– ప్రకాశ్‌రాజ్‌, బృందాకరత్‌, కుమారస్వామిలకు బెదిరింపులు
– ట్విట్టర్‌ ద్వారా వెల్లడించిన ప్రకాశ్‌రాజ్‌

బెంగళూరు : మోడీ సర్కారు, సంఫ్‌ు పరివార్‌ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌, నటుడు ప్రకాశ్‌రాజ్‌తో సహా మరికొంతమంది ప్రముఖులను హతమారుస్తానని ఓ ఆగంతకుడు లేఖ రాశాడు. గుర్తుతెలియని వ్యక్తి కన్నడలో రాసిన ఈ లేఖను ప్రకాశ్‌రాజ్‌ ట్విట్టర్‌లో ఆదివారం పోస్ట్‌ చేశారు. లేఖలో ప్రకాశ్‌రాజ్‌ను ఉద్దేశిస్తూ…’నీ చావుకు సిద్ధంగా ఉండు. నీవిక బతకవు. వాళ్లను కూడా (జాబితాలో ప్రస్తావించిన వారిని) చావడానికి సిద్ధంగా ఉండమను. మేము మిమ్మల్ని తప్పకుండా హతమారుస్తాం. జనవరి 29 నుంచి మీ చావులు మొదలవుతాయి’ అని రాసి ఉంది. ఆగంతకుడు చంపుతానన్న వారి జాబితాలో బృందాకరత్‌, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, బజరంగ్‌దళ్‌ నాయకుడు మహేంద్రకుమార్‌, నిజగుణానంద స్వామిజీ, నిడుమిడి వీరభద్ర చెన్నమల్ల స్వామి, చేతన్‌ కుమార్‌ (నటుడు), ప్రొఫెసర్లు మహేశ్‌ చంద్ర గురు, భగవాన్‌ వంటివారు ఉన్నారు. వీరందరినీ జనవరి 29 నుంచి ఒక్కొక్కరిగా హతమారుస్తానని దుండగుడు హెచ్చరించాడు. కాగా, దీనిపై మిగిలినవారు ఇంకా స్పందించాల్సి ఉంది.

రజినీకాంత్‌కూ….
చెన్నై : పెరియార్‌ రామస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీనటుడు రజినీకాంత్‌కు బెదిరింపులు వచ్చాయి. రజినీ క్షమాపణలు చెప్పాల్సిందేననీ ద్రవిడ విడుదలై కళిగం (డీవీకే) నాయకుడు ఉమాపతి డిమాండ్‌ చేయగా.. సూపర్‌స్టార్‌ను ప్రాణాలతో ఉండనివ్వబోమనీ ఆయన హెచ్చరించారు. అయితే తాజాగా డీవీకేకు చెందిన పలువురు సభ్యులూ.. రజినీని హత్య చేస్తామంటూ బెదిరించారని ఆయన తరఫున న్యాయవాది స్థానిక సినోరా పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెరియార్‌ మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తూ హిందూ దేవుళ్లను అవమానించారని రజినీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

Courtesy Nava telangana