Image result for rcep‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం’ (రీజినల్‌ కాంప్రహెన్సివ్‌ ఎకనామిక్‌ పార్ట్‌నర్‌షిప్‌–ఆర్సీఈపీ) పేరిట కొనసాగుతున్న 16 దేశాల స్వేచ్ఛావాణిజ్య ఒప్పంద యత్నాలు దేశంలోని రైతులను, పాల ఉత్పత్తి సంఘాలను, వ్యాపారులను, చిన్న పరిశ్రమలను తీవ్రంగా భయపెడుతున్నాయి. మొన్న చైనా అధ్యక్షుడు మోదీతో మనసువిప్పి మాట్లాడిన కీలకాంశాల్లో ఇదీ ఉన్నదట. ఇప్పటికే చైనా ఉత్పత్తులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతూ, దేశీయ ఉత్పత్తులను చావుదెబ్బతీస్తున్న నేపథ్యంలో, చైనా నాయకత్వంలోని ఈ ఒప్పందంలో చేరితే మరిన్ని దేశాల ఉత్పత్తులు మన అనేక రంగాలను ముంచుతాయన్నమాట వాస్తవం. ఆరేళ్ళుగా నానుతూ, ఇప్పుడు తుది అంకానికి చేరిన తరుణంలోనే ఆర్సీఈపీనుంచి భారత్‌ బయటకు వచ్చేయాలన్నది అనేకమంది డిమాండ్‌.
ఆర్సీఈపీలో చేరితే పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ తరువాత దేశప్రజలమీద మోదీ ప్రభుత్వం కొట్టిన మరో పెద్ద దెబ్బ అవుతుందని కాంగ్రెస్‌ అంటున్నది. దేశీయ చిన్నతరహా పరిశ్రమలను ముంచే చైనా ఉత్పత్తులు, భారతీయ పాడి రైతులను దెబ్బతీసే న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా దేశాల డైరీ ఉత్పత్తులు, చివరకు కీలకమైన డేటాను స్వేచ్ఛగా పంచుకోవడం వల్ల దేశభద్రతకు వచ్చిపడే ప్రమాదాన్నీ పలువురు ఎత్తిచూపుతున్నారు. స్వదేశీ జాగరణ్‌మంచ్‌ సైతం ఆగ్రహంతో ఉన్నందున మోదీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నది. పీయూష్‌ గోయల్‌ మొన్న సోమవారం చేసిన వ్యాఖ్యలో ఒప్పందం నుంచి తప్పుకొనే అవకాశాలు ఉన్న ధ్వని వినిపించింది. ఒకవేళ చేరవలసి వస్తే దేశీయంగా అన్ని రంగాలకూ భద్రత కల్పించిన తరువాతే అటు కన్నెత్తి చూస్తామని కూడా కేంద్ర పెద్దలు మరోపక్క అంటున్నారు. బ్యాంకాక్‌లో నవంబరు 4న జరిగే దేశాధినేతల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ రోజు భారతదేశం తన అంగీకారం తెలిపే అవకాశం, ప్రమాదం ఉన్నది కనుక, దేశవ్యాప్త నిరసనలు, ఉద్యమాలతో దానిని అడ్డుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలన్నీ చౌకదిగుమతులకు గేట్లు తెరిచి స్థానిక ఉత్పత్తులను, ఉత్పత్తిదారుల జీవితాలను దెబ్బకొడుతున్నవే కనుక, ఆర్సీఈపీతో వచ్చిపడే కొత్త ముప్పును శక్తిమేరకు నిలువరించాలన్నది పలు సంఘాల ప్రయత్నం.

