జైపూర్‌ : రాజస్థాన్‌లో గిరిజన సబ్‌ ప్లాన్‌ అమల్లో ఉన్న బన్‌స్వారా, దుర్గాంపూర్‌, ప్రతాప్‌ఘర్‌ జిల్లాల్లోని గిరిజన అభ్యర్ధులు తమ ఉద్యోగాలు కోసం వీరోచిత పోరాటం చేస్తున్నారు. గిరిజన సబ్‌ప్లాన్‌ ప్రకారం తమతోనే పూర్తి చేయాల్సిన 1167 ఉపాధ్యాయ పోస్టులను జనరల్‌ కేటగిరిలో భర్తీ చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలనే డిమాండ్‌కు దారితీసింది. దీంతో తమ డిమాండ్ల పరిష్కారానికి 20 రోజులుగా ఉద్యమిస్తున్న గిరిజన అభ్యర్థులు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో పోరాటాన్ని ఉధృతం చేశారు. ఉదరుపూర్‌ – అహ్మదాబాద్‌ జాతీయ రహదారిని ముట్టడించారు. నాలుగు రోజుల నుంచి హైవేను దిగ్బంధనం చేశారు. ఆందోళనకారులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. ఉద్యమం మరింత ఉధృతమవ్వడంతో పోలీసులతో బలప్రయోగం చేయించింది. శనివారం సాయంత్రం పోలీసులు ఇష్టారీతిన లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో ఆందోళనకారులు తిరగబడ్డారు. పోలీసులు కాల్పులు జరపగా ఇద్దరు మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి.

బీజేపీ చేసిన మోసం వెంటాడుతుతోంది
2018లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం టీచర్ల పోస్టులకు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో గిరిజన అభ్యర్థులు అర్హత సాధించలేదన్న సాకుతో గిరిజన సబ్‌ ప్లాన్‌ అమలవుతున్న ప్రాంతాల్లోని 1167 ఉపాధ్యాయ పోస్టులను ఓపెన్‌ కేటగిరిలో భర్తీ చేయడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. వెనువెంటనే గిరిజన అభ్యర్ధులు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కారగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే టీచర్ల పోస్టుల రిక్రూట్‌మెంట్‌కు పరీక్షలు నిర్వహించి ఆ పోస్టులన్నీ భర్తీ చేస్తానని తెలిపింది. మొత్తం రాష్ట్రంలో 31 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉండగా, ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌ ప్రాంతాల్లో 6018 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి నియామకం కోసం 2019లో గిరిజన అభ్యర్థులు ఉద్యమించారు. దాదాపు 20 రోజుల పాటు ఆందోళన కొనసాగించారు. జాతీయ రహదారిని దిగ్భందించారు.

దిగివచ్చిన ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ మరో మూడు నెలల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తొమ్మిది నెలలు గడిచినా ఆ హామీని నెరవేర్చకపోవడంతో గిరిజన అభ్యర్ధులు మళ్లీ ఉద్యమించారు. ఈ నెల 24న ఆందోళన కారులతో చర్చలు జరుగుతాయని ప్రభుత్వం సమాచారం పంపించింది. 23వ తేదీ రాత్రి చర్చలను రద్దు చేసినట్టు ప్రకటించినా, విద్యార్ధులు, అభ్యర్ధులు పెద్ద ఎత్తున ఉద్యమంలోకి వచ్చారు. ఉదరుపూర్‌-అహ్మదాబాద్‌ జాతీయ రహదారిని గత ఐదు రోజుల నుండి దిగ్బంధించారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపినప్పటికీ గిరిజన యువత పోరాట పథం నుంచి తప్పుకోలేదు. పోలీసు కాల్పుల ఘటన తర్వాత ప్రభుత్వం లో కాస్త చలనం వచ్చింది. ఆందోళనకారులతో చర్చలకు సిద్దంగా ఉన్నామని గిరిజన అభివృద్ధి శాఖా మంత్రి అర్జున్‌సింగ్‌ బామానియా తెలిపారు.

Courtesy Nava Telangana