• కల్యాణ లక్ష్మి సొమ్ము కోసం దొంగ పెళ్లిళ్ల దందా
  • నకిలీ పెళ్లి పత్రికలు, పాత ఫొటోలతో దరఖాస్తులు
  • నిర్మల్‌ జిల్లాలో దందా నిర్వహిస్తున్న ముఠా
  • పర్యవేక్షణ కరువు.. పక్కదారిపడుతున్న నిధులు
  • పుష్కలంగా రాజకీయ నేతల అండదండలు

పెళ్లంటే.. పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు, తాళాలు.. తలంబ్రాలు! ఆ పెళ్లిళ్లలో మాత్రం ఇవేవీ ఉండవు! అసలు వధూవరులే ఉండరు. కానీ ఓ నకిలీ పెళ్లి పత్రిక.. ఎప్పుడో పదేళ్లక్రితం పెళ్లయిన దంపతులు చక్కగా తలంబ్రాలు పోసుకుంటున్న ఓ పెళ్లి ఫొటో, ఓ నకిలీ ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఓ హామీ పత్రం మాత్రం ఉంటాయి! లేని పెళ్లిళ్లకు ఈ హడావుడి అంతా ఎందుకయ్యా? అంటే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ డబ్బులను స్వాహా చేసేందుకే! ఇటీవల ఈ దందా బాగా పెరిగిపోయింది.

నిర్మల్‌: కూతురికి పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టేందుకు నిరుపేద తల్లిదండ్రులకు కొండంత ఆసరా ఇచ్చేందుకు సర్కారు అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు కొందరు కేటుగాళ్ల పాలిట ‘కల్పతరువు’గా మారాయి. ప్రత్యేకంగా కొందరు ముఠాగా ఏర్పడి, ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు పెడుతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించకుండానే ఆమోదిస్తుండటంతో వారి దందా మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. ప్రధానంగా నిర్మల్‌ జిల్లాలో కొంతమంది ఈ పథకాల నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత నెలలో జిల్లాలోని నర్సాపూర్‌ (జి) మండలంలో షాదీముబారక్‌ పఽథకంలో నకిలీ వ్యక్తుల పేర్ల మీద చేసుకున్న దరఖాస్తులు బయట పడగా, తాజాగా ఖానాపూర్‌లో కల్యాణలక్ష్మి డబ్బులను కాజేసేందుకు కొందరు వేసిన పన్నాగం బట్టబయలైంది. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని సత్తన్‌పెల్లి గ్రామంలో పదేళ్లక్రితం జరిగిన ఓ పెళ్లిని ఏడాది క్రితం జరిగినట్లు సృష్టించి రూ.100116 కాజేశారు.

దొమ్మటి వెంకటేశ్‌, రమ అనే దంపతులకు అసలు కూతురే లేదు. వీరికి శ్యామల అనే కూతురు ఉన్నట్లు.. ఆమెను అదే గ్రామానికి చెందిన పోతుగంటి నర్సవ్వ, మల్లేశ్‌ గౌడ్‌ల కుమారుడు శేఖర్‌ గౌడ్‌కు ఇచ్చి వివాహం చేస్తున్నట్లు పెళ్లి పత్రికను సృష్టించారు. ట్విస్టు ఏమిటంటే.. ఈ శేఖర్‌, శ్యామల నిజమైన దంపతులే. వీరికి పెళ్లయి పదేళ్లయింది. శ్యామల తల్లిదండ్రులుగా వెంకటేశ్‌, రమ దంపతుల పేర్లతో పెళ్లిపత్రిక సృష్టించి.. గత ఏడాది డిసెంబరు 14న వీరికి పెళ్లయినట్లు పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సరికదా.. వారే సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు పలు సర్టిఫికెట్‌లు సమర్పించాలనే నిబంఽధనలున్నాయి. అయితే ‘ఈ ముఠా’ విషయంలో మాత్రం ఈ రూల్స్‌ను పక్కనబెడుతున్నారు.

తలా కొంత.. ఇబ్బందులొస్తే నేతల అండ..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను దుర్వినియోగంలో ఈ ముఠా పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తోంది. అమాయక ప్రజల వద్దకు వెళ్లి తొలుత పించన్లు ఇప్పిస్తామని చెప్పి ఆధార్‌కార్డులు, మిగతా ధ్రువపత్రాలను వారి నుంచి సేకరిస్తున్నారు. తర్వాత అప్పుడు ‘విషయం’ చెప్పి.. వచ్చే లక్షా నూట పదహారులో కొంత భాగం ఇస్తాం.. సహకరించండి అని ప్రలోభపెడుతున్నారు. సమస్య వస్తే.. మేం చూసుకుంటాం అని నమ్మబలుకుతున్నారు. చోటామోటా నేతలు సహా అందరికీ తలా ఇన్ని ముడతాయి కాబట్టి వారు గప్‌చు్‌పగా ఉంటారని చెబుతున్నారు. ఖానాపూర్‌ మండలం సత్తన్‌పెల్లిలో అచ్చం ఇలాగే జరిగినట్లు తెలుస్తోంది. తతంగం అంతా పూర్తి చేసుకుని కల్యాణలక్ష్మి చెక్కుల మంజూరీ సమయానికి గ్రామస్థులను అడిగితే అసలు ఆ పేర్లతో ఉన్న వారికి అమ్మాయే లేదనే గ్రామస్థులు అధికారులకు తెలిపారు. దీంతో ఆ చెక్కును నిలిపివేశారు.

Courtesy Andhra Jyothy..