• రిజర్వేషన్లపై సామరస్య చర్చ జరగాలి
  • ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ప్రతిపాదన
  • దళితులు, బీసీలకు బీజేపీ పూర్తి వ్యతిరేకం
  • చర్చల పేర రిజర్వేషన్ల తొలగింపునకు కుట్ర
  • సమాజాన్ని చీల్చి ఓట్లు తెచ్చుకునే యత్నం
  • బీజేపీ, సంఘ్‌పై మండిపడ్డ కాంగ్రెస్‌, బీఎస్పీ
  • చర్చ అవసరమే లేదు: మంత్రి ఆఠవలే
  • ఇదంతా అనవసర రాద్ధాంతం
  • కోటాకు మా పూర్తి మద్దతు: ఆరెస్సెస్‌
ఆరెస్సెస్‌ మరోసారి ‘కోటా’ను కదిలించింది. ఆ వెంటనే దీనిపై విమర్శలు, ఆరోపణల పరంపర మొదలైంది. బీజేపీ ‘కోటా వ్యతిరేక’ ముసుగు బయటపడిందంటూ పలు పార్టీలు ధ్వజమెత్తాయి. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఆదివారం ఢిల్లీలో జరిగిన ‘జ్ఞానోత్సవ్‌’ కార్యక్రమంలో రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ‘రిజర్వేషన్లను సమీక్షించాలి’ అని గతంలో ఆయన సూటిగా చెప్పిన సంగతి తెలిసిందే. ఈసారి అలా కాకుండా… ఈ అంశంపై సామరస్య వాతావరణంలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.
 ‘‘రిజర్వేషన్లను సమర్థించే వారు వాటిని వ్యతిరేకించే వారితో సామరస్యంగా చర్చించాలి. అలాగే… కోటాను వ్యతిరేకించే వారు దానిని సమర్థించే వారితో అలాగే మాట్లాడుకోవాలి’’ అని మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు. రిజర్వేషన్ల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ తీవ్ర స్పందనలు, ప్రతిస్పందనలు వస్తున్నాయని తెలిపారు. అలాకాకుండా దీనిపై సమాజంలోని వివిధ వర్గాల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.
అసలు ముసుగు అదే…
భాగవత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, బీఎస్పీ తీవ్రంగా స్పందించాయి. కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘పేదల ప్రయోజనాలను దెబ్బతీయడం, రాజ్యాంగ హక్కులను కాలరాయడం, దళితులు-గిరిజనుల హక్కులను లాగేసుకోవడమే బీజేపీ అజెండా’’ అని కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా విమర్శించారు. మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యలతో బీజేపీ-ఆరెస్సెస్‌ ‘దళిత-వెనుకబడిన వర్గాల’ వ్యతిరేక వైఖరి మరోసారి బయటపడిందని తెలిపారు. దీని వెనుక పేదలకు రిజర్వేషన్లను దూరం చేసి, రాజ్యాంగాన్ని మార్చే అజెండా ఉందని సూర్జేవాలా ఆరోపించారు. ఈ అంశంపై ఆయన హిందీలో వరుస ట్వీట్లు చేశారు.

చర్చ పేరిట రిజర్వేషన్లను అంతం చేసే ఒక పకడ్బందీ కుట్ర జరుగుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీఎల్‌ పూనియా విమర్శించారు. ‘‘బీజేపీ-ఆరెస్సె్‌సలు దళిత, బీసీలకు వ్యతిరేకం. సామాజిక-ఆర్థిక సమతుల్యం సాధించడం పెద్ద సవాలు అని అంబేడ్కర్‌ భావించారు. దీని కోసమే రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. బీజేపీ ప్రతిసారీ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు రిజర్వేషన్లపై చర్చ జరగాలంటోంది’’ అని తెలిపారు. సమాజంలో ఘర్షణలు రేకెత్తేందుకే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ఆరోపించారు.

ఉనికికే ముప్పు: మాయావతి
‘రిజర్వేషన్ల వ్యతిరేక’ వైఖరిని సంఘ్‌ విడనాడాలని బీఎస్పీ చీఫ్‌ మాయావతి సూచించారు. ‘రిజర్వేషన్లపై సామరస్యపూర్వక వాతావరణంలో చర్చ జరగాలి’ అని మోహన్‌ భాగవత్‌ చెప్పినప్పటికీ… ఇలాంటి చర్చ మొత్తం కోటాల ఉనికిపైనే సందేహాలు లేవనెత్తే ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీస్తుందని తెలిపారు.

చర్చ అక్కర్లేదు: అథవాలే
రిజర్వేషన్లపై చర్చ జరగాలన్న ఆరెస్సెస్‌ ప్రతిపాదనను కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రి రాందాస్‌ అథవాలే తోసిపుచ్చారు. ‘‘రిజర్వేషన్ల ఫలాలు ఎవరెవరికి అందాయనే అంశంపై చర్చ జరపవచ్చు. అంతే తప్ప… రిజర్వేషన్లు అవసరమా, లేదా అనే దానిపై చర్చ అవసరమే లేదు.’’ అని అథవాలే పేర్కొన్నారు.

కోటాకు మా పూర్తి మద్దతు: ఆరెస్సెస్‌
మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యలపై అనవసరమైన వివాదం సృష్టిస్తున్నారని ఆరెస్సెస్‌ ప్రచార ప్రముఖ్‌ అరుణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాలవారితోపాటు ఆర్థిక బలహీన వర్గాల రిజర్వేషన్లు ఆరెస్సెస్‌ సంపూర్ణ మద్దతు ఉందని… ఈ విషయాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారీ చెబుతూనే ఉన్నామని తెలిపారు. ‘‘సమాజంలోని సంక్లిష్టమైన అంశాలను సామరస్యపూర్వక వాతావరణంలో పరస్పరం చర్చించకోవాల్సిన అవసరాన్ని మోహన్‌ భాగవత్‌ చెప్పారు.

(Courtacy Andhrajyothi)