అవినీతి రొంపిలో బల్దియా దోమల విభాగం
నల్ల బజారులో డీజిల్‌, రసాయనాల విక్రయం
రోగాల బారిన బస్తీలు, కాలనీల వాసులు

నగరంపై దోమలు యుద్ధం ప్రకటించాయి.. బస్తీలు, కాలనీల్లో సాయంత్రమైతే చాలు రోడ్డుపై నిలవలేని దుస్థితి తయారైంది.. ఇళ్లలోకి ప్రవేశించి ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. దోమ కాటుతో డెంగీ, మలేరియా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ దోమల నివారణ విభాగం అలసత్యం, అవినీతి వ్యవహారమే అందుకు కారణమవుతోంది. దోమలు ఉత్పత్తి కాకుండా చల్లాల్సిన మందును, ఫాగింగ్‌ యంత్రాలకు ఉపయోగించాల్సిన డీజిల్‌ను అధికారులు నల్ల బజారుకు తరలించి ప్రజలను రోగాల బారిన పడేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏళ్లుగా జరుగుతోన్న ఈ దందాకు కేంద్ర కార్యాలయమే అండదండలు అందిస్తోందని, ఏటా రూ.10కోట్లు ఖర్చవుతున్నా ఫలితం కనిపించట్లేదని ఆందోళన వ్యక్తమవుతోంది.

రాజధానిలో కోటికి పైగా జనాభా ఉన్నారని అంచనా. బస్తీలు, కాలనీల్లో పెద్ద సంఖ్యలో జనం నివాసముంటున్నారు. నాలాలు, మురుగు కాలువలు, తటాకాల చుట్టూ జీవనం సాగిస్తున్నారు. సరిగ్గా అక్కడే దోమలు విజృంభిస్తున్నాయి. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా ఈ ఏడాదిలో 309 ప్రాంతాల నుంచి డెంగీ, 151 కాలనీల్లో మలేరియాకు సంబంధించిన ఫిర్యాదులొచ్చాయని అధికారులే చెబుతున్నారు. ఈ క్రమంలో బల్దియా ఎంటమాలజీ విభాగం క్షేత్ర స్థాయిలో దోమల తీవ్రత అధికంగా ఉన్న పలు ప్రాంతాలను గుర్తించింది. వాటితో పాటు సమీప కాలనీలు, బస్తీల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించామని, వైద్య శిబిరాలు నిర్వహించామని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో నమోదవుతున్న డెంగీ కేసులు మాత్రం గతంకన్నా అధికంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ జిల్లాలోనే 80 అనుమానాస్పద కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాటిలో వ్యాధి నిర్ధరణ జరిగినవి కనీసం సగం ఉంటాయని వైద్యులు అంచనా వేస్తున్నారు. రాజధాని శివారు జిల్లాల్లోనూ భారీగాగ డెంగీ కేసులు చోటు చేసుకుంటున్నాయని, అందుకు కారణం బల్దియా అలసత్వమేనన్న విమర్శలున్నాయి. ప్రధాన నగరంలోని జియాగూడ, దత్తాత్రేయనగర్‌, ఆసిఫ్‌నగర్‌, ఖైరతాబాద్‌, బర్కత్‌పుర, కాచిగూడ, గోల్నాక వంటి ప్రాంతాల్లో వ్యాధుల ఆనవాళ్లు ఎక్కువగా కనిపిస్తుండటం ఆందోళనకు తావిస్తోంది.

ఖర్చు చేస్తున్నా ఫలితం లేదు..
గ్రేటర్‌లో డివిజన్‌కు ఒకటి చొప్పున 150 డివిజన్లకు 150 పోర్టబుల్‌ ఫాగింగ్‌ యంత్రాలున్నాయి. సిబ్బంది ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ఆ యంత్రాలతో దోమల మందును వ్యాపింపజేస్తారు. మరో 13 నాలుగు చక్రాల వాహనంపై అమర్చిన పెద్ద ఫాగింగ్‌ యంత్రాలున్నాయి. డీజిల్‌ ట్యాంకు, ఇతర రసాయనాలతో కూడిన సరంజామాతో ఆయా వాహనాలు నిత్యం సర్కిళ్లలో మందు చల్లుతూ ఉండాలి. పని చేస్తున్నట్లు అధికారులు బిల్లులు మంజూరు చేసుకుంటున్నారే తప్ప సంబంధిత ఫాగింగ్‌ యంత్రాలు ఎక్కడా కానరావడం లేదు. అలా దోపిడీకి ఆసరాగా మారాయి. వెరసి.. ఏడాదికి రూ.10కోట్ల వరకు వెచ్చిస్తున్నా నగరవాసులకు దోమలతో తిప్పలు తప్పట్లేదు.

సిబ్బంది పేరుతో మాయాజాలం 
దోమల విభాగంలో 2,300 మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేస్తున్నారు. 18 మంది ఓ బృందంగా ఏర్పడి నగర వ్యాప్తంగా వార్డుల్లో దోమల నివారణ చర్యలను అమలు చేస్తుంటారు. 126 మందికిపైగా ఉన్న సూపర్‌వైజర్లు సిబ్బందితో ఉదయం 8నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు డివిజన్లలో పని చేయించాలి. ఉదయం, మధ్యాహ్నం బయోమెట్రిక్‌ హాజరు తీసుకోవాలి. నకిలీ వేలిముద్రలు, ఇతర అడ్డదారులు తొక్కిన పలువురు సూపర్‌వైజర్లు పనిలో లేని సిబ్బందినీ ఉన్నట్లు చూపిస్తున్నారు. ఫలితంగా వీధులు, కాలనీల్లో ఇంటింటికి తిరిగి దోమల మందు పిచికారీ చేసే కార్యక్రమం మసకబారింది. సాయంత్రమైతే చాలు దోమలు జనావాసాల్లో స్వైర విహారం చేస్తున్నాయి.

నల్లబజారుకు మందు, డీజిల్‌..
ఫాగింగ్‌ యంత్రాలకు ఇచ్చే డీజిల్‌ కూపన్లను పలువురు సిబ్బంది పెట్రోలు బంకుల్లో విక్రయిస్తున్నారు. దాంతో రసాయనాల వినియోగం కేటాయించిన మోతాదులో ఉండట్లేదు. కేవలం నాలుగో వంతు దోమల మందునే పిచికారీ చేస్తున్నారు. ఇలా అడ్డదారిలో మూటగట్టుకున్న సొమ్ములో సూపర్‌వైజర్లు కమీషన్లతో ఉన్నతాధికారుల నోళ్లు మూయిస్తున్నారనే విమర్శలున్నాయి.

 

(Courtacy Eenadu)