ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్‌ఈసీపీ) నుంచి భారత్‌ వైదొలిగింది. ఇది భారత రైతుల, రైతు సంఘాల, ట్రేడ్‌ యూనియన్ల, చిన్న, మధ్య తరహా వ్యాపారుల, పౌర సమాజం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. తక్కువ సమయంలోనైనా ప్రజలు దీనికి వ్యతిరేకంగా జరిపిన పోరాటం అభినందనీయం. పైకెన్ని చెబుతున్నా ప్రజల పోరాటాల ఫలితంగానే ఈ ఒప్పందంపై మోడీ సర్కారు వెనక్కి తగ్గిందనేది దాచేస్తే దాగని సత్యం. ముఖ్యంగా ఈ ఒప్పందంలోకి భారత్‌ చేరితే ఇక్కడి పాడిరైతులు ఎదుర్కొనబోయే సమస్యల గురించి ఇక్కడ ప్రస్తావించుకుందాం.
ఆర్‌ఈసీపీతో ఉన్న ప్రధాన భయం టారిఫ్‌లను ఎత్తివేయడం. ఆర్‌ఈసీపీ అమల్లోకి వస్తే దాని నిబంధనలు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఒప్పందాల కంటే కఠినంగా ఉంటాయి. ఒక వస్తువును దిగుమతి చేసుకుంటే దానిపై సుంకాలను విధించే అధికారం, నియంత్రణ దిగుమతి చేసుకున్న దేశానికి ఉండేది. కానీ ఆర్‌ఈసీపీలో అది లేదు. ఆర్‌ఈసీపీలో చేరిన దేశం దిగుమతి చేసుకునే వస్తువులు, సరుకులపై టారిఫ్‌లను పూర్తిగా ఎత్తివేయాలి. క్రమంగా వచ్చే పది, పదిహేనేండ్లలో దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్‌లను సున్నాకు చేర్చడమే దీని లక్ష్యం. ప్రస్తుతం మనం దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై సగటున 63.84 శాతం బౌండ్‌ టారిఫ్‌ను విధిస్తున్నారు.
స్వయం సమృద్ధి సాధించిన రంగం
భారత పాడి రంగం సుమారు 7 కోట్ల మంది కుటుంబాలకు జీవనాధారం. ఇందులో చాలామంది చిన్న, సన్నకారు రైతులే. 2017లో వెలువరించిన ఒక నివేదిక ప్రకారం.. యూఎస్‌లో ఒక సగటు డైరీ ఫాంలో ఉన్న గేదెలు 191 కాగా.. ఒషినియా లో 355.. యూకేలో 148.. డెన్మార్క్‌లో 160 గేదెలు ఉన్నాయి. భారత్‌లో ఈ సంఖ్య 2 గేదెలు మాత్రమే. అయినప్పటికీ, ప్రపంచ పాల ఉత్పత్తిలో 1960 తర్వాత మనం పుంజుకున్నాం. ఇది 1970లో 5 శాతం ఉండగా.. 2018నాటికి 20శాతానికి చేరింది. దేశంలో నేడు పాడి రంగం అతిపెద్ద స్వయం సమృద్ధి సాధించిన రంగమని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మనం ఏ దేశం నుంచీ పాల ఎగు మతు లుగానీ దిగుమతులుగానీ చేసుకోవడం లేదు.
ప్రపంచ పాల వ్యాపారాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 79శాతం పాలను ఎగుమతి చేసేవి అభివృద్ధి చెందిన దేశాలే. ఇందులో ప్రధానంగా యూఎస్‌, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు ఉన్నాయి. న్యూజిలాండ్‌ అయితే 93శాతం పాలను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది. చైనా మాత్రం 30 శాతం పాలను దిగుమతి చేసుకుంటోంది.
