– చేయిదాటాక ఆల్‌టైం రికార్డుకు మిర్చి ధర
– రైతుల కంట కన్నీరు
– అమ్మినప్పుడు కనిష్టధర క్వింటాల్‌ రూ.5 వేలు.. ఇప్పుడు రూ.15 వేలు
– శీతల గిడ్డంగుల్లో సన్న చిన్నకారు రైతులకు దక్కని చోటు
– బినామీల పేర్లతో దోచుకుంటున్న దళారులు

 

మిర్చి రైతు మరోసారి దగాపడ్డాడు. ఏడాదంతా చెమటోడ్చిన కష్టజీవికి దక్కింది కనిష్ట ధర క్వింటాల్‌కు రూ.5 నుంచి మాత్రమే. గరిష్ట ధర రూ. 9 వేలు. అదీ జెండాపాటల్లో చూపిన రేటు కూడా దక్కలేదు. కానీ, రైతు చేయిదాటిన తర్వాత క్వింటాల్‌ మిర్చి ఆల్‌ టైం రికార్డు ధరకు చేరింది. ఖమ్మం మార్కెట్‌లో ప్రస్తుతం రూ.15,200 పలుకుతున్నది. సుమారు 10 లక్షల క్వింటాళ్ల మిర్చిని అమ్ముకున్న తర్వాత ఈ స్థాయికి ధర చేరడంతో దళారులు, వ్యాపారులకు పండగలా మారింది. శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన పంటలో 30 శాతం మాత్రమే బడా రైతులకు చెందినది కాగా.. మిగతా పంట బినామీ రైతుల పేర్లతో దళారులే దాచుకోవడం గమనార్హం.

చైనా, బంగ్లాదేశ్‌, సింగపూర్‌, మలేషియా, థారులాండ్‌ తదితర దేశాలకు ప్రభుత్వం మిర్చి ఎగుమతులను ప్రోత్సహించడంతో తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ ధరలు పెరిగిపోతున్నాయని మార్కెటింగ్‌ అధికారులు చెబుతున్నారు. కానీ రైతులు అమ్ముకునే రోజుల్లో ఎందుకు ప్రోత్సహించలేకపోతున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నాటికీ నేటికీ పంట ధరల వ్యత్యాసం వారిని ఆవేదనకు గురిచేస్తున్నది. 2018 ఖరీఫ్‌లో భాగంగా ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో సాధారణ మిర్చిసాగు 49,570ఎకరాలు కాగా 58,525 ఎకరాల్లో సాగుచేశారు. జనవరి నెల నుంచి మార్కెట్‌కు వచ్చే రైతుల మిర్చి క్వింటాకు రూ.5వేలు మాత్రమే ధర చెల్లించారు. అదే సమయంలో ఏసీ మిర్చికి రూ.9,500లు ధర పలికింది. మూడు దశల్లో పంటలు మార్కెట్‌కు చేరగా జూన్‌ నెల వరకూ రైతులు మార్కెట్‌కు తెచ్చిన పంటకు క్వింటాకు కేవలం రూ.8లోపే చెల్లించారు. ఆర్నెల్ల సమయంలో మొత్తం 10లక్షల క్వింటాళ్ల వరకు మార్కెట్‌ తెచ్చారు. పంటను కొన్న వ్యాపారులు ఏసీ గోదాముల్లో నిల్వ చేశారు. రైతుల వద్ద సరుకు అయిపోగానే ఇరవై రోజులుగా రోజురోజుకూ ధరలు పెరుగుతున్నాయి. అయితే గిట్టుబాటు ధర వచ్చేదాకా సరుకు నిల్వ చేసుకునేందుకు ప్రవేశపెట్టిన పథకం నిర్వీర్యమైపోవడంతో రైతాంగం కూడా నష్టపోవాల్సి వచ్చింది.
ఖమ్మం జిల్లావ్యాప్తంగా 35 ఏసీ మిర్చి శీతలగిడ్డంగులు ఉన్నాయి. ఖమ్మం నగర గోదాముల్లో 12లక్షల బస్తాలు, మధిర ఏరియా 12 గోదాముల్లో 10.50లక్షల బస్తాలు, వైరా, బూర్గంపాడు, నేలకొండపల్లి మండలాల గోదాముల్లో 5లక్షల బస్తాల మిర్చిని నిల్వచేసుకునే వీలుంది. కానీ వాటిలో 70 శాతం మిర్చిని వ్యాపారులు, మిగిలిన 30 శాతం పెద్ద రైతులు నిల్వ చేసుకున్నట్టు తెలిసింది.

