ జయంతి
– చల్లపల్లి స్వరూపరాణి