ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశంలోనూ ఆర్థిక మందగమనం వల్ల అత్యధికంగా నష్ట పోయేది దళిత , బహుజనులే. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిమానిటైజేషన్ భారత ఆర్థిక వ్యవస్థ పై విపరీతమైన ప్రభావం చూపింది. లక్షలాది చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు దేశ సమగ్ర అభివృద్ధికి తోడు పడకపోగా, నేడు ఇప్పుడు ఇటీవలి సంవత్సరాలలో ఎన్నడు లేనంత నిరుద్యోగిత శాతం నమోదైంది. వ్యవసాయరంగం సంక్షోభంలో ఉంది. ప్రభుత్వ ఆర్థిక విధానాలు అధిగమించే విధంగా లేవు. ఈ మొత్తం ప్రభావం దేశంలోని పేదలకే అతి పేద లైనా దళిత బహుజనుల పైననే పడింది.

ప్రపంచ దేశాలన్నింటా ఆర్థిక మందగమనం 
అమెరికా – చైనా వాణిజ్య యుద్ధమే కారణం 
సింగపూర్‌లో ఇప్పటికే కనిపిస్తున్న ప్రభావం 
భారతదేశంలో పరిస్థితి కొంత మెరుగే 

రె..సి..ష..న్‌..! దాదాపు దశాబ్దం క్రితం అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అమెరికా లాంటి అగ్రరాజ్యాల వరకు అన్నింటినీ గజగజ వణికించిన పదమిది. అప్పట్లో మూడేళ్లపాటు కొనసాగిన ఆర్థికమాంద్యం ప్రభావం దారుణం. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితే కళ్లముందు కనపడుతోంది! రాబోయే 9 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం మరోసారి బుసకొట్టే ప్రమాదం ఉందని ఆర్థికనిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా-చైనా మధ్య మొదలైన వాణిజ్యయుద్ధం చినికిచినికి గాలివానగా మారి ఉప్పెనలా ప్రపంచదేశాలన్నింటినీ ముంచేయొచ్చని అంటున్నారు. ఈ రెండు దేశాలూ ఇలా సుంకాలు విధించుకుంటూ పోతే అంతర్జాతీయ ఆర్థికవృద్ధి రేటు ఏడేళ్ల కనిష్ఠస్థాయి.. అంటే 2.8 శాతానికి పడిపోవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే రాబోయే మూడు త్రైమాసికాల్లో ప్రపంచ ఆర్థికవ్యవస్థ మాంద్యంలోకి పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది!!

కళ్లముందే నాటి సంక్షోభం 
2006లో అమెరికాలో మొదలైన సబ్‌ప్రైమ్‌ సంక్షోభం తీవ్రతను నాటి ప్రభుత్వం గుర్తించలేకపోయింది. రెండేళ్ల తర్వాత 2008 మూడో త్రైమాసికంలో అమెరికా వృద్ధిరేటు 0.3%కి పడిపోయింది. అదే సంవత్సరం సెప్టెంబరు 29న అమెరికా స్టాక్‌మార్కెట్లు ఇంట్రాడేలో 777.68 పాయింట్లు పడిపోయాయి. ఈ సంక్షోభ ప్రభావం వినియోగ వస్తువుల నుంచి సాఫ్ట్‌వేర్‌ రంగం వరకు అన్నింటిపైనా కనిపించింది. అమెరికాలో వ్యాపారాలు మందగించడంతో ఆ మార్కెట్‌పైనే ఎక్కువగా ఆధారపడిన భారత్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలూ కుదేలయ్యాయి. ఉద్యోగులకు పింక్‌స్లిప్పులు జారీ అయ్యాయి. అప్పటివరకు కార్లు, ఇళ్ల కొనుగోలు కోసం చేసిన అప్పులు తీర్చేదారి కనపడక చాలామంది తీవ్రమైన మానసిక కుంగుబాటుకూ (డిప్రెషన్‌) లోనయ్యారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థలయిన అమెరికా, చైనాల మధ్య వాణిజ్యయుద్ధం ఈసారి మాంద్యానికి కారణమయ్యేలా కనిపిస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 10% సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. ఎలక్ట్రానిక్స్‌ విషయంలో ఈ విధింపును డిసెంబరు 15కు వాయిదా వేసింది. ఇతర వస్తువులకు మాత్రం సెప్టెంబరు 1 నుంచి అమలవుతాయి. దానికి ప్రతిగా చైనా కూడా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘నగదు మోసకారి’గా చైనాను అమెరికా అభివర్ణించింది. అమెరికాకు పంపే తమ ఎగుమతులు మరింత చవగ్గా ఉండేందుకు కావాలనే యువాన్‌ను చైనా బలహీనపరుస్తోందని, దానివల్ల అమెరికా విధించబోయే పన్నుల ప్రభావం వాటిపై అంతగా పడదన్నది ఆ దేశ వ్యూహమని అమెరికా ఆరోపించింది.

