• మిగతా ‘5000 బస్సులూ’ ప్రైవేటుకు
  • తీవ్ర నిర్ణయం దిశగా ముఖ్యమంత్రి!
  • న్యాయ వివాదంలోనే తాడోపేడో
  • పర్మిట్లపై నేడో రేపో నిర్ణయం వెల్లడి
  • పకడ్బందీగా హైకోర్టుకు అఫిడవిట్లు

ఆర్టీసీ కార్మికులు మా బిడ్డలే. ముఖ్యమంత్రిగా, మీ నాయకుడిగా, సోదరుడిగా, చెబుతున్నా. మీకు ఒక అవకాశం ఇస్తున్నాం.

3 రోజుల్లో అంటే నవంబరు 6వ తేదీలోగా బేషరతుగా డ్యూటీలో చేరితే రక్షణ ఉంటుంది. అన్ని రకాలుగా భవిష్యత్తు ఉంటుంది. మంగళవారం అర్ధరాత్రికల్లా విధుల్లో చేరకపోతే, మిగతా 5000 బస్సుల రూట్లూ ప్రైవేటుకే ఇస్తాం.
– నవంబరు 2వ తేదీన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు : ఆర్టీసీ భవితవ్యం ఏమిటి? మిగతా సగమైనా ఉంటుందా? అది కూడా ప్రైవేటు పరమవుతుందా? మిగతా 5000 బస్సుల స్థానంలోనూ ప్రైవేటుకు పర్మిట్లు ఇచ్చేస్తారా? కార్మికుల ఉద్యోగాలు న్యాయ వివాదాల్లో చిక్కుకున్నట్లేనా? విశ్వసనీయ వర్గాలు ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే చెబుతున్నాయి. ఉద్యోగాల్లో చేరాలని తాను ఇచ్చిన గడువును కార్మికులు పట్టించుకోకపోవడంతో ఇక తనదైన దారిలో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘ఇక కథ ముగిసినట్లే. ఆర్టీసీ ఇప్పుడున్న రూపంలో ఇక ఎంతమాత్రం కొనసాగదు. ఇది ఖాయం. ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధపడుతోంది’’ అని అధికార వర్గాలు వివరించాయి. ఈ దశలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు తలొగ్గితే భవిష్యత్తులో వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల, ఏది ఏమైనా కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ‘‘ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి వెనక్కు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. కార్మికుల డిమాండ్లకు తలొగ్గే పరిస్థితి కూడా లేదు. అవసరమైతే ఈ సమ్మెను, దానిపై నిర్ణయాన్ని న్యాయస్థానాలకు వదిలి వేయాలని, ప్రజలకు రవా ణా సౌకర్యాల విషయంలో తమదైన ప్రత్యామ్నాయ నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ న్యాయ వివాదం ఎంత సుదీర్ఘంగా కొనసాగినా అందుకు సిద్ధపడాలని, అక్కడే అమీ తుమీ తేల్చుకోవాలని కూడా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు వివరించాయి. అత్యంత పకడ్బందీగా అఫిడవిట్లు దాఖలు చేయాలని భావిస్తోంది. ఆర్టీసీకి ప్రభుత్వం బకాయిలు ఉండడం కాదని.. ఆర్టీసీయే ప్రభుత్వానికి బకాయి ఉందని కోర్టుకు స్పష్టం చేయాలని నిర్ణయించింది. అవసరమైతే, ఇలాంటి అంశాల్లో ఎవరి అధికార పరిధులు ఎంత వరకూ అనే చర్చకు కూడా తెరతీయాలనే ఉద్దేశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెల 5వ తేదీ అర్ధరాత్రికల్లా కార్మికులు విధుల్లో చేరాలంటూ సీఎం కేసీఆర్‌ డెడ్‌లైన్‌ విధించిన విషయం తెలిసిందే. మూడు రోజుల్లో.. 5వ తేదీ రాత్రి 9 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం.. మొత్తం 145 మంది మాత్రమే విధుల్లో చేరారు. గత 3 రోజుల్లో చేరిన వారికి ఎక్కడా డ్యూటీలు ఇవ్వలేదు. సమ్మె విషయమై ఈనెల 7న హైకోర్టు స్పందించనుంది. కోర్టు ఏం చెబుతుందో చూసిన తర్వాత డ్యూటీలు ఇవ్వాలని యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దాంతో, విధుల్లో చేరిన వారిలో కొంతమంది తిరిగి సమ్మెలోకి వచ్చేశారు. మొత్తంమీద, 49,733 మందిలో కేవలం 145 మంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. తాను ఇచ్చిన డెడ్‌లైన్‌ సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో సీఎం కేసీఆర్‌ అసహనంగా ఉన్నట్లు సమాచారం. డెడ్‌లైన్‌లోగా విధుల్లో చేరకపోతే.. 6న మరో కీలక నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ అప్పుడే హెచ్చరించారు. మిగిలిన 5000 బస్సులకూ ప్రైవేటు పర్మిట్లు ఇచ్చేస్తామని హెచ్చరించారు. తాజా పరిణామాల నేపథ్యంలో, సీఎం కేసీఆర్‌ తన వైఖరికే కట్టుబడి ఉండాలని నిర్ణయించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒకటి 2 రోజుల్లోనే మిగిలిన బస్సులకూ ప్రైవేటు పర్మిట్లు ఇవ్వడానికి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారని వివరించాయి. హైకోర్టులో తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే.. సుప్రీం కోర్టుకు వెళతామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తద్వారా, దీనిని సుదీర్ఘ న్యాయ వివాదంగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Courtesy AndhraJyothy..