చైనా, జపాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణకొరియాలతో పాటు ఆసియాన్‌కు చెందిన మరో పదిదేశాలు ఈ ఒప్పందంలో భాగం కనుక, సుంకాలు బాగా తగ్గించుకోవడం లేదా ఎత్తివేయడం ద్వారా వీటి ఉత్పత్తులను మనం స్వాగతించవలసి ఉంటుంది. కేవలం చైనా ఉత్పత్తులే మరో 80 మనదేశంలోకి అదనంగా వచ్చిపడతాయట. ప్రపంచవాణిజ్యంలో మూడోవంతు, స్థూల ఉత్పత్తిలోనూ, విదేశీపెట్టుబడుల్లోనూ నాలుగోవంతు ఆర్సీఈపీలో ఉన్న దేశాలన్నీ నియంత్రిస్తున్నందున భారతదేశానికి ఈ కూటమిలో చేరడం ఒక పెద్ద వాణిజ్య, ఎగుమతి అవకాశంగా ప్రచారం జరుగుతున్నది. కానీ, ప్రస్తుతం ఈ దేశాలకు మనం చేస్తున్న ఎగుమతుల కంటే దిగుమతులే ఎంతో అధికం. చైనాతో మనకు నాలుగులక్షలకోట్ల పైచిలుకు వాణిజ్యలోటు ఇప్పటికే ఉన్నది. వాణిజ్యావకాశాల మాట అటుంచితే, దిగుమతి సుంకాలు తగ్గించడం వల్ల ఆ లోటు మరింత పెరుగుతుందన్నది వాస్తవం. ఈ పరిస్థితిని కాస్తంత సరిదిద్దడానికే ఆర్సీఈపీ చర్చలు ఆరంభమైన 2013ను కాక, 2019ను తగ్గించిన సుంకాలకు ‘బేస్‌ ఇయర్‌’గా తీసుకోవాలని భారత్‌ కోరుతున్నది. 2014తరువాత భారతదేశం వివిధ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 17శాతం వరకూ పెంచింది. అలాగే, ఈ ఒప్పందం కారణంగా దిగుమతులు అనూహ్యంగా పెరిగిపోయినప్పుడు, కొన్ని ఉత్పత్తులపై అవే మినహాయింపులు, రాయితీలు కొనసాగించననే హక్కు తనకుండాలని కూడా భారత్‌ అంటున్నది. అతిపెద్ద భారత మార్కెట్‌ను ఎవరూ వదులుకోరు కనుక, ఈ ప్రతిపాదనల్లో కొన్నింటికి కూటమి తలూపినప్పటికీ, అందులో చేరికవల్ల మనకు లాభం కంటే నష్టమే ఎక్కువని అనేకుల అభిప్రాయం. ఈ దేశాల్లో అనేకం తమ స్థానిక ఉత్పత్తి దారులకు భారీ రాయితీలు ఇచ్చి ఉత్పత్తి ఖర్చు తక్కువ ఉండేట్టు చూడటం వల్ల, అవి మన ఉత్పత్తులకంటే తక్కువ ధరలో ఉండటం సహజం. న్యూజిలాండ్‌లో వెయ్యి పశువులతో, భారీ దిగుబడితో పాలవ్యాపారం చేస్తున్న ఓ రైతుతో మనదేశంలో ఒకటీరెండు పశువులను పోషించుకొనే బక్కరైతు ఎంతమాత్రం పోటీపడలేడు. ఈ కారణంగానే, పెద్ద పెద్ద సహకార డైరీలు సైతం ఈ ఒప్పందాన్ని చూసి భయపడుతున్నాయి. ఇప్పటికే, మలేషియా పామాయిల్‌ దేశీ రైతులను దెబ్బతీసినట్టుగా, ఇకపై అనేక పంట ఉత్పత్తులు మన రైతులను దెబ్బతీయవచ్చు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే వ్యవసాయం, ఇతర రంగాల్లో కనీసం 5కోట్లమంది జీవనోపాధి కోల్పోతారన్న ఆర్థిక నిపుణుల హెచ్చరికను ప్రభుత్వం లక్ష్యపెడుతుందని ఆశిద్దాం.

Courtesy Andhra Jyothy