ఆర్టిస్ట్ మోహన్

(2009 అక్టోబర్ 8న బాలగోపాల్ కన్నుమూశారు. బాలగోపాల్ చనిపోయాక వచ్చిన ‘నిగాహ్’ పుస్తకానికి మోహన్ ముందుమాట 2015)

అనగనగనగా 1987 ఫిబ్రవరిలో ‘జెంటిల్మన్’ పత్రిక వచ్చింది. అందులో “ఛాంపియన్ ఆఫ్ ది అప్రెస్డ్” శీర్షిక కింద 34 ఏళ్ల బాలగోపాల్ పై ఒక వ్యాసం ఉంది. పౌర హక్కుల కోసం పూర్తికాలం పని చేస్తున్నాడు, పోరాడుతున్నాడు, అతను ఆ నిర్ణయం కనుక తీసుకోకపోతే ఈపాటికి మేథమేటిక్స్ లో నోబెల్ ప్రైజ్ వచ్చి ఉండేదని ఆయన ప్రొఫెసర్లు అంటారని – ఆ పత్రిక రాసింది. లెక్కలంటే డొక్క చీరేంత భయం ఉండడం వల్ల నాకు అదంత గొప్పగా అనిపించలేదు కాని ఈయన అంతర్జాతీయ స్థాయిగల మాథమెటీషియన్ అని మాత్రం అర్థమైంది.

తర్వాత తెలిసిందేంటంటే మేథమేటిక్స్ కు నోబెల్ లేదట. దానికి సమానమైన మరో ప్రైజ్ ఏదో ఉందట.

వరంగల్ లో చదివిన చాలామంది స్టూడెంట్స్ ఈయన విషయాలు ఇంకా వివరంగా ఆరాధనతో చెప్పడమూ విన్నాను. కాకతీయ యూనివర్సిటీలో ఈయనా, బయట వరవరరావూ రెండు మూడు తరాల విద్యార్థులను ఆదర్శాల వైపు మళ్లించారు. ఈరోజుకీ వాళ్లంతా నాటి ఇన్స్పిరేషన్ ని తలుచుకుని తన్మయులై పోతుంటారు.

మరి ఇంతా చదివీ, శాస్త్రాలు తెలిసీ మానవహక్కులనీ, ఉద్యమాలనీ ఎందుకనడం? ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ ఇవతల ‘ఉదయం’ డైలీ ఆఫీసు పక్కనుంచి చార్మినార్ ఫ్యాక్టరీ మీదుగా ఒక్కడే నడుచుకుంటూ వెళ్లడం ఎందుకు? ఏ పెద్ద యూనివర్సిటీకెళ్లినా దణ్ణాలు పెట్టి పెద్ద ఉద్యోగాలిస్తారు. దర్జాగా ఉండొచ్చు. అదంతా వదులుకుని ముళ్లదారినెంచుకుని, ప్రతిక్షణం ప్రాణానికి ముప్పే అనే స్థితిలో వీళ్లు బతికారు. బాలగోపాల్ మీద చాలా దాడులు జరిగాయి. గూండాలు కొట్టి పారేసి పోయారు. పోలీసులూ అదే పని చేశారు. ఒకసారి కిడ్నాప్ కూడా చేశారు. పోలీసు నిఘా ఎప్పుడూ ఉండేది.

ఆయనొకసారి ట్రైన్ లో కలకత్తా వెళ్లాడు. అక్కడ మృణాల్ సేన్ ని కలిసే పనుందట. కంపార్టుమెంట్ లో రద్దీ వల్ల కిందికి దిగలేక విశాఖలో తనను కలుద్దామని వచ్చిన వాళ్లను కలవలేకపోయాడు. పెద్ద గందరగోళం. విశాఖ నుంచి చలసాని ప్రసాద్ స్టేట్ మెంట్. హైదరాబాద్ లో మాతో ‘ఉదయం’ పత్రిక జర్నలిస్టుగా పనిచేస్తున్న ఆయన భార్య వసంతలక్ష్మి,  (అప్పటికింకా భార్య కాలేదనుకోండి) చెల్లెలు మృణాళిని, ఇంకా వందల, వేల మంది కంగారుపడ్డారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లూ,  పత్రికల నిండా స్టేట్మెంట్లు. అందరూ పోలీసుల్ని అనుమానించారు. ఈలోగా బాలగోపాల్ లక్షణంగా కలకత్తా చేరాడని తెలిసింది. ప్రతిదానికీ మామీద వొంటికాల్తో లేస్తారని పోలీసులంతా ఉద్యమకారుల్ని దుమ్మెత్తిపోశారు.

