న్యూఢిల్లీ బ్యూరో: దేశంలో ప్రతి 16 నిమిషాలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతోందని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) స్పష్టం చేసింది. మహిళలపై నేరాల్లో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, హింస, దాడులకు సంబంధించిన కేసులపై ఆందోళనలు జరుగుతున్న వేళ ఎన్‌సిఆర్‌బి విడుదల చేసిన నివేదిక దేశంలో మహిళలు, బాలికలు ఏమాత్రమూ సురక్షితంగా లేరన్న విషయాన్ని స్పష్టీకరించింది. 2018తో పోల్చితే 2019లో మహిళలపై నేరాలు గణనీయంగా పెరిగాయి. 2019లో దేశంలో ప్రతిరోజూ సగటున 88 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. 2019లో మహిళలపై మొత్తం 4,05,861 కేసులు నమోదయ్యాయి, ఇది 2018 (3,78,236 )తో పోలిస్తే 7.3 శాతం పెరిగింది. ప్రతిరోజూ 14 మంది బాలికలపై దాడులు జరగడం ఆందోళనకరం.

ఎఫ్‌ఐఆర్‌కు నోచుకోని నేరాలు
దేశం మొత్తం 1,12,23,694 ఫిర్యాదులు నమోదు కాగా, అందులో కేవలం 5,13,497 పైన మాత్రమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు జరిగింది. అలాగే 84,28,966 లిఖిత పూర్వక ఫిర్యాదులు చేయగా, అందులో కేవలం 44,52,621 వాటిపై మాత్రమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. మరో 1,90,054 కేసులపై ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. దీంతో మొత్తం 2019లో దేశవ్యాప్తంగా 1,96,52,660 ఫిర్యాలు అందగా వాటిలో కేవలం 51,56,172 పైనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అంటే అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 51,56,172 ఘటనలు జరిగాయి. ఇది గతేడాది (50,74,635) కంటే బాగా పెరిగింది.
దేశంలో నేరాల్లో 3,53,131 కేసులతో ఉత్తరప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. 3,41,084 కేసులతో మహారాష్ట్ర, 2,46,470 కేసులతో మధ్యప్రదేశ్‌ తరువాత స్థానాల్లో నిలిచాయి. 2019లో దేశవ్యాప్తంగా 28,316 హత్య కేసులు నమోదు అయ్యాయి. హత్యల్లో కూడా 3,806 కేసులతో ఉత్తరప్రదేశ్‌ మొదటి స్థానంలోనే నిలిచింది. 3,138 హత్య కేసులతో బీహార్‌, 2,142 కేసులతో మహారాష్ట్ర తరువాత స్థానాల్లో నిలిచాయి.

గృహహింస నేరాలూ అధికమే..
ఎన్‌సిఆర్‌బి వెల్లడించిన భయానక గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు స్త్రీ తన అత్తమామల చేతిలో క్రూరత్వాన్ని అనుభవిస్తుంది. 2019లో 32,033 అత్యాచార కేసులు నమోదైతే, అందులో 11 శాతం దళిత వర్గానికి చెందిన మహిళలేనని నివేదిక పేర్కొంది. ”ఐపిసి కింద మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులలో ఎక్కువ భాగం భర్త, అతని బంధువుల వేధింపుల (30.9 శాతం) కింద నమోదయ్యాయి. తరువాత ‘మహిళలపై దాడి’ (21.8 శాతం), ‘మహిళలను అపహరించడం ‘(17.9 శాతం), ‘రేప్‌ ‘ (7.9 శాతం) నమోదయ్యాయి. లక్ష మంది మహిళా జనాభాకు నేరాల రేటు 2018లో 58.8 నమోదు కాగా, దాంతో పోల్చితే 2019లో 62.4కు పెరిగింది”అని ఎన్‌సిఆర్‌బి నివేదిక పేర్కొంది. 2019లో కిడ్నాప్‌, అపహరణకు సంబంధించి 1,05,037 కేసులు నమోదయ్యాయి. అందులో 744 మంది చనిపోయారు. మొత్తం కేసులలో 78.6 శాతం (84,921) మహిళలు, బాలికలు బాధితులుగా ఉన్నారు. 2019లో దేశవ్యాప్తంగా 1,05,037 కిడ్నాప్‌, అపరహరణ కేసులలు నమోదు కాగా, అందులో 16,590 కేసులతో ఉత్తరప్రదేశ్‌ ప్రథమ స్థానంలోనూ, 11,755 కేసులతో మహారాష్ట్ర, 10,707 కేసులతో బీహార్‌ తరువాత స్థానాల్లో నిలిచాయి.

చిన్నారులపై నేరాలు
దేశంలో చిన్నారులపై నేరాలు కూడా గతం కంటే పెరిగాయి. 2019లో 1,48,185 కేసులు నమోదు కాగా, గత ఏడాది (1,41,764) కంటే 4.5 శాతం కేసులు పెరిగాయి. ఇందులో కిడ్నాప్‌, అపరహరణ కేసులు 46.6 శాతం, అత్యాచారాల కేసులు 35.3 శాతం నమోదు అయ్యాయి. ప్రతి లక్ష మంది చిన్నారులకు 33.2 నేరాలు జరుగుతున్నాయి.

అదఅశ్యమయ్యేవారిలో మహిళలే ఎక్కువ
2019లో దేశవ్యాప్తంగా 3,80,526 మంది అదఅశ్యం కాగా, అందులో మహిళలే (2,48,397) ఎక్కువ మంది ఉన్నారు. ఇది గతేడాది కంటే 9.5 శాతం పెరిగింది. అలాగే మరోవైపు చిన్నారులు కూడా భారీగా అదఅశ్యం అయ్యారు. ఒక్క 2019లోనే 73,138 చిన్నారులు అదఅశ్యం అయ్యారు. గతేడాదితో పోల్చితే ఇది 8.9 శాతం పెరిగింది.

దళిత, గిరిజనలపై పెరిగిన దాడులు
దేశంలో దళిత, గిరిజనలపై దాడులు పెరిగాయి. దళితులకు సంబంధించి 2019లో 45,935 కేసులు నమోదు అయ్యయి. గతంతో పోల్చితే దళితులపై దాడులకు సంబంధించి 7.3 శాతం కేసులు పెరిగాయి. దళితులపై దాడుల్లో ఉత్తరప్రదేశ్‌ 11,829 (25.8 శాతం) కేసులతో ప్రథమ స్థానంలో నిలిచింది. 6,794 (14.8 శాతం) కేసులతో రాజస్థాన్‌, 6,544 (14.2 శాతం) కేసులతో బీహార్‌ తరువాత స్థానాల్లో నిలిచాయి. గిరిజనలకు సంబంధించి 2019లో 8,257 కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది కంటే 26.5 శాతం కేసులు ఈ ఏడాది పెరిగాయి. ఎస్టీలపై జరిగిన దాడుల్లో మధ్యప్రదేశ్‌ (1,922), రాజస్థాన్‌ (1797), ఉత్తరప్రదేశ్‌ (721) కేసులతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నయి.

Courtesy Prajashakti