ఆగస్ట్‌ 20, 2019. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో ‘రామ్ కే నామ్‌’ (రాముని పేర) డాక్యుమెంటరీ సినిమా ప్రదర్శన జరుగుతోంది. పోలీసులు దూసుకొచ్చారు. పర్మిషన్‌ లేకుండా వేస్తున్నారంటూ ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పర్మిషన్‌ తీసుకున్నామని విద్యార్థులు చెప్పారు. వారం తిరక్కుండానే కోల్‌కతా ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో అదే పరిస్థితి. మొదట సినిమా స్క్రీనింగు కోసం హాలు కేటాయించారు అధికారులు. సినిమా పేరు వినగానే జడుసుకుని, పర్మిషన్‌ క్యాన్సిల్‌ చేశారు. ఎందుకంత భయం? ఇదేమన్నా నిషిద్ధ సినిమానా? కాదే! సుమారు 28 సంవత్సరాల కిందట తీసిన ఈ సినిమా తాజాగా దేశ రాజకీయ, సామాజిక అంశాలపైన పెనుప్రభావాన్ని చూపించగలదన్న భయం పాలకులను వెంటాడుతోంది. అందుకే దీనిని ప్రదర్శించే ప్రతిచోటా ఏదో రూపంలో అంక్షలు ఎదురవుతున్నాయి. అయినా సరే విద్యార్థులు దీని ప్రదర్శనలని ఏర్పాటు చేయడానికి వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ సినిమా విశేషాలేమిటన్నదే ఈ వారం ‘సంగమం’లో

రామ్‌ కే నామ్‌ అంటే రాముని పేర…అనే సమకాలీన కథాంశంతో 1991లో తీసిన ఈ డాక్యుమెంటరీ సినిమాకు అప్పట్లోనే భారత సెన్సార్‌ బోర్డు సర్టిఫికేట్‌ లభించింది. కోర్ట్‌ ఆదేశం మీద దూరదర్శన్‌ ప్రైమ్‌ టైంలో కూడా ప్రసారం చేశారు. ప్రభుత్వమే ఈ సినిమాకు 1992లో ఉత్తమ పరిశోధనాత్మక డాక్యుమెంటరీగా జాతీయ బహుమతి అందించింది. అదే సంవత్సరం ఫిలిం ఫేర్‌ వారు దీన్ని ‘బెస్ట్‌ డాక్యుమెంటరీ’ అన్నారు. జపాన్‌ యమగతా అంతర్జాతీయ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్లో సిటిజెన్‌ ప్రైజు, స్విట్జర్లాండ్‌ ఫ్రిబౌర్గ్‌ ఫెస్టివల్‌ ప్రైజు, న్యాన్‌ ఎకుమేనికాల్‌ ప్రైజు – ఇలా ఎన్నెన్నో అవార్డులు గెల్చుకున్న ప్రపంచ ప్రఖ్యాత సినిమాగా నిలిచింది.