అయితే అప్పుడున్న పరిస్థితులు అలాంటివి. గాలినిండా అనుమానం, భయం ఆవరించి ఉండేవి. అటువంటి భయాలు, పరిస్థితులనెన్నో జయించినవాడు బాలగోపాల్. ఈ వ్యాసాల నిండా ఆ నిర్భీతి కనిపిస్తుంది. ‘ నిగాహ్ ‘ కాలమ్ ‘ప్రజాతంత్ర’ వీక్లీలో క్రమం తప్పకుండా దశాబ్దం పైగా వచ్చింది. దేవులపల్లి అమర్ నడిపిన పత్రిక అది. వీటిలో స్థానికం నుండి జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, మతం, కులం, పార్టీల తీరు, అభివృద్ధి తెన్నులు అన్నీ ఉంటాయి.

ఈ ఏడాదీ, వచ్చే ఏడాదీ రావలసిన వ్యాసాలన్నీ చాలా ఏళ్ల క్రితమే రాసేసినట్టుంటాయవన్నీ. తాడిపత్రి ఫాక్షన్ రాజకీయాల నుండి బుష్, సద్దాం యుద్ధాల వరకు ఎన్నో సంగతులొస్తాయి. బాక్సైట్ తవ్వకాలు, పోలవరం ప్రాజెక్టు, నర్మదాబచావో ఆందోళన్ – అన్నిట్లోనూ దారం లాగా ఓ రీజన్ ఉంటుంది. దానికి ఆధారం మనుషుల బతుకులు, వాళ్ల ప్రాణాలు, హక్కులు, స్వేచ్ఛ.. ఇవే.

ఆదిలాబాద్, కరీంనగర్ గవర్నమెంట్ ఆస్పత్రుల్లో అవకతవకలు, చిన్న పిల్లల చావుల గురించి రాసినపుడు చాలా సీరియస్ కన్సర్న్ కనిపిస్తుంది. అది ఏడిపిస్తుంది కూడా.

80వ దశకం నుండి బాలగోపాల్ ప్రసంగాలూ, రాతలూ తెలిసినవే. ఆయన తెచ్చిన రిపోర్టులు, స్టేట్మెంట్లు చదివినవే. అయినా ఇవి వేరు. బాగా సిగ్గరిగా అంతర్ముఖుడుగా కనిపించే మనిషి  ఇలా దాష్టీకంగా రాస్తాడనీ, చిలిపిగా జోకులు పేలుస్తాడనీ ఊహించలేం. చెదిరిన జుట్టు, నలిగిన చొక్కా, ఆకుచెప్పులతో కనిపించే మనిషి ఇంత ఫైటింగ్ స్పిరిట్ ప్రదర్శించగలడని అనిపించదు. కత్తులు మింగీ నిప్పులు ఊదే బ్రాండెడ్ రెడ్ రివల్యూషనరీలా బొత్తిగా కనిపించడు. మన కళ్లకి కనిపించేదంతా కరెక్ట్ అనుకోవడం అంత కరెక్ట్ కాదేమో! ఈ పాపిష్టి కళ్లు అంత తిన్నమైనవనే గ్యారంటీ ఏముంది!

అసలు సంగతి ప్రపంచాన్ని చూడ్డంలో ఉంది. అర్థం చేసుకోవడంలో ఉంది. భాష్యం చెప్పడంలో ఉంది. దానికోసం చదువుకోవడం, ఫీలవడం, పోరాడడం గొప్పవని బాలగోపాల్ బతికిన బతుకు చెప్తుంది. రోజువారీ చిల్లర విషయాలు, పనికిమాలిన కంఫర్ట్ లు, సుఖాలను సునాయాసంగా వదిలేయడం ఎలాగో ఈ మనిషిని చూస్తే అర్థమవుతుంది.

