• ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ జరిగిన కొద్దిరోజులకే మృతి
  • ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా ఉన్న పాస్వాన్‌
  • దళిత నేతగా జాతీయస్థాయిలో గుర్తింపు
  • మండల్‌ కమిషన్‌ రిపోర్ట్‌ అమలులో కీలకపాత్ర
  • ఐదుగురు ప్రధానుల వద్ద మంత్రిగా బాధ్యతలు
  • 8 సార్లు లోక్‌సభకు, 2సార్లు రాజ్యసభకు ఎన్నిక
  • తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారు: కేసీఆర్‌
  • నేడు దేశవ్యాప్తంగా జాతీయ పతాకం అవనతం

వ్యక్తిగతంగా లోటు..
ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరనిలోటు. నాకు మంచి స్నేహితుడు, సహచరుడు. కష్టపడి పైకొచ్చిన వ్యక్తి.  పేద ప్రజానీకం గౌరవంగా బతకాలని ఆకాంక్షించారు. మంత్రిగా కీలక రంగాల్లో గొప్ప సేవలందించారు. అసాధారణ పార్లమెంటేరియన్‌. గొప్ప దళిత నేత..ఆయన మరణం వల్ల ఏర్పడ్డ లోటు పూడ్చలేనిది.
– ప్రధాని మోదీ 

న్యూఢిల్లీ, అక్టోబరు 8: కేంద్ర మంత్రి, దళిత నేత, లోక్‌ జనశక్తి (ఎల్జేపీ) వ్యవస్థాపకుడు రామ్‌విలాస్‌ పాస్వాన్‌ (74) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయనకు కొద్ది రోజుల కిందటే గుండె శస్త్ర చికిత్స జరిగింది. అయినా ఆయన కోలుకోలేకపోయారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉండడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. నరేంద్ర మోదీ కేబినెట్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ మంత్రిగా ఉన్న పాస్వాన్‌ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు. ఆయన కుమారుడు, ఎల్జేపీ అధినేత చిరాగ్‌ పాస్వాన్‌- తన తండ్రి మరణవార్తను ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘నాన్నా..! ఇపుడీ ప్రపంచంలో నువ్వు లేవు. కానీ నాకు తెలుసు.. ఎల్లపుడూ నువ్వు నా చెంతే ఉంటావని..!’ అని ట్వీట్‌ చేశారు. తనను చిన్నతనంలో తండ్రి ఎత్తుకున్నప్పటి ఓ ఆత్మీయమైన ఫొటోను ట్యాగ్‌ చేశారు. రామ్‌విలాస్‌ది ఐదు దశాబ్దాల రాజకీయ జీవితం. ఎనిమిది సార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1946 జూలై 5న బిహార్‌లోని ఖగారియా జిల్లా షహర్బానీలో పేద దళిత కుటుంబంలో పుట్టిన పాసవాన్‌ న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు.

పట్నా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేశారు. 1960ల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన సోషలిస్ట్‌ భావాలున్నవారు. జయప్రకాశ్‌ నారాయణ్‌, రాజ్‌నారాయణ్‌లకు సన్నిహితుడు. తొలిసారిగా యునైటెడ్‌ సోషలిస్ట్‌ పార్టీ తరఫున 1969లో బిహార్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జేపీ, రాజ్‌నారాయణ్‌, కర్పూరీ ఠాకూర్‌లతో పాటు ఆందోళనల్లో పాల్గొన్నవారు. ఎమర్జెన్సీ విధించిన నాటి నుంచి ఎత్తేసే దాకా ఆయన జైల్లోనే ఉన్నారు. ఆ తరువాత జనతా పార్టీలో చేరి 1977 ఎన్నికల్లో తొలిసారిగా లోక్‌సభకు జనతా టికెట్‌పై ఎన్నికయ్యారు. నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌తో విభేదించి జనతాకు రాజీనామా చేసి- రాజ్‌నారాయణ్‌ నేతృత్వంలోని జనతాపార్టీ- ఎస్‌ లో చేరారు. మళ్లీ 1980, 84ల్లో హాజీపూర్‌నుంచి గెలుపొందారు.

