జ్యోతిరాదిత్యతో పైలట్‌ భేటీ.. ఆందోళనలో కాంగ్రెస్‌ శిబిరం
జైపూర్‌కు అధిష్ఠానం దూతలు.. మాకెన్‌, సూర్జేవాలా పయనం
ప్రధాన కార్యదర్శి అవినాశ్‌ కూడా.. నేడు జైపూర్‌లో సీఎల్పీ భేటీ
ఫోన్లో స్పందించని సచిన్‌ పైలట్‌.. వెంట 30 మంది ఎమ్మెల్యేలు!
గెహ్లోత్‌ కింద పనిచేయాల్సిందే.. సచిన్‌కు అధిష్ఠానం ఆదేశం
ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. దేశద్రోహానికి పాల్పడ్డారు
విచారణకు రావాలని పైలట్‌కు పోలీసు అధికారుల నోటీసులు
రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభానికి అసలు కారణం ఇదే
మైనారిటీలో గెహ్లోత్‌ సర్కారు: సచిన్‌ పైలట్‌ స్పష్టీకరణ
కాంగ్రె్‌సలో ప్రతిభకు విలువ లేదు: జ్యోతిరాదిత్య సింధియా

న్యూఢిల్లీ: రాజస్థాన్‌ రాజకీయం వేడెక్కింది. సీఎం అశోక్‌ గెహ్లోత్‌ సర్కారు భవితవ్యమేంటనేది తేలేది నేడే. అశోక్‌ గెహ్లోత్‌ తమకు ప్రాధాన్యమివ్వడం లేదని ముందు నుంచీ ఆగ్రహంతో ఉన్న ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌.. తనకు రాజద్రోహం, కుట్ర చట్టాల కింద విచారణకు హాజరు కావాలంటూ స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ (ఎస్‌ఓజీ) పోలీసులు నోటీసులు ఇవ్వడంతో మరింత రగిలిపోయారు. శనివారం రాత్రికిరాత్రే తన మద్దతుదారులతో ఢిల్లీ చేరడంతో, సీఎం-డిప్యూటీ సీఎంల నడుమ వివాదం ముదిరి పాకాన పడింది.

సచిన్‌ పైలట్‌తోపాటు 16మంది కాంగ్రెస్‌, ముగ్గురు స్వతంత్రఎమ్మెల్యేలు ఓ హోటల్‌లో ఉండగా.. ఆదివారం ఉదయం మరో 12 మంది ఎమ్మెల్యేలు గురుగ్రామ్‌లోని ఓ రిసార్టుకు చేరుకున్నారు. పైగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ సర్కారును కుప్పకూల్చి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా, సచిన్‌ పైలట్‌ భేటీ కావడంతో కాంగ్రెస్‌ శిబిరంలో కల్లోలం ప్రారంభమైంది. వెంటనే రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌తో ఫోన్లో మాట్లాడారు. అధిష్ఠానం సూచనల మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి అవినాశ్‌ పాండే, సీనియర్‌ నేత అజయ్‌ మాకెన్‌, అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా జైపూర్‌కు పయనమయ్యారు. అశోక్‌ గెహ్లోత్‌ కూడా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సోమవారం ఉదయం 10.30కు సీఎం నివాసంలో జరిగే సీఎల్పీ సమావేశానికి వీరు హాజరవుతారని తెలిసింది. ఈ సమావేశానికి మిత్రపక్షాలను, మద్దతునిస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యేలను కూడా పిలిచినట్లు సమాచారం. మద్దతుదారులందరికీ ఆదివారం రాత్రి గెహ్లోత్‌ విందు ఇచ్చారు. అయితే.. సచిన్‌ పైలట్‌ వల్ల ప్రభుత్వానికి ఢోకా లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్‌ పాండే అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

‘‘సచిన్‌ పైలట్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించాను. అతను ఫోన్‌లో స్పందించక పోవడంతో మెసేజ్‌ పెట్టాను. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా నాకు టచ్‌లో ఉన్నారు. ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది’’ అని పాండే అన్నారు. ఎస్‌వోజీ విచారణకు అందరూ సహకరించాల్సిందేనన్నారు. అయితే.. అవినాశ్‌ పాండే ఫోన్లో పెట్టిన మెసేజ్‌ తీవ్రమైనదేనని సచిన్‌ పైలట్‌ వర్గం చెబుతోంది. ‘‘మీరు అశోక్‌ గెహ్లోత్‌ కింద పనిచేయాల్సిందేననేది అధిష్ఠానం మాట’’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. సోమవారం నాటి సీఎల్పీ భేటీలో పాల్గొనాల్సిందిగా సమన్లు జారీ చేసినట్లు సమాచారం.

