• పెట్రోలు పోసి తగులబెట్టే యత్నం
  • అనంతరం ఆస్పత్రికి తరలింపు
  • ప్రమాదమని నమ్మించే ప్రయత్నం
  • 70 శాతం కాలిన శరీరం..
  • ఖమ్మంలో బాలికపై అఘాయిత్యం
  • 17 రోజుల తర్వాత వెలుగులోకి

‘అన్నా’ అని పిలిచినందుకైనా ఆ కామాంధుడు కనికరించలేదు. కామంతో కళ్లు మూసుకుపోయి 12 ఏళ్ల బాలికపై అమానుషంగా ప్రవర్తించాడు. తప్పించుకునే ప్రయత్నంలో పక్కకు నెట్టేసిందని పెట్రోలు పోసి నిప్పంటించేశాడు. అభం శుభం తెలియని బాలికపై ఓ యువకుడి దాష్టీకమిది. నిన్నమొన్న జరిగిన హాథ్రస్‌ ఘటన కళ్లముందు మెదులుతుండగానే కలవరపాటుకు గురిచేసే మరో దారుణం జరిగింది. ఈ అకృత్యం ఎక్కడో కాదు.. మన రాష్ట్రంలోనే.. ఖమ్మంలో జరిగింది. 70 శాతం శరీరం కాలిపోయి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక.. వెల్లడించే వరకు ఈ ఘోరం వెలుగులోకి రాలేదు.

ఖమ్మం : ‘‘పైనుంచి వచ్చి చేయి పట్టుకుండు.. ఏంటన్నా అంటే.. నామీద పడబోయిండు. పక్కకు నెట్టా.. దాంతో నన్ను ఎందుకు నెట్టేసినావు అని అక్కడే ఉన్న పెట్రోలు నా మీద పోసి మంట అంటించిండు. అమ్మో కాలుతోంది అని పెద్దగా అరిచా. భయంతో అతడే నా దగ్గరకు వచ్చి కాలిపోతున్న దుస్తులను చింపేసిండు. అప్పటికే ఒళ్లు మొత్తం కాలిపోయింది. నొప్పేస్తోంది. ఇన్ని రోజులు భయంతో విషయం చెప్పలేదు’’ ఇవీ.. ఓ మృగాడి పైశాచికత్వానికి బలైన ఆ అభాగ్యురాలు ఏడుస్తూ చెప్పిన మాటలు.

ఖమ్మం నగరానికి సమీప మండలానికి చెందిన దంపతులకు ఆరుగురు కుమార్తెలు. కరోనా వేళ పనులు లేక కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం, పాఠశాలలు పనిచేయకపోవడంతో.. ఆ దంపతులు తమ 12 ఏళ్ల రెండో కుమార్తెను ఖమ్మంలోని పార్శీబంధం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో పనికి కుదిర్చారు. ఆ బాలిక ఆ ఇంట్లోనే ఉంటూ పనిచేసుకునేది. ఈ క్రమంలో.. గత నెల 18న ఉదయం 6 గంటల సమయంలో.. బాలిక నిద్రిస్తుండగా.. ఇంటి యజమాని కుమారుడు ఎ.మారయ్య ఆమె గదిలోకి వెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఈ హఠాత్పరిణామంతో బాలిక హడలిపోయింది. ప్రతిఘటించే యత్నం చేసింది. ‘నన్ను వదిలేయ్‌ అన్నా’ అంటూ వేడుకుంది. అయినా ఆ కామాంధుడు కనికరించలేదు.

దీంతో.. ఆ బాలిక అతణ్ని బలంగా పక్కకు నెట్టేసింది. దూరంగా పడిపోయిన మారయ్య.. ఉక్రోషంతో ఉన్మాదిలా మారాడు. ఆ బాలిక దండం పెడుతున్నా.. పట్టించుకోకుండా పెట్రోలు పోసి, నిప్పంటించాడు. తగలబడిపోతూ ఆ బాలిక చేసిన ఆర్తనాదాలకు భయపడిపోయిన మారయ్య.. తనే మంటలు ఆర్పాడు. కానీ, అప్పటికే ఆ బాలిక శరీరం 70ు కాలిపోయింది. కొనప్రాణంతో ఉండగా ఆస్పత్రికి తరలించాడు. ప్రమాదవశాత్తూ నిప్పంటుకుందని కట్టుకథ చెప్పాడు. ఇంటి యజమాని.. బాలిక తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఇదే కట్టుకథ చెప్పాడు.

కంగారుపడిన వాళ్లు.. హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. 17 రోజుల చికిత్స తర్వాత సోమవారం కొద్దిగా కోలుకున్న బాలిక.. జరిగిన దారుణాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది. వారు ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఎన్నో అనుమానాలు..
కాలిన గాయాలతో అనుమానాస్పద స్థితిలో ఆస్పత్రులకు చికిత్సకోసం వచ్చినప్పుడు.. మెడికో లీగల్‌ కేస్‌ అయిన తర్వాతనే వైద్యులు చికిత్స ప్రారంభించాలి. అత్యవసర సందర్భాల్లో చికిత్స అందించినా.. ఆ తర్వాతైనా పోలీసులకు సమాచారం అందించాలి. కానీ, వైద్యులు మౌనంగా 17 రోజుల పాటు బాలికకు చికిత్స అందించారు.ఇదే ప్రస్తుతం అనేక అనుమానాలకు తావిస్తోంది.

కాగా, విషయం తెలుసుకున్న ఖమ్మం స్పెషల్‌ మొబైల్‌ జడ్జి జస్టిస్‌ ఉషశ్రీ, పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. పలు విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు ఆస్పత్రికి వద్దకు చేరుకుని ధర్నా చేపట్టాయి. నిందితుడు మారయ్యను ఖమ్మం పోలీసులు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్యాయత్నం, అత్యాచారయత్నం, పోక్సో తదితర చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

సీఎల్పీ నేత భట్టి ఖండన
ఖమ్మంలో జరిగిన ఈ ఘటనను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మహిళల రక్షణకు ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, పోలీసు వ్యవస్థ.. స్త్రీలకు రక్షణ కల్పించాలని కోరారు.

Courtesy Andhrajyothi