1983లో దళిత సేన పేరిట ఓ సంస్థను ప్రా రంభించి దేశంలో నిమ్న వర్గాల అభ్యున్నతే తన లక్ష్యమని ప్రకటించారు. 1989లో 9వ లోక్‌సభకు ఎన్నికైన ఆయన విశ్వనాథ్‌ ప్రతా్‌పసింగ్‌ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రి అయ్యారు. ఆ సమయంలోనే ఆయన మండల్‌ కమిషన్‌ నివేదిక సిఫార్సుల అమలులో కీలకపాత్ర పోషించారు.  1996లో దేవెగౌడ మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా పనిచేశారు.  2000లో సొంతంగా లోక్‌జనశక్తి పార్టీని స్థాపించారు. 1998-2004 మధ్య వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు ఉక్కు, బొగ్గు శాఖలను చూశారు.  2004లో ఎన్‌డీఏ నుంచి యూపీఏలో చేరి యూపీఏ-1లో మన్మోహన్‌సింగ్‌ కేబినెట్లో ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిగా పనిచేశారు.

2009 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన… ఆ వెంటనే 2010లోనే రాజ్యసభ సభ్యుడయ్యారు. తిరిగి 2014లో హాజీపూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఆయన మోదీ ప్రభుత్వంలో మంత్రిగా చేరారు. మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక అవే శాఖలతో మంత్రివర్గంలో కొనసాగారు. బిహార్‌ రాజకీయాలపై పాసవాన్‌ది చెరగని ముద్ర. ఆయన జట్టుకట్టని పార్టీ లేదు. చేరని కూటమిలేదు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌ ఇద్దరితోనూ ఆయన రాజకీయ బంధం కొనసాగించారు.   1985 నుంచి 2020 దాకా ఆయన అక్కడ కీలక రాజకీయ శక్తిగా కొనసాగారు. దళిత నేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన దళిత సంఘాలన్నింటికీ పెద్ద దిక్కుగా నిలిచారని రాజకీయ విశ్లేషకులు అంటారు. ‘గాలి ఎటు మళ్లితే పాసవాన్‌ అటు ఉంటారు…. ప్రజల నాడి తెలిసి ఎన్నికల్లో గెలిచే దిట్ట… అఽధికారానికి అతి సమీపంలో ఉంటారు’’ అని లాలూ ఓ సందర్భంలో ఆయన గురించి వ్యాఖ్యానించారు.

బిహార్‌ ఎన్నికలు మరో 20 రోజుల్లో జరగనున్న తరుణంలో పాసవాన్‌ మరణం ఎల్‌జేపీకి తీరని దెబ్బ. ఇపుడు భారమంతా చిరాగ్‌ పాసవాన్‌పైనే పడింది. తండ్రి వద్ద సలహాలు తీసుకుని నడిచే చిరాగ్‌ ఈ మరణం తనకు తీరని లోటన్నారు. పాసవాన్‌ అకాల మరణంతో దేశంలోని దళితులు ఓ బలమైన రాజకీయ వాణిని కోల్పోయారు. ఆయన మృతి బాధాకరం… అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ‘చాలా ఏళ్లపాటు పాసవాన్‌ కుటుంబం మా ఇంటి పక్కనే ఉండేది. మాకు సన్నిహిత సంబంధాలుండేవి’ అని ప్రియాంక గాంధీ వాద్రా తన సంతాపసందేశంలో పేర్కొన్నారు. రాంవిలాస్‌ పాసవాన్‌ మరణం దేశానికి తీరని లోటు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. పాసవాన్‌ సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడని హిమాచల్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కొనియాడారు. ఆయన మృతిపట్ల విచా రం వ్యక్తం చేశారు. కాగా, పాసవాన్‌ మృతికి సంతాప సూచకంగా శుక్రవారం ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో జాతీయ పతకాన్ని అవనతం చేస్తారు.

కేసీఆర్‌ సంతాపం
రాంవిలాస్‌ పాసవాన్‌ మరణంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భారంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన అండగా నిలిచారని కొనియాడారు. రాజకీయ నాయకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా ఆయనకు భారత రాజకీయ చరిత్రలో గొప్ప స్థానం ఉందన్నారు. పాసవాన్‌ ఆకస్మిక మృతి దేశానికే తీరనిలోటని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. సమాజంలో అట్టడుగువర్గాల గొంతుకగా పాశ్వాన్‌ నిలిచారన్నారు.  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ కూడా తమ సంతాపం ప్రకటించారు. 

Courtesy Andhrajyothi