• కాఫీలో మత్తు మందు కలిపి అత్యాచారం
  • నగ్నచిత్రాలు నెట్‌లో పెడతానంటున్నారు
  • 12 ఏళ్లుగా నరకం చూపిస్తున్నారు
  • ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు
  • కేసు నమోదుకు హెచార్సీ ఆదేశించినా
  • పట్టించుకోవడం లేదు
  • సైబరాబాద్‌ సీపీకి మహిళ ఫిర్యాదు
  • రామచంద్రాపురం ఠాణాలో కేసు నమోదు
  • రాజకీయ కుట్రగా ఖండించిన రఘునందన్‌

రామచంద్రాపురం/హైదరాబాద్‌ సిటీ : బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అడ్వకేట్‌ రఘునందన్‌రావు 12 ఏళ్లుగా తనపై అత్యాచారం చేస్తున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. సోమవారం ఆమె సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ను కలిసి తనకు నరకం చూపిస్తున్న రఘునందన్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. సజ్జనార్‌ ఆదేశాలతో రామచంద్రాపురం పోలీసు స్టేషన్‌లో రఘునందన్‌పై అత్యాచారం, బెదిరింపులు, ప్రాణహానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. బాధిత మహిళ (47) ఫిర్యాదు ప్రకారం.. రామచంద్రాపురం ఠాణా పరిధి జ్యోతినగర్‌కు చెందిన ఆమె 2003లో భర్తపై పోలీస్‌ స్టేషన్‌లో గృహ హింస కింద కేసు పెట్టింది.

ఆ తర్వాత పటాన్‌చెరులో అడ్వకేట్‌ రఘునందన్‌రావును సంప్రదించి.. పోషణ ఖర్చుల కోసం భర్తపై సంగారెడ్డి కోర్టులో కేసు (నం.16/2003) వేసింది. ఈ క్రమంలో 2007 డిసెంబరు 2న కేసు గురించి మాట్లాడేందుకు ఆఫీసుకు రావాలంటూ రఘునందన్‌ ఆమెను పిలిచారు. కేసు విషయం చర్చిస్తుండగా ఇంట్లోకి వెళ్లి కాఫీ తెచ్చి ఆమెకు ఇచ్చారు. అది తాగిన వెంటనే కళ్లు తిరుగుతున్నట్లు అనిపించింది. రఘునందన్‌ ఆమెను గదిలోకి తీసుకెళ్లబోగా విడిపించుకునేందుకు పెనుగులాడింది. అయినా ఆయన ఆమెను గట్టిగా పట్టుకుని గదిలోకి తీసుకెళ్లారు. మెలకువ వచ్చాక తనపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్న ఆమె రఘునందన్‌ను నిలదీసింది. ‘పోలీసు కేసు పెట్టినా, విషయం ఎవరికైనా చెప్పినా చంపేస్తా. నీ నగ్న చిత్రాలు నా దగ్గరున్నాయి.

వాటిని ఇంటర్నెట్‌లో పెట్టి నీ జీవితాన్ని నాశనం చేస్తాన’ంటూ ఆమెను బెదిరించారు. ఎన్నోసార్లు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే రాజకీయ పలుకుబడితో, రౌడీలతో బెదిరించారు. గతేడాది మార్చిలో రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు (ఎస్‌ఆర్‌ 998/2019) చేయగా కేసు నమోదు చేసి, చర్య తీసుకోవాలని గత నెల 23న రామచంద్రాపురం పోలీసులను ఆదేశించింది. అనంతరం ఆ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా స్పందన లేకపోవడంతో సోమవారం కమిషనర్‌ను ఆశ్రయించింది. సీపీ ఆదేశాలతో రఘునందన్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ రమే్‌షకుమార్‌ తెలిపారు. ఈ ఆరోపణలను రఘునందన్‌ ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగా తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ప్రశ్నించేవారిపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. హెచ్‌ఆర్‌సీకి వెళ్లి ఫిర్యాదు పత్రాలు తీసుకుంటానన్నారు.

Courtesy Andhrajyothi