ఈ నామ్‌ ఊసెత్తని అధికారులు 
వ్యవసాయ ఉత్పత్తులను గరిష్ట ధరకు విక్రయించుకునేం దుకు కేంద్ర ప్రభుత్వం ఈనామ్‌ (ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌) విధానాన్ని 2016లో అమల్లోకి తీసుకొచ్చింది. రైతులు తమ వాణిజ్య ఉత్పత్తులను ఏ రాష్ట్రంలోనైనా గరిష్ట ధరకు అమ్ముకునే వీలు కల్పిస్తుంది. వ్యాపారుల సిండికేట్‌ మోసాలకు, దళారుల వ్యవస్థకు తావుండదు. దేశంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలోనూ ఈ విధానాన్ని అమలుచేస్తున్నారు. కానీ ఖమ్మం మార్కెట్‌లో మా త్రం వ్యాపారులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశం పై ఉన్నతాధికారులు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. వ్యాపారుల కనుసన్నల్లోనే అధికారులున్నారని రైతులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

వ్యాపారులకు మేలు చేయడమే.. 
రైతులంతా మిర్చి అమ్ముకున్న తర్వాత క్వింటా ధర రూ.15, 200లకు పెంచడమంటే వ్యాపారులకు మేలు చేయడమే. ఏసీ గోదాముల్లో సరుకు నిల్వచేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. సరుకంతా బినామీ రైతుల పేరుతో గోదాముల్లో వ్యాపారులే నిల్వచేసుకుంటున్నారు.
– మాదినేని రమేష్‌, రైతుసంఘం జిల్లా కార్యదర్శి

విదేశాల్లో మంచి డిమాండ్‌..
చైనా, బంగ్లాదేశ్‌తో పాటు విదేశాల్లో మిర్చి పంటకు డిమాండ్‌కు పెరిగింది. మార్కెట్‌లో రైతులు తెచ్చిన సరుకు ధరను మేం పెంచలేం. వారు నాణ్యత ప్రకారమే కొనుగోలు చేస్తారు. ఏసీ గోదాంలో మిర్చి నిల్వచేసుకున్న రైతులకు మంచి ధర లభిస్తోంది.
– సంతోష్‌కుమార్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి

క్వింటాకు రూ.7500 చెల్లించారు.. 
పదహేను క్వింటాళ్ల మిర్చి తీసుకొస్తే క్వింటా కేవలం రూ.7,500 చెల్లించారు. జెండాపాట రూ. 9లుగా చెప్పినా రైతులకు చెల్లించే ధరలో తేడా ఉంది. సరుకు బాగోలేదని తిరస్కరించారు. చివ రికి అయిన కాడికి అమ్ముకున్నాను. అంతా వ్యాపారులు చెప్పిందే రేటు.
– నిమ్మల కోటేశ్వరరావు, మహబూబాబాద్‌

గోదాంలో స్థలం లేదన్నారు 
మార్కెట్‌కు మిర్చి అమ్మకానికి తెస్తే ధర పలక లేదు. కనీసం గోదాములో దాచుకుని మంచిధరకు అమ్ముకుందామంటే గోదాంలో స్థలం లేదన్నారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. చేసేదేం లేక వ్యాపారులు చెప్పిన ధర రూ.7వేలకే అమ్ముకోవాల్సి వచ్చింది.
– బత్తుల స్వామి, కన్నెగుండ్ల

ఖమ్మం మార్కెట్‌లో జనవరి నుంచి అమ్మకాల ధరలు..
నెల మార్కెట్‌కు వచ్చినది గరిష్ట ధర 
క్వింటాళ్లలో.. రూపాయల్లో..
జనవరి 91,796 9,500
ఫిబ్రవరి 2,81,939 9,375
మార్చి 3,74,584 9,575
ఏప్రిల్‌ 61,752 10,500
మే 19,693 11,000
జూన్‌ 1,75,000 9,000
జులై 2,25,000 13,000
ఆగస్టు 1,00,000 15,200

 

(Courtacy Nava Telangana)