అయితే, ఆర్‌ఈసీపీ రీజియన్‌లో ఉన్న పలు దేశాలు ప్రపంచ పాల వ్యాపారాన్ని శాసిస్తున్నాయి. ప్రపంచ పాల వ్యాపారంలో 51శాతం, వెన్నతీసిన పాల పొడి (స్కిమ్మ్‌డ్‌ మిల్క్‌ పౌడర్‌-ఎస్‌ఎంపీ)లో 45శాతం, బట్టర్‌ ఆయిల్‌లో 38శాతం, చీజ్‌లో 31శాతం, బట్టర్‌లో 31శాతం ఆర్‌సెఫ్‌ దేశాలకు దిగుమతువుతున్నాయి. అందుకే ఈ మార్కెట్‌ల మీద ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల కన్ను పడింది. లాభసాటిగా ఉన్న ఈ మార్కెట్లను హస్తగతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది ‘ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్ట్‌నర్‌షిప్‌’ (టీపీపీ) తర్వాత మరింత ఎక్కువైంది.
ఎంఎన్‌సీలకు పెరుగుతున్న ఆదాయాలు
గడిచిన 25ఏండ్లలో భారత పాలకులు అనుసరించిన విధానాల వల్ల ప్రయివేటు పాల సంస్థలు లాభాలు దండుకున్నాయే తప్ప పాడి రైతులకు మిగిలింది శూన్యహస్తాలే. రైతుల పాలను సేకరించడంలో కీలక పాత్ర పోషించిన ‘మిల్క్‌ కో ఆపరేటివ్స్‌’ సైతం లాభాల బాట పట్టలేదు. పాలసీల రూపకర్తలు సైతం బహుళజాతి సంస్థలకు లాభాలు చేకూర్చే విధానాలనే రూపొందించారే తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదు. అందుకే విదేశాలకు చెందిన బడా కంపెనీలు ఇక్కడి సంస్థలను తమలో కలుపుకోవడం, లేకపోతే పూర్తిగా కొనేయడం వంటివి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంఎన్‌సీలు మనదేశంలో ఫ్రాంచైజీలను తెరుస్తున్నాయి. స్విస్‌ దిగ్గజం నెస్లే మనదేశంలో పాలను అధికంగా కొనుగోలు చేసే అతిపెద్ద ప్రయివేటు సంస్థ. ఫ్రెంచ్‌కు చెందిన లక్టలిస్‌ భారత్‌లో 2014లో ప్రవేశించి.. హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న తిరుమల పాల ఉత్పత్తుల సంస్థను కొనుగోలు చేసింది. అలాగే ఇండోర్‌లోని అనిక్‌ ఇండిస్టీస్‌, ప్రభాత్‌ డైరీలనూ స్వాధీనం చేసుకుంది. మరో ఫ్రెంచ్‌ సంస్థ దనోనె.. భారత్‌లో యోగార్ట్‌ (పెరుగు ఉత్పత్తులు) బ్రాండ్‌లపై రూ.182కోట్ల పెట్టుబడులు పెట్టింది. న్యూజిలాండ్‌కు చెందిన అతిపెద్ద పాల ఎగుమతిదారు ఫొంటెడ్రా డైరీ భారత్‌లోని కిషోర్‌ బిర్యానీ సంస్థతో 50:50 ఒప్పందం కుదుర్చుకుంది.మరోమాటలో చెప్పాలంటే బహుళజాతి డైరీ సంస్థలు (మల్టీ నేషనల్‌ డైరీ ఫామ్స్‌) భారత్‌లో భారీగా మొహరించాయి. ప్రస్తుతం ఆ సంస్థలు భారతీయ రైతుల నుంచి బలవంతంగానైనా పాలను కొంటున్నాయి. ఎందుకంటే దిగుమతి చేసుకునే పాల మీద మన దేశం విధించే ‘అప్లైడ్‌ టారిఫ్‌’ 35శాతం ఉంది గనుక. భారత్‌ ఆర్‌ఈసీపీలో చేరితే ఈ టారిఫ్‌ను ఎత్తివేస్తారనే భావనతో ఆయా సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. ఇక అప్పుడు ఈ సంస్థలు మన పాడి రైతుల నుంచి పాలను కొనుగోలు చేయవు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా నుంచే దిగుమతి చేసుకుంటాయి. ఇది మన రైతులకు కోలుకోలేని దెబ్బ. ప్రస్తుతం న్యూజిలాండ్‌ నుంచి దిగుమతి చేసుకునే వెన్నతీసిన పాల (ఎస్‌ఎంపీ) ధర కిలోకు రూ.150. భారత్‌లో ఇది రూ. 300గా ఉంది. మనదేశ పాడి రైతు లీటరు పాలకు సగటున రూ.30 పొందుతున్నాడు (అమూల్‌ అంచనాల ప్రకారం). టారిఫ్‌లు ఎత్తివేస్తే ఎస్‌ఎంపీల ధర తగ్గి ఇక్కడి పాడి రైతుకు లీటరు పాల ధర రూ.19 నుంచి రూ.15 దాకా పడిపోయే అవకాశం ఉంది.