 ఆనంద్‌ పట్వర్ధన్‌ దర్శకత్వంలో :
భారత డాక్యుమెంటరీ చరిత్రలో పరిచయం అఖ్ఖర్లేని పేరు ఆనంద్‌ పట్వర్ధన్‌. ప్రభుత్వ న్యూస్‌ రీళ్ళు తప్ప ఇండిపెండెంట్‌ డాక్యుమెంటరీ అంటే ఏమిటో తెలీని మన దేశంలో ఎమర్జెన్సీ కాలంలో జరిగిన అన్యాయాలను రికార్డు చేసింది అతని డాక్యుమెంటరీ ‘ప్రిజనర్స్‌ ఆఫ్‌ కాన్సైన్స్‌’ (1978). ఆ తర్వాత వచ్చిన వాటిలో ముఖ్యమైనవి ‘బొంబాయి హమారీ షెహర్‌’ (1985) ‘ఇన్‌ మెమోరీ ఆఫ్‌ ఫ్రెండ్స్‌’ (1990) పోఖ్రాన్‌ అనంతరం భారత్‌-పాక్‌ దేశాల్లో అణుయుద్ధ ఉన్మాదంపై ‘వార్‌ అండ్‌ పీస్‌’ సినిమాలు తీశాడు. ముంబై అల్లర్లపై రెండు భాగాల సుదీర్ఘమైన ‘ఫాదర్‌, సన్‌ అండ్‌ హోలీవార్‌’ నిర్మించాడు. హేతువాదుల వరుసహత్యలపై, హిందూత్వ ఉగ్రవాదంపై పది భాగాల ‘రీజన్‌’ తీశాడు. ఎవరికైనా అతని సినిమాలు ఉద్గ్రంథం చదివినంత తృప్తినిస్తాయి. ఈ సినిమాల ప్రేరణతోనే ఎందరో యువకులు డాక్యుమెంటరీ సినిమాను పోరాట ఆయుధంగా ఎంచుకున్నారు. అతని సినిమాలకు అవార్డులు ఇచ్చిన ప్రభుత్వాలే డిడి లో ప్రదర్శించడానికి నిరాకరించాయి. ప్రతిసారీ న్యాయపోరాటమే శరణ్యమైంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విమర్శిస్తే అద్వానీలకు భలే నచ్చింది కానీ, అద్వానీ రథయాత్రను విమర్శించడం మాత్రం హిందుత్వవాదులకు కంటగింపైంది. ఆ రథయాత్ర కాలం నుంచే మన దేశంపై విరుచుకు పడుతున్న కాషాయోగ్రవాద పెనుముప్పును హెచ్చరిస్తూ వస్తున్నాడు ఆనంద్‌. అప్పటినుంచే సంఘ పరివార్‌ అతని సినిమాల ప్రదర్శనలకు అడ్డుపడుతోంది.

డాక్యుమెంటరీ నేపథ్యమిదీ :
మొఘలుల కాలంలో 1528లో బాబర్‌ సేనానాయకుడు మీర్‌ బాకి అయోధ్యలో ఒక మసీదును నిర్మించి, దానికి బాబర్‌ పేరు పెట్టారు. రామాయణ కథ ప్రకారం అయోధ్య రాముడి జన్మస్థలం. బాబ్రీ మసీదున్న స్థలంలోనే రాముడు పుట్టాడనీ, అక్కడ ఒక రామాలయం ఉండేదనీ, దాన్ని పడగొట్టించి, మసీదు కట్టారనీ ఒక వివాదం బ్రిటీషు కాలం నుండే ఉండేది. అయితే దానికొక సామరస్యమైన పరిష్కారం కూడా గతంలో జరిగింది. హిందువులు రామ్‌ చబుత్రా దగ్గర పూజలు, ముస్లింలు మసీదులో నమాజులు చేసుకునేవారు. కానీ 1949లో మసీదు లోపల రాముడి విగ్రహాలను రహస్యంగా పెట్టారు. చాలా రకాల కోర్టు కేసుల తర్వాత మసీదు ద్వారాలు మూతపడ్డాయి. 1980వ దశకంలో విశ్వ హిందూ పరిషత్‌ రంగం మీదకి రావడంతో రామాలయ నిర్మాణ ప్రచారం ఊపందుకుంది. దీనికి బిజెపి రాజకీయంగా మద్దతు ఇచ్చింది. 1990 సెప్టెంబరులో ఆ పార్టీ నాయకుడు ఎల్‌.కె.అద్వానీ ‘రామ జన్మభూమి’ సాధనకై సారనాథ్‌ నుండి అయోధ్య నగరానికి ఏ.సి.టొయోటా ‘రథయాత్ర’ ప్రారంభించాడు. ఈ యాత్ర పొడుగునా మత కలహాలు జరిగాయి. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అద్వానీని బీహారులో లాలూ ప్రభుత్వం అరెస్టు చేసింది. పెద్ద సంఖ్యలో విహెచ్‌పి వాలంటీర్లు అయోధ్యకు చేరుకుని, మసీదుపై దాడి చేశారు. అక్టోబర్‌ 30 నాటి దాడి సమయంలో ఆర్మీ కాల్పులు జరపలేదు. నవంబర్‌ 2న రెండోసారి మసీదుపై దాడి సమయంలో కరసేవకులకు ప్రభుత్వ పారామిలిటరీ దళాలతో పోరాటం జరిగింది. ఈ సినిమా బాబ్రీ మసీదు కూల్చివేతకు మునుపటి వరకు జరిగిన చరిత్రను నమోదు చేస్తుంది. 1992 డిసెంబర్‌ 6న కరసేవకులు మసీదును కూల్చివేసిన దృశ్యాన్ని సినిమా ఆఖర్లో చూపిస్తారు.

