ఈఏఎస్‌ శర్మ ఐఏఎస్‌ ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి

మన దేశంలో ఎటువంటి ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ముందుచూపుతో వ్యవహరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకునే గురుతరమైన బాధ్యత రిజర్వు బ్యాంకు మీద ఉంది. వ్యాపార, ఆర్థికాభివృద్ధికి బ్యాంకుల ద్వారా వ్యాపార సంస్థలకు రుణాలు లభించే చర్యలు తీసుకోవటం, మరోపక్క వడ్డీరేట్లను నిర్ణయించటం, నగదు లభ్యత సజావుగా ఉండే విధంగా చర్యలు తీసుకోవటం, ధరలు పెరగకుండా నియంత్రించటం రిజర్వు బ్యాంకు ప్రధానమైన విధులు. తద్వారా ఈ సంస్థ ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తోందనేది తెలిసిపోతోంది. ఇంతటి ప్రాధాన్యం కల సంస్థ తన విధులు సక్రమంగా నిర్వర్తించాలంటే దాని చేతిలో తగినంతగా నిధులు ఉండాలి.

ఇదేకాకుండా రిజర్వు బ్యాంకు మరికొన్ని ముఖ్యమైన బాధ్యతలు కూడా నిర్వర్తిస్తోంది. రాష్ట్రాల ఆర్థిక  స్థితిగతులను పర్యవేక్షించటం, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు అనుగుణంగా రుణాలు సేకరించటం… ఇందులో ముఖ్యమైనవి.

విదేశీ వర్తకంలో దేశానికి మేలు జరగాలంటే రూపాయి మారక విలువ మీద కొంతవరకూ నియంత్రణ ఉండాలి. ఈ పని రిజర్వు బ్యాంకు చేస్తుంది. మనకు విదేశాల్లో కొన్ని పెట్టుబడులు ఉంటాయి. ఆ పెట్టుబడులను పర్యవేక్షించే పని రిజర్వు బ్యాంకు చేస్తుంది. విదేశీ మారక ద్రవ్య రేట్లు మనకు అనుకూలంగా లేనప్పుడు విదేశీ ద్రవ్యాన్ని అమ్మే బాధ్యత, విదేశీ మారక ద్రవ్యం బలపడి మన ఎగుమతులకు నష్టం కలిగే  పరిస్థితి ఉండే విదేశీ మారక ద్రవ్యాన్ని కొనే బాధ్యత కూడా రిజర్వు బ్యాంకుదే. ఈ క్రమంలో లాభనష్టాలు ఉంటాయి. దాన్ని రిజర్వు బ్యాంకు భరించాలి. ఎప్పుడు నష్టాలు వస్తాయో చెప్పలేం. కొన్నిసార్లు లాభాలు రావచ్చు. కానీ నష్టభయం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి నష్టాలను తట్టుకోవాలంటే కూడా ఈ సంస్థ వద్ద తగినంతగా మిగులు నిధులు ఉండాలి. లేనిపక్షంలో రిజర్వు బ్యాంకు సమర్థంగా వ్యవహరించలేకపోతుంది.

రిజర్వు బ్యాంకుకు ఏటా వచ్చే ఆదాయం నిజమైన ఆదాయం కాదు. అందులో చాలా వరకూ విదేశీ మారక ద్రవ్యం విలువలో హెచ్చుతగ్గుల వల్ల వచ్చే ఆదాయం ఉంటుంది. అటువంటి ఆదాయాన్ని మిగులు సొమ్ముగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి మళ్లించటం సరికాదు. ఏటా రిజర్వు బ్యాంకు డివిడెండు రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పెద్దమొత్తంలో నిధులు ఇస్తుంది. అదికాకుండా మిగులు నిధులను ఆర్‌బీఐ నుంచి కేంద్ర ప్రభుత్వానికి బదలాయించటం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

* రిజర్వు బ్యాంకు ఆర్థికంగా బలహీనపడి దేశ ఆర్థిక పరిస్థితిలో కానీ, అంతర్జాతీయంగా క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పుడు కానీ సమర్థంగా ఎదుర్కొనలేదు. అంతర్జాతీయ సంస్థలు మనదేశం ‘రేటింగ్‌’ను తగ్గించే పరిస్థితి రావచ్చు.

* ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి లభిస్తున్న సమాచారం ప్రకారం గత రెండేళ్లుగా ప్రభుత్వానికి తగినంతగా పన్ను ఆదాయం లేక బడ్జెట్‌లో ఆదాయానికి మించి ఖర్చు ఉండటం వల్ల ప్రభుత్వానికి అప్పుల భారం పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ నుంచి మిగులు నిధులు తీసుకుంటే ఆ సొమ్ము ప్రభుత్వం అప్పులు తీర్చుకోవటానికి ఉపయోగపడుతుందే కానీ అభివృద్ధికి దోహదపడే పెట్టుబడులుగా మారవు.

* బాధ్యతతో వ్యవహరించే ఏ ప్రభుత్వం అయినా రిజర్వు బ్యాంకు నుంచి నిధులు తీసుకునే బదులు దుబారా ఖర్చులు తగ్గించేందుకు, ప్రభుత్వ బ్యాంకుల పాలనా వ్యవహారాలను చక్కదిద్దేందుకు, ఇతర ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలి.

* రిజర్వు బ్యాంకును ఒక పరాయి వ్యవస్థగా భావించి ఆ సంస్థ నుంచి నిధులు తీసుకోవటం అంటే… ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించటం లేదనే. అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రంగంలో పెనుసవాళ్లు రాబోతున్నాయి. అటువంటి నేపథ్యంలో రిజర్వు బ్యాంకును బలోపేతం చేయాల్సింది పోయి… దాని నుంచి నిధులు బదలాయించుకోవటం సరైన విధానం కాదు.

(Courtesy Eenadu)