న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత చిన్మయానంద్‌ లైంగికదాడి కేసులో ఊహించని మలుపు చోటుచేకున్నది. న్యాయ విద్యార్థిని బంధువులు సంజరు సింగ్‌, సచిన్‌ సింఘార్‌, విక్రమ్‌లతో కలిసి డబ్బులు వసూలుకు పథక రచన చేసిందనే ఆరోపణల నేపథ్యంలో సిట్‌ అధికారులు వీరిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. లా విద్యార్థినిపై ఆరోపణలు వచ్చిన క్రమంలో ముందస్తు బెయిల్‌ కోసం ఆమె కోర్టులో అప్పీలు చేసుకోగా అలహాబాద్‌ డివిజన్‌ బెంచ్‌ న్యాయస్థానం దాన్ని తోసిపుచ్చింది. దీంతో మంగళవారం న్యాయవిద్యార్థినితో పాటు మరో ముగ్గురిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీ సెక్షన్‌ 385, 506, 201, 35, 67 కింద కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో తన చుట్టూ ఓ డ్రామా జరుగుతున్నదనీ, కొంతమంది తన అభియోగాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని న్యాయవిద్యార్థిని పేర్కొన్నారు. కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. తనపై లైంగికదాడికి పాల్పడి చిన్మయానంద చాలా పెద్ద తప్పు చేశారనీ, కాని చిన్న శిక్ష విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తనకు అసంతప్తిగా ఉన్నదనీ, ఆయనపై సెక్షన్‌ 376కి బదులు సెక్షన్‌ 376సి విధించటం సరికాదని ఆమె పేర్కొన్నారు. న్యాయ విద్యార్థిని చేసిన ప్రతి ఆరోపణలను బీజేపీ నేత చిన్మయానంద అంగీకరించినట్టు సిట్‌ చీఫ్‌ నవీన్‌ ఆరోరా వెల్లడించిన సంగతి తెలిసిందే.

Courtesy NavaTelangana…