బాబ్రీ చరిత్రపై దర్శకుడి దృష్టి కోణం :
రామజన్మభూమి వివాదం పొడుగునా ఇది హిందువుల నమ్మకానికి చెందిన విషయం అని అద్వానీ తన ప్రసంగాలలో నొక్కి చెప్పడం ఈ సినిమాలో చూస్తాము. ‘కోర్టు తీర్పు ఎలా ఉన్నా మేము అక్కడ మందిరం నిర్మించి తీరుతాము’ అని విహెచ్‌పి ముందునుంచే చెబుతోంది. ‘అక్కడ రాముడు జన్మించాడా లేదా అన్నది కోర్టులా నిర్ణయించేది?’ అని ఒక సభలో అద్వానీ సవాలు విసురుతాడు. దీన్నిబట్టి, వీరికి చరిత్రపైనే కాక న్యాయవ్యవస్థపైనా ఎంత గౌరవముందనేది తెలిసిపోతుంది. అయినా సరే సినిమా ఆరంభంలోనే చాలా ఓపికగా బాబ్రీ చరిత్రను వివరించే ప్రయత్నం చేస్తాడు దర్శకుడు. బాబ్రీ నిర్మితమైన 50 ఏళ్ళ తర్వాత తులసీదాసు ‘రామ్‌ చరిత మానస్‌’ని రాశాడు. అక్కడికి కొద్ది సంవత్సరాల క్రితమే రామ మందిరాన్ని కూల్చివేస్తే, అంత పెద్ద రామభక్తుడు ఆ విషయాన్ని తన గ్రంథంలో ఉల్లేఖించే వాడు కదా! అన్నది చాలమంది విశ్లేషకుల అభిప్రాయం. 19వ శతాబ్దం నాటికి అయోధ్య ఎన్నో రామమందిరాలతో నిండిపోయింది. ప్రతి మందిరమూ తనున్నచోటే రాముడు పుట్టాడని చెబుతుంది. ఒకే రాముడు ఎన్నిచోట్ల పుట్టాలి? లేక బలవంతుడు చెప్పినచోటే పుట్టాలా? స్వాతంత్య్ర ఉద్యమకాలంలో బలపడుతున్న హిందూ-ముస్లిం ఐక్యత బ్రిటీషు వారికి కంటగింపుగా ఉంది. అందుకే మందిరం పడగొట్టి, మసీదు కట్టారన్న అపవాదుకు ఆమోదముద్ర వేసి, ప్రచారం చేశారని చెబుతాడు దర్శకుడు. మసీదులో రాముని విగ్రహం ప్రతిష్టించడంలో అప్పటి అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్‌ నయ్యర్‌ పాత్రను కూడా విశ్లేషిస్తాడు దర్శకుడు. కలలో రాముడు చెప్పిన ప్రకారమే ‘రామ్‌ లల్లా’ విగ్రహాన్ని మసీదులో పెట్టాననీ, తనతో ఇంకొంత మంది కూడా ఉన్నారనీ, నయ్యర్‌ చెప్పిన మేరకు అలా చేశామనీ మహంత్‌ శాస్త్రి అనే ఆయన చెబుతాడు. ‘మా ప్లాను ప్రకారం చేశాం, నేను ఇంకా ఎక్కువ మాట్లాడితే అరెస్టు కాగలను’ అని కెమెరాకు ముఖం చూపడానికి నిరాకరించిన మరొక వ్యక్తి చెబుతాడు. విగ్రహాలను తొలగిస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందన్న సాకు చూపి, విగ్రహాలను అక్కడే ఉండనిచ్చాడు నయ్యర్‌. ఈయన తర్వాతి కాలంలో జనసంఘ్‌ ఎం.పి. అయ్యారని చెబుతారు దర్శకుడు.

