కారులో పరారైన అత్యాచార నిందితులు
కారు బోల్తా.. ఒకరి మృతి.. మరొకరికి గాయాలు

జహీరాబాద్‌ : జహీరాబాద్‌ పట్టణంలోని పస్తాపూర్‌ శివారులో మంగళవారం మహిళపై అత్యాచారం ఘటనలో నిందితులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. అయితే, తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఓ నిందితుడు కారు ప్రమాదంలో మృతి చెందాడు. మరో ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.బుధవారం ఉదయం నిందితులు న్యాల్‌కల్‌ మండలం గంగ్వార్‌ వద్ద ఉన్నారన్న సమాచారంతో జహీరాబాద్‌ ఎస్‌ఐ వెంకటేశ్‌ సిబ్బందితో కలిసి వెళ్లారు. ఒక నిందితుడు పవన్‌ను పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు సోమేశ్వర చారీ, బ్రహ్మచారీ కారులో అల్లాదుర్గం వైపు వెళ్లారు. పోలీసు లు వెంటాడటంతో నిందితులు కారును అతి వేగంగా పోనిచ్చారు. ఈ క్రమంలో రాయికోడ్‌ మండలం మహబత్‌పూర్‌ వద్ద కారు బోల్తా పడి సోమేశ్వరచారీ(45) అక్కడికక్కడే మృతి చెందగా, బ్రహ్మచారీ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు సోమేశ్వరచారీ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జహీరాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన బ్రహ్మచారీని చికిత్స నిమిత్తం జహీరాబాద్‌కు తీసుకొచ్చారు.

అత్యాచారానికి పాల్పడింది పవనే..
ఒంగోలు జిల్లా గిద్దలూరుకు చెందిన పవనే ప్రధాన నిందితుడని పోలీసులు అంటున్నారు. మహిళపై అతనే అత్యాచా రం చేశాడని చెప్పారు. వరుసకు అన్నదమ్ములైన సోమేశ్వరచారీ, బ్రహ్మచారీ వరంగల్‌ జిల్లా కాజీపేటకు చెందిన వారని తెలిపారు. బ్రహ్మచారీ హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో హోటల్‌ నడుపుతున్నాడని, అతని వద్ద పవన్‌ పనిచేస్తున్నాడన్నారు. వీళ్లు ముఠాగా ఏర్పడి అక్రమాలకు పాల్పడేవారని చెప్పారు.

వివరాలు త్వరలో వెల్లడిస్తాం: డీఎస్పీ
మహిళపై అత్యాచారం కేసును దర్యాప్తు చేస్తున్నామని, తమ అదుపులో ఉన్న వారిని విచారిస్తున్నామని డీఎస్పీ గణపతి జాదవ్‌ తెలిపారు. నిందితులపై వివిధ ప్రాంతాల్లో పలు కేసులు ఉన్నాయని, పూర్తిస్థాయి వివరాలు సేకరించాక నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హజరుపరుస్తామన్నారు.

Courtesy Andhrajyothi