Related image– నాసిక్‌ ఇండిస్టియల్‌ జోన్‌లో 20వేల కొలువులకు కోత 
– వ్యాపారాలకు వాతపెట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ : యాజమానులు 

ముంబయి : మహారాష్ట్రలోని ప్రసిద్ధ నాసిక్‌ ఇండిస్టియల్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌(నీమా)పై మాంద్యం మబ్బులు ముసురుకుంటున్నాయి. దేశంలోని ఆటోమొబైల్‌ ఇండిస్టీకి అనుబంధ పరికరాలను సరఫరా చేసే అతిపెద్ద హబ్‌ నీమా ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నది. ఆటోమొబైల్‌ రంగం ఇప్పటికే అమ్మకాల్లేక కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. దీంతో నీమాలోని తయారీరంగానికి ఆర్డర్లు రావడం లేదు.

ఆటోమొబైల్‌ రంగంలో కనిపించిన మాంద్యం ఛాయలు ఇప్పుడు ఇతర రంగాల్లోనూ ప్రస్ఫుటమవుతున్నది. ఆటోమొబైల్‌ అనుబంధ రంగాల్లో ఇప్పటికే లక్షల్లో ఉద్యోగాలు ఊడిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో మహారాష్ట్రలోని నీమాలోనూ కొలువులకు కోత పడింది. నీమా తన చరిత్రలోనే దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని యాజమానులు వాపోతున్నారు. కాగా, ఈ గడ్డు పరిస్థితులకు మోడీ సర్కారు తీసుకున్న నోట్లరద్దు, జీఎస్టీ నిర్ణయాలే ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు.

జిమ్‌ పరికరాల్లో మేటి కంపెనీకీ.. 
మనదేశంలో జిమ్‌ పరికరాల అతిపెద్ద ఉత్పత్తిదారు సాన్సన్‌ ఇండిస్టీ ప్రయివేటు లిమిటెడ్‌ యజమాని జాదవ్‌ మాట్లాడుతూ.. ‘నేటి పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలో పాలుపోవడం లేదు. భవిష్యత్‌ అంధకారంగా కనిపిస్తున్నది. మాకు ప్రభుత్వమే ప్రధాన కస్టమర్‌. దేశవ్యాప్త మున్సిపాల్టీలు, క్రీడా శాఖల్లో తమ ఉత్పత్తులనే సర్కారు కొనుగోలు చేస్తుంది. కానీ, ఇప్పుడు అదే సమస్యగా పరిణమించింది. 12 నెలలుగా తమ బకాయిలు సర్కారు చెల్లించడం లేదు. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవా?’ అని ప్రశ్నించారు. రెండేండ్లుగా పన్నుల వసూళ్లు భారీగా క్షీణించాయి. చెల్లింపుల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది ఆర్థిక మాంద్యం సంకేతాలను మరింత బలపరుస్తున్నది.

నీమా చరిత్రలోనే గడ్డుకాలం
నాసిక్‌ ఇండిస్టియల్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు మంగేశ్‌ పటాంకర్‌ ప్రస్తుతం నెలకొన్న మాంద్యం తరహా పరిస్థితులపై స్పందించారు. ‘ప్రస్తుతం నీమా దాని చరిత్రలోనే అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నది. మేం ఎలక్ట్రోప్లేట్లు తయారు చేస్తాం. మా రెండు కంపెనీల్లో కలిపి సుమారు 70 మంది ఉద్యోగులుండేవారు. కానీ, నేడు పనిలేక వీరి సంఖ్య 34కు చేరింది. ఏడాది క్రితం 50వేల వస్తువులను తయారు చేసేవాళ్లం. నేడు వాటి తయారీ దాదాపు శూన్యమే’నని అన్నారు. ‘నేడు చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు మూలం నోట్లరద్దు, జీఎస్టీల్లోనే ఉంది. జీఎస్టీ విధానం వ్యాపారులను చాలా గందరగోళంలోకి నెట్టేసింది.
మార్కెట్‌లో సంక్షోభానికి అదే ప్రధాన కారణం. నీమా పరిధిలో నాలుగు నెలల్లో 20 వేల మందికిపైనే ఉద్యోగులు, కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. పనే లేనప్పుడు వారికి జీతాలు ఎలా ఇవ్వగలం? స్పష్టమైన విధానాలను అమలు చేస్తూ పారిశ్రామికవేత్తలకు సర్కారు బాసటగా ఉండాలి. కేవలం హామీలు పరిస్థితులను మెరుగుపరచవ’ని తెలిపారు.

నోట్లరద్దుతో అసంఘటితరంగాలు కుదేలయ్యాయని మంగేశ్‌ చెప్పారు. ‘గాజుల తయారీకి సంబంధించి నీమాలో ఓ యూనిట్‌ ఉండేది. అదంతా ఒక అసంఘటితపు నిర్మాణం. నీమాలో ఉత్పత్తయిన వ్యర్థాలే దానికి ముడిపదార్థం. ఈ ముడిపదార్థాన్ని ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో ఇండ్లల్లోనే వారసత్వంగా గాజులు తయారుచేసే మహిళలకు పంపేవారు. కానీ, నోట్లరద్దు ఈ వ్యవస్థనంతా ధ్వంసం చేసింది. అంటే, ఇక్కడ నోట్లరద్దు పర్యవసనానికి బలైంది ఎవరు? వ్యర్థాలతో వ్యాపారం చేసేవారు.. ఆ పేద మహిళలే కదా’అని వివరించారు.

(Courtacy Nava Telangana)