ఎన్నో భిన్నస్వరాలు :
రామ్‌ జన్మభూమి ఆలయం కోసం కోర్టు నియమించిన ప్రధాన పూజారి మహంత్‌ లాల్‌దాస్ ‘విహెచ్‌పికి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యం. అంతేతప్ప విహెచ్‌పి సభ్యులు ఏనాడూ ఒక్క సంతర్పణా చేయలేదు లేదా ఆలయంలో ప్రార్థించనూ లేదు’ అని ఈ సినిమాలోని ఇంటర్వ్యూలో చెబుతాడు. బిజెపి-విహెచ్‌పి రాజకీయ ప్రయోజనాలకు సేవ చేయడానికి ధైర్యంగా నిరాకరించిన ఇతడు తరువాతి కాలంలో హత్యకు గురయ్యాడు. దర్శకుడు ఈ సినిమాను అతనికి అంకితమిచ్చాడు. ప్రస్తుత పరిస్థితికి విరుగుడు ఏమిటి? అని ఒకచోట అతడిని ప్రశ్నిస్తే, రామాయణం నుండి ఒక దోహాను ఉటంకిస్తూ ‘వర్షాలు భారీగా ఉన్నప్పుడు, గడ్డి చాలా ఎత్తుగా పెరుగుతుంది.. సరైన మార్గాన్ని కనుగొనడం కష్టంబీ కాబట్టి తుచ్చులు మాట్లాడేటప్పుడు, నిజం మరుగునపడుతుందిబీ కానీ వర్షాకాలం స్వల్పకాలికం, అది గడిస్తే, ప్రజలు తమ తార్కిక సామర్థ్యాన్ని తిరిగి పొందుతారు’ అని చెబుతాడు. సాధువు అనే వాడు సర్వసంగ పరిత్యాగి కావాలి. కానీ, ఈ సాధువులు సుఖభోగాల కోసం అర్రులు చాస్తున్నారు అని లాల్‌దాస్‌ చెబుతున్నపుడు, ఏ.సి. గదుల్లో కునుకులు తీస్తున్న సాధువులను, సన్‌ గ్లాసెస్‌ ధరించిన సాధువులను, ఏ.సి. కార్ల నుండి దిగుతున్న సాధువులను ప్రముఖంగా చూపుతాడు దర్శకుడు. ‘శిలాన్యాస్‌’ పేర బోలెడు డబ్బు గల్లంతయిన విషయాన్నీ చెప్తాడు లాల్‌దాస్‌. ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారి విశ్వబంధు గుప్తా విహెచ్‌పి విదేశీ డొనేషన్లనూ, ఖాతలనూ తనిఖీ చేసినందుకు రాజకీయ బాధితుడయ్యాడు. ‘ఈ దేశానికి సేవ చేద్దామని అమెరికా నుండి వచ్చాను. నిజాయితీగా పనిచేసినందుకు ఇటువంటి వేదన ప్రతిఫలంగా దొరికితే ఈ దేశంలో మంచివాళ్లు మిగలరు’ అని కళ్ళనీళ్ళ పర్యంతం అవుతాడు. సినిమాలో అత్యంత శక్తివంతమైన క్షణాలలో ఈ దృశ్యం ఒకటి. అయోధ్య వాసులకే కాక, చుట్టుపక్కల గ్రామాల వారికి ఈ వివాదమేమిటో అర్థం కాదు. హిందు-ముస్లింలు చిరకాలంగా సఖ్యంగా ఉండేవారనీ, ఇక్కడ మతకొట్లాటలు జరిగేవి కావనీ చెబుతారు దర్శకుడికి చాలామంది. ముస్లిం రాజులు హిందూ దేవాలయాల కోసం భూములు దానం చేసిన విషయాన్ని చెబుతాడు ఒకాయన. గ్రామాల్లో ‘జై రాంజీకీ!’ అని పలకరించుకునే సంప్రదాయం ఉంది. అలా ముస్లింలు కూడా పలకరిస్తారు. అలానే ముస్లింలకు ‘అస్సాలామాలేకుం’ చెబుతారు హిందువులు కూడా. ఉత్తరప్రదేశ్‌ గ్రామాల్లో ఈ ‘గంగా-జమునీ తెహ్‌జీబ్‌’ (గంగా-యమునా సంస్కృతి) సజీవంగా ఉంది. దానికి విఘాతం కలిగిస్తూ, నేడు రాముడి పేర ‘జై శ్రీరామ’ హత్యల స్థాయికి దిగజార్చారు. యుద్ధానికి సన్నద్ధుడైన రాముడి చిత్రపటంతో ‘జై శ్రీరామ్‌’ అనేది ప్రజలపై యుద్ధ నినాదంలా మలిచారు. ఆ వొరవడి ఆనాటి నుంచే మొదలైందని ఈ సినిమా చెబుతుంది. నిరంతర అబద్ధాల ప్రచారాల పాత్ర ఆనాటి నుండీ సజావుగానే ఉంది. చదువుకున్న మేధావులూ నేడు అభినవ ‘నయ్యర్లు’గా తమ పాత్ర పోషిస్తున్నారు.

నిమ్న కులాల తార్కికత: పెట్టుబడికీ, మనువాదానికీ పుట్టిన ఈ అంశంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించే సాధారణ గ్రామీణులు, నగర పేదలూ చాలా మందే ఇందులో ఉన్నారు. వారే ఈ సినిమా చూసే వారికి కామన్‌ సెన్స్‌ సరఫరా చేస్తారు. ‘ఆ బ్రాహ్మలకి పంటకోసి చేతికిచ్చేవరకే మేము కావాలి. ఆ పంట వారి చేతికి ముట్టగానే మేము అంటరాని వాళ్ళమైపోతాము’ అని చెబుతుంది ఒక మహిళ. ‘ఒక్క రాముడి జన్మస్థానం కోసం దేశమంతా గలాటా చేస్తున్నారు. కానీ ఈ గడ్డ మీదే పుట్టిన మమ్మల్నందరినీ ఈ నేల నుండి తరిమేస్తారట! ఈ నాయకుల వెనుక పరిగెత్తేవాళ్ళు చాలామంది ఉంటే ఉండొచ్చు. నిజమే! కానీ, నేనెందుకు ఈ నాయాళ్ళ వెంబడి పరుగెత్తాలి?’ అన్న ఆ గ్రామీణ మహిళ ప్రశ్నతో సినిమా ముగుస్తుంది. చివరిగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో చివరికి ఈ సినిమా ప్రదర్శన జరిగింది. అదే సమయానికి పెద్ద హాలును ఎబివిపికి కేటాయించారు. ‘రాముడి పేర’ చిన్న హాలే! అయినా సరే కిక్కిరిసిన చిన్న హాలులో 400 మంది నిల్చొని కూడా సినిమా చూశారు. 150 మంది స్థలం దొరక్క వెనుదిరిగారు. వారంతా యూట్యూబ్‌లో చూసుకుంటారు. ప్రెసిడెన్సీలో కూడా ఆగస్టు 30న కిక్కిరిసిన హాలులో ప్రదర్శన జరిగింది. కోల్‌కతా జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో కూడా హెచ్‌ సి యూ విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ ఈ సినిమాను ప్రదర్శించారు. ‘మందిర్‌ వహీ బనాయేంగే’ తరహాలో, ‘సినిమా వహీ దిఖాయేంగే’ అంటూ అధికారులు అడ్డుకున్న చోటనే ప్రదర్శనలు జరిపి, ప్రతిఘటించారు వివిధ నగరాల విద్యార్థులు.

– బాలాజీ, కోల్‌కతా
ఫోన్‌ : 9007755403