లక్షణంగా కడుపులో చల్ల కదలకుండా ఓ మూల పడి ఉండక కన్యాకుమారనీ, కాశ్మీరనీ గావుకేకలెందుకు; మానవ హక్కులకు ఎక్కడో ఏదో అయిందని ఎర్ర బస్సులెక్కి డేంజర్ జోన్లో తలదూర్చడమెందుకు – అని మనలాంటి జ్ఞానులకు అనిపించుట సహజం. కానీ కొందరంతే. కొత్త బూట్లు కొనుక్కోవడం, అద్దంలో పదేపదే చూసుకుంటూ తల దువ్వుకుంటూ ‘అదిరిందిరా చంద్రం’ అని తనలో తానే, ప్రకాశముగా కూడా అనుకుంటూ ఉండరు. ఇరాక్ మీద అమెరికా ఆంక్షల వల్ల ఆరున్నర లక్షల మంది చంటి పిల్లలు చనిపోవడమేంటని బెంగపడతారు. దాని గురించి రాస్తారు, చెప్తారు. అందువల్ల మనకేదో బల్బు వెలుగుతుంది. ఔను నిజమే కదా .. అనిపిస్తుంది. అటువేపు మనల్ని మళ్ళిస్తుంది. బుర్ర తొలుస్తుంది. మరింత తెలుసుకోవడానికి, మరింత అర్థం చేసుకోవడానికి రేపెడుతుంది. మన స్థాయిని పెంచుతుంది. కొత్త దారొకటి దొరుకుతుంది. బాలగోపాల్ ఒక్కడే కాదు గ్రామ్ స్కీ అయినా, చోమ్స్కీ అయినా అదేపని చేస్తారు. తెలీకుండానే బతుకు మారుతుంది. తత్వశాస్త్రం, కళ, కొత్త ఆలోచనలూ మానవజాతిని ముందుకు నడిపిస్తాయి. చుట్టూ ఉన్నదానితో బాగా ఎడ్జెస్ట్ అయిపోయి ఉండకుండా ఈ భావాలు నిద్ర లేపుతాయి. నిద్రలేకుండా చేస్తాయి.

బాలగోపాల్ ఇంగ్లీష్ వ్యాసాలు రాస్తే అచ్చేయడానికి ‘ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’ రెడీగా ఉంటుంది. కానీ రంగా హత్య గురించో, పరిటాల రవి హత్య గురించో వ్యాసాలు తీసుకొచ్చి బాగ్ లింగంపల్లి లో మేం పెట్టిన పనికిమాలిన వీక్లీకి ఇచ్చేవాడు. ఓపిగ్గా మూడంతస్థుల మెట్లెక్కి మరీ వచ్చేవాడు. తెలుగు డైలీలకు, నేషనల్ ఇంగ్లీష్ డైలీలకు ఇస్తే వాళ్లు వేస్తారు గదా, ఈ పిల్ల పత్రిక్కి ఎందుకిస్తారని అడిగితే.. ‘ ఆల్టర్నేటివ్ వాయిస్ ఉండాలి. మన సమస్యల మీద అభిప్రాయాలు తెలియాలి. మెయిన్ స్ట్రీమ్ లో అవి కుదరవు ‘ అనేవాడు. ఆయన నడిపిన ‘ స్వేచ్ఛ’ లాంటి పత్రికలూ అంతే. ఎంత సర్క్యులేషన్ ఉంటుంది గనక. రాసీ, కంపోజ్ చేయించి, ప్రూఫ్ రీడింగ్ చూసీ, పత్రికలు కట్టలు కట్టలు పంపించీ నానా తంటాలు పడేవాడు. ఏంటంటే., అదంతే. బతుకులో సక్సెస్ కీ, ఫెయిల్యూర్ కీ నిర్వచనాలు తిరగేసి చూపించాడు.

ఇప్పుడున్న సోకాల్డ్ ప్రమాణాలని ఆకుచెప్పుల కాళ్లతో తన్ని పారేశాడు. అదో గొప్ప పని అనుకోలేదు కూడా. తను ఎలా ఉండాలో అలానే ఉన్నాడు. అయితే ఒకటుంది. బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని పాలిస్తున్న కాలంలో రంగూన్ లో ఒక జమీందారు తన ఇంట్లోని టీనేజ్ పనిపిల్లని రేప్ చేశాడు. ఆ వార్త ఓ పత్రికలో ఏదో ఒక మూల సింగిల్ కాలమ్ లో వచ్చింది. లెనిన్ దాన్ని చదివి కదిలి, కామెంట్ రాశాడు. ఎక్కడి రంగూన్, ఎక్కడి మాస్కో! కానీ ‘కన్సర్న్డ్ సిటిజెన్’ లు ఇలాంటి ‘అతిచిన్న అప్రధానమైన’ వార్తలకు కూడా రియాక్ట్ అవుతారు. చాలామందిలాగ వాళ్ల చర్మం మొద్దుబారి ఉండదు. అలాగని కళ్లమ్మట నీళ్లు పెట్టుకుని వలవలా ఏడవరు. అప్పటి సమాజంలో ఇలాంటివి జరగడానికి గల మూలాల్ని చూస్తారు. మనలాంటి మందబుద్ధులకు చెప్తారు. సెన్సిటైజ్ చేస్తారు. బాలగోపాల్ ఆ కోవలో మనిషే. అందుకే అలా చేశాడు. అలా తిరిగాడు. అలా రాశాడు. గూండాలు కత్తులతో దాడి చేసినా బెదరలేదు. నక్సలైట్ ముద్ర ఉన్న వాళ్లని విమర్శించడానికీ వెనకాడలేదు. మాయావతిని తిడితే దళితులు హర్ట్ అవుతారని లెక్కే చేయలేదు. కమ్యూనిస్టు అయినా కమ్యూనిస్టుల పద్ధతుల్ని వేలెత్తి చూపడానికి వెరవలేదు. ఇందులో తలతిక్క గానీ, రెటమతం గానీ ఉండవు. రీజన్ ఉంటుంది. తర్కం ఉంటుంది. మనల్ని ఒప్పిస్తాడు. ఇదంతా బాలగోపాల్ ని పొగిడి హెచ్చు చేయడానికి కాదు. మన బతుకు సంగతేంటని చూసుకోవడానికి, అసలైన ఆదర్శాన్నీ, త్యాగాన్నీ తెలుసుకోవడానికీ ఇలాంటి వాళ్లు మనకు బాగా పనికొస్తారు. ఇదంతా వాళ్ల గురించి కాదు. మన గురించి.