సిద్ధంగా సింగపూర్‌ 
అగ్రరాజ్యాల వాణిజ్యయుద్ధం ప్రభావం సింగపూర్‌ మీద ఎక్కువగా కనిపించేలా ఉంది. ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆర్థికమాంద్యం ఏర్పడే సూచనలున్నాయని కోఫేస్‌ బీమాసంస్థ ప్రధాన ఆర్థికవేత్త కార్లోస్‌ కాసనోవా చెప్పారు. ఉత్పాదక రంగం వృద్ధి 3.1 శాతం పడిపోవడం ఇందుకు ప్రధానకారణంగా నిలిచింది. ప్రపంచ వాణిజ్య మాంద్యానికి సింగపూర్‌ ప్రధాన సూచిక అని కాసనోవా తెలిపారు. సింగపూర్‌ ఎగుమతులు జూన్‌లో 17.3% తగ్గాయి. జులైలో సింగపూర్‌ నుంచి చైనాకు చమురేతర ఎగుమతులు 15.8% తగ్గాయి. హాంకాంగ్‌కు అవి 38.2% తగ్గాయి. జులైలో పారిశ్రామిక ఉత్పత్తులు 6.9% పడిపోయాయి. చైనా ఆర్థికవ్యవస్థ కూడా సింగపూర్‌ తరహాలోనే రెండో త్రైమాసికంలో వృద్ధిరేటు మందగమనాన్ని నమోదుచేసింది. అమెరికా విధిస్తున్న సుంకాల కారణంగా చైనా దిగుమతులు కూడా తగ్గి అంతర్జాతీయ వృద్ధిమీద ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం కనిపిస్తోంది. డిమాండు తగ్గడం వల్ల ఎలక్ట్రానిక్‌ వస్తువుల సరఫరా గొలుసు కూడా ప్రభావితం అవుతుంది.

అమెరికాదీ అదే దారి 
రాబోయే 12 నెలల్లో అమెరికా మరోసారి మాంద్యంలోకి పడిపోయే ప్రమాదం కనిపిస్తోందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా హెచ్చరించింది. దీనివల్ల అంతర్జాతీయంగా కూడా పరిణామాలు దారుణంగా ఉంటాయని తెలిపింది. మాంద్యం వచ్చేందుకు 20 శాతం వరకు అవకాశాలున్నాయని… కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి ఇందుకు మూడోవంతు అవకాశాలు కూడా ఉండొచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా ఆర్థికవేత్తల అధినేత మిషెల్‌ మెయిర్‌ హెచ్చరించారు. పారిశ్రామిక ఉత్పత్తులు, వాహనాల అమ్మకాలు, మొత్తం పనిగంటలు.. ఈ మూడు సూచికలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆమె తెలిపారు. అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ కూడా ఇలాగే చెప్పింది.

ఎందుకు వస్తుంది? 
వరుసగా రెండు త్రైమాసికాల పాటు (ఆరు నెలలు) ఉత్పత్తి పడిపోతే మాంద్యం మొదలవుతుంది. అయితే ఉద్యోగాలు, చమురు డిమాండ్‌ కూడా గణనీయంగా తగ్గినపుడే దాని ప్రభావం విస్తృతస్థాయిలో కనిపిస్తుంది. దీర్ఘకాలంలో అంతర్జాతీయ వృద్ధిరేటు 3.5 శాతం ఉంటుంది. అదే మాంద్యం సమయంలో అది 2.5 శాతానికి మించదు. పెట్టుబడులు తగ్గడం వల్ల ఉద్యోగాల కోత మొదలవుతుంది. ఉద్యోగులకు జీతాలూ తగ్గుతాయి. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోతుంది. అపుడు వస్తువుల డిమాండు, ఉత్పత్తి అవసరం తగ్గి.. చివరకు
మాంద్యానికి దారితీస్తుంది.

భారతదేశం కొంత నయమే 
ప్రపంచవ్యాప్త ఆర్థికమాంద్యం ప్రభావం భారతదేశం మీద మాత్రం మరీ అంత ఎక్కువగా ఉండే సూచనలు లేవని మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ అంచనా వేసింది. పారిశ్రామిక ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, వాహన పరిశ్రమ లాంటివి మందగమనంలో ఉన్నా.. మాంద్యం దరిచేరకపోవచ్చని అంటోంది. సవాళ్లను ఎదుర్కోడానికి ఆర్థికమంత్రిత్వశాఖ పరిశ్రమవర్గాలతో భేటీలు జరుపుతోంది. మందగమనాన్ని ఎదుర్కోడానికి పన్నుల తగ్గింపు లాంటి చర్యలు తీసుకోనుంది. దశాబ్దం క్రితం ఏర్పడిన అంతర్జాతీయ మాంద్యం సమయంలోనూ అమెరికా, ఐరోపా దేశాలతో పోలిస్తే భారత్‌పై ప్రభావం కొంత తక్కువే. వాటికంటే చాలా త్వరగా కూడా కోలుకుంది.

ప్రభావితమయ్యే రంగాలు 
ఆటోమొబైల్‌ 
పారిశ్రామికం 
మౌలిక సదుపాయాలు 
టోకు, చిల్లర వ్యాపారాలు  

అంతర్జాతీయ సంక్షోభానికి సూచిక…

సింగపూర్‌

రెండో త్రైమాసికంలో చైనా వృద్ధిరేటు-6.2%
(27 సంవత్సరాలలో అతి తక్కువ)
ఆర్థికమాంద్యం ప్రభావం మొదలయ్యేదెప్పుడు:

మరో 9 నెలల్లో!

 

 

(Courtacy Eenadu)