న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పాల ఉత్పత్తి కోసం అయ్యే ఖర్చు మన దేశంతో పోల్చితే చాలా రెట్లు తక్కువ. అక్కడ చాలినన్ని గడ్డి మైదానాలు, పాలను తీయడానికి అధునాతన సామాగ్రి, రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. అంతేగాక అక్కడి జంతువులు రోజుకు 30లీటర్లకు తక్కువ కాకుండా పాలిస్తాయి. న్యూజిలాండ్‌ ప్రభుత్వం సైతం ఈ రంగాన్ని బాగా ప్రోత్సహిస్తున్నది. ఆ దేశ పాల ఎగుమతిదారుల్లో ఫొంటెర్రా సంస్థనే 90శాతం వాటా కల్గి ఉంది. అంతేగాక ప్రపంచంలో మూడింట ఒకటోవంతు వాటా ఆక్రమించింది. యూఎస్‌, యూకే వంటి అగ్ర దేశాలలోని బడా కంపెనీలు సైతం ఈ సంస్థతో పోటీ పడలేకపోతున్నాయి. అందుకే ఈ రంగంలో ఫొంటెర్ర గుత్తాధిపత్యాన్ని నియంత్రించాలని అగ్రదేశాలూ డిమాండ్‌ చేస్తున్నాయి.
తప్పుడు వాదనలు
ఆర్‌సీఈపీ ఒప్పందం కారణంగా ప్రధానంగా రెండు తప్పుడు వాదనలను ప్రచారంలోకి తెచ్చి భారత్‌ను ఇందులోకి లాగడానికి కార్పొరేట్లు పథకం వేశారు. అందులో ‘భారత్‌ త్వరలోనే పాల కొరత ఎదుర్కొంటుంది’ అనేది ఒకటి కాగా ‘న్యూజిలాండ్‌ నుంచి దిగుమతయ్యే పాలలో 5శాతం పెరిగాయనేది’ మరొకటి. ఇవి రెండూ తప్పుడు వాదనలే. నిటిఆయోగ్‌ గణాంకాల ప్రకారం 2033నాటికి భారత్‌లో పాల ఉత్పత్తి 330 ఎంఎంటీలుగా ఉంటుందనేది అంచనా. అప్పటికీ దేశంలో 292ఎంఎంటీల వినియోగం మాత్రమే ఉంటుందనీ, అది పోగా మనమే ఇంకా మిగులులో ఉంటామని స్వయానా నిటిఆయోగే తేల్చింది. రెండో వాదన సైతం పస లేనిది. భారత్‌లో 7కోట్ల కుటుంబాలు ఈ రంగం మీద ఆధారపడి జీవిస్తుంటే.. ఆ సంఖ్య న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా లలో చాలా రెట్లు తక్కువ. దీనిలో చేరితే భారత పాడిరంగానికి ఎప్పటికైనా ముప్పు పొంచి ఉన్నది. దీనిని రైతులు, రైతు సంఘాలు సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ప్రస్తుతానికి ఈ ఒప్పందంపై వెనక్కి తగ్గినా.. భవిష్యత్తులో తమ సమస్యలను పరిగణనలోకి తీసుకుని చర్చిస్తే అందులో చేరడానికి ఆలోచిస్తామని ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు. అంతేగాక ఆర్‌సెప్‌ కూడా భారత్‌కు ఎల్లవేళలా తలుపులు తెరిచే ఉన్నాయని సంకేతాలు పంపు తోంది. దీనిపై దేశమంతా అప్రమత్తంగా ఉండాలి. భవిష్యత్తులోనూ మన దేశం ఇందులో చేరకుండా పోరాటాలను కొనసాగిస్తూ మన దేశ రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

ఆర్‌. రాంకుమార్‌
(ది హిందూ సౌజన్యంతో)
స్వేచ్ఛానువాదం : శ్రీను మునిగాల,
సెల్‌: 7989660512