మామూలు స్టాండర్డ్స్ తో చూస్తే తను బాగా అప్రయోజకుడు. పెళ్లాం బిడ్డల కేదేనా చేద్దామని ఎప్పుడూ లేదు. నాలుగు రాళ్లు వెనకేసే బుద్ధే లేదు. కనక చిక్కడపల్లిలో గానీ, గచ్చిబౌలీలో గానీ ప్లాటూ లేదు, ఫ్లాటూ లేదు. ఒకటే ప్రయాణాలు, సమావేశాలు, సభలు, ప్రసంగాలు, రాతకోతలు. కుదురులేని, సుఖంలేని బతుకు. కానీ బాగా ఎంజాయ్ చేశాడనిపిస్తుంది. వాళ్ల డైనింగ్ టేబుల్ దగ్గర కూచున్నప్పుడు మా అంత వాగుడూ, వాదనలూ చేసేవాడు కాదు కాని., కాసిన్ని కబుర్లు చెప్పేవాడు. మధ్యమధ్యలో వంటింట్లోకెళ్ళొచ్చి నాలుగు కప్పుల చాయ్ తెచ్చిచ్చేవాడు. సన్నగా నవ్వడం, చిన్నగా జోకులు వేయడం. సీరియస్ విషయాల్లోకి పోకుండా జాగ్రత్తపడేవాడు. ముప్పై ఏళ్లుగా ఎరిగున్నా, డజన్లూ, పరకల కొద్దీ పోస్టర్లూ, కవర్ డిజైన్లూ, కార్టూన్లూ గీసిచ్చినా తెగ దగ్గరైపోవడం, ఫ్రెండ్షిప్ చేసేయడం ఏమీ ఉండేది కాదు. మామూలు కబుర్లు, అసింటా ఉండడం – ఎప్పుడూ అంతే.

ఇక రాతల విషయానికొస్తే పైకి కనిపించేంత మొహమాటం ఏమీ ఉండదు. ‘జార్జిబుష్ నూ, సద్దాం హుస్సేన్ నూ ఒకే బోనులో నిలబెట్టలేమా ‘ అనే హెడ్డింగ్ తో వచ్చిన వ్యాసంలో “తెలుపునలుపులే తప్ప వేరే రంగులు చూడబోమని తెలుగునాట ప్రజాతంత్రవాదులు ఎప్పుడో చరిత్ర మీద ఒట్టు పెట్టి తీర్మానించినట్టున్నారు ‘ అని మొదలుపెట్టి ఇద్దరి గురించీ ఖచ్చితంగా ముక్కు మీద గుద్దినట్టు చెప్పాడు. ఈరోజు ఈ వాదనని సిరియా, ఇరాన్, కుర్దిస్తాన్, ఇసిన్ ల సందర్భంలో యధాతథంగా చెప్పుకోవచ్చు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగకూడదని, అక్కడ లౌకిక పాలన ఉండకూడదనీ, దాని ఆదాయమంతా హిందూ మత ప్రచారానికే వాడాలన్న వాదన మామూలుగా మంచిదే కదా – అని జనం అనుకునే పరిస్థితి ఉంది. అలాంటి ప్రచారం చేశాడని ఈ మధ్యే అక్కడ ఒకర్ని అరెస్ట్ చేశారు కూడా. కానీ ఏనాడో ఈ వాదాన్ని తిప్పికొడుతూ రాశాడు బాలగోపాల్.

దళిత రాజకీయాల పేరిట ఏదోరకంగా అధికారంలో ఉండడానికి మాయావతి చేసిన ‘సోషల్ ఇంజనీరింగ్’ ను ఘోరమైన కరప్షన్ గా తిడతాడు. చివరికి “చచ్చి ఏ నరకాన ఉన్నారో గానీ ఫూలే, అంబేద్కర్, పెరియార్‌లు తమ వారసులు, తమ ఆలోచనలకు పట్టించిన గతికి చాలా బాధపడుతుండాలి” అని ముగిస్తాడు.

నందిగ్రాం, హైదరాబాద్ మక్కా మసీదు, రాజస్థాన్ గుజ్జర్ల ఆందోళనలో పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ “బ్రేకులు లేని లారీని గొర్రెల మంద మీదికి తోలినట్టు తుపాకులతో ప్రజలను వేటాడతారు” అంటాడు.

“గుజరాత్ హింసాకాండను పక్కన ఉండి నడిపించిన ఆ మహానుభావుణ్ని ఆ రాష్ట్రం మళ్లీ ఎట్లా ఎన్నుకుంది” అని ప్రశ్న వేస్తాడు. రాష్ట్రం కాదు దేశమే ఎన్నుకుందని తెలిస్తే ఏమనేవాడో!

“జ్వరం ఆదిలాబాద్ కా, వైద్యశాఖకా?” వ్యాసం మనకి జ్వరం తెప్పిస్తుంది.

“ఒకడు పోయాడు, ఒకడు బలపడ్డాడు, రేపు ఏం కానుందో” అనే శీర్షికతో ఉన్న వ్యాసం ఇలా మొదలవుతుంది.  “సూర్యప్రతాపరెడ్డి చావుతో చంద్రబాబు నాయుడుకు అనంతపురం జిల్లా బయట సానుభూతి పొందడానికి ఇంకో శవం దొరికిందని అంటే.. అది అమానుషమైన వ్యాఖ్యగానో, దివాకరెడ్డికి అనుకూలమైన వ్యాఖ్యగానో తోచవచ్చు… ఈ రోజు దివాకరరెడ్డి కళ్లలో దాచుకోలేకపోతున్న సంతృప్తి రేపు సూర్యప్రతాపరెడ్డి కొడుకు కళ్లలో మనం చూడనూవచ్చు”.

ఇంత బ్రూటల్ గా రాయడం శానా కష్టం.

ఇలా ఎన్నయినా కోట్ చేయొచ్చు. ఎలాగూ చదువుతారుగా, ఎందుకు అన్నీ చెప్పడం అనిపిస్తుంది.

ఇవన్నీ చదివాక చుట్టూ ఉన్న పరిస్థితుల మీద కోపం, దేశంలో, ప్రపంచంలోనూ జనం కష్టాల వెంట, కన్నీళ్ల వెంట పరుగుపెట్టాలనే ఆందోళన కలుగుతుంది. ఇవి చూస్తూ మిన్నకుండకూడదనీ, గొంతెత్తి అరవాలనీ, నిరసించాలనీ, ఖండించాలనీ, అసలీ వ్యవహారాలన్నీ మొత్తంగా మార్చాలనీ, బుధ్ధుడిలాగో, మార్క్స్ లాగో, కనీసం బాలగోపాల్ లాగానో చెయ్యాలనీ కోరిక వస్తుంది. కాని మనకంత క్వాలిఫికేషన్ ఎక్కడిది?

బాలగోపాల్ చిన్నవయసులోనే మరీ అర్థం పర్థం లేకుండా చనిపోయాడు. ఈ నాలుగైదేళ్లలో భారతదేశం ‘రైట్’కి మొగ్గింది. అరబ్ వసంతం ఆకురాల్చింది. మళ్లీ సిరియాలో, ఇరాక్ లో యుద్ధాలు జరుగుతున్నాయి. నెత్తుటి మయమయ్యే పత్రికల పేజీలూ, టీవీ తెరలూ మనముందు రోజూ కనిపిస్తున్నాయి. ఆ మధ్య మిత్రులొచ్చినప్పుడన్నారు – ఇప్పుడు బాలగోపాలుంటే ఎంత బాగుండేదని.

ఇవి చదివాక నాకూ గట్టిగా అనిపించింది, బాలగోపాల్ ఉంటే ఎంత బావుండునని!