గెహ్లోత్‌తో కలిసి పనిచేయలేం: అసమ్మతి ఎమ్మెల్యేలు
రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌తో కలిసి పనిచేయలేమని ఢిల్లీ శిబిరంలో ఉన్న అసమ్మతి ఎమ్మెల్యేలు చెప్పినట్లు తెలిసింది. పోలీసు స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌(ఎ్‌సవోజీ) అధికారులు సచిన్‌ పైలట్‌కు నోటీసులు జారీచేయడంపై వారు ఇలా స్పందించారు. ‘‘ప్రభుత్వం హద్దుదాటి ప్రవర్తిస్తోంది. ఇప్పటికే గెహ్లోత్‌ తీరుతో విసిగిపోయి ఉన్నాం. ఎస్‌వోజీ లేఖ పరాకాష్టకు నిదర్శనం. ఒక డిప్యూటీ సీఎం, అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఇలా ఎస్‌వోజీ నోటీసు రావడం ఇదే మొదటిసారి. హోంమంత్రి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న సీఎం గెహ్లోత్‌కే ఇది సాధ్యమైంది’’ అని వారు అన్నట్లు తెలిసింది. అయితే.. ఢిల్లీ చేరిన కొందరు ఎమ్మెల్యేలు అధిష్ఠానం సంప్రదింపుల తర్వాత కాంగ్రెస్‌ వెంటే ఉన్నామని ప్రకటించారు.

కాంగ్రెస్‌కు ఇబ్బందికరమే: కపిల్‌ సిబ్బాల్‌
రాజస్థాన్‌ రాజకీయాల్లో తాజా పరిణామాలు కాంగ్రెస్‌ పాలిట ఇబ్బందికరమేనని ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబ్బాల్‌ అన్నారు. ‘‘అంతా అయిపోయాకే మేము(కాంగ్రెస్‌) మేల్కొంటాం. ఇది బాధాకరం’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఎంపీ వివేక్‌ తన్ఖా ఖండించారు. ‘‘ఈ సమయంలో మీరు పార్టీ బలంగా ఉండేలా ధైర్యం చెప్పాలి’’ అని ట్వీట్‌ చేశారు.

ప్రతిభకు విలువలేదు: జ్యోతిరాదిత్య
కాంగ్రె్‌సలో ప్రతిభకు విలువ ఉండదని మధ్యప్రదేశ్‌ బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా వ్యాఖ్యానించారు. ‘‘సచిన్‌ పైలట్‌ నాకు పాత మిత్రుడే. అతడిని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ పక్కన పెట్టారు. దీన్ని బట్టి ప్రతిభాసామర్థ్యాలు కాంగ్రె్‌సలో చిన్న విషయాలని తేలిపోయింది’’ అని ట్వీట్‌ చేశారు.

సచిన్‌ పైలట్‌ ప్రాంతీయ పార్టీ పెడతారా?
24 గంటల మౌనం తర్వాత సచిన్‌ పైలట్‌ ఆదివారం రాత్రి స్పందించారు. గెహ్లోత్‌ సర్కారు మైనారిటీలో పడిందని ఓ ప్రకటనలో తెలిపారు. తన వెంట 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వెల్లడించారు. తన మద్దతుదారులతో బీజేపీ చెంతకు చేరినా ముఖ్యమంత్రి పీఠం దక్కదని కమలం పార్టీ నుంచి సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ కూడా అతను గెహ్లోత్‌ కింద పనిచేయాల్సిందేనని తేల్చిచెప్పింది. దీంతో సచిన్‌ పైలట్‌ ప్రాంతీయ పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఆయన వెంట ఉన్నవాళ్లు కొనసాగడం అనుమానమే. పైగా.. సచిన్‌ సహా 30 మంది రాజీనామా చేస్తే గెహ్లోత్‌ సర్కారుకు నష్టమేమీ లేదని విశ్లేషకులు అంటున్నారు. 30 మంది రాజీనామా చేస్తే ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ ఫిగర్‌ 86 సీట్లే. బీజేపీ మిత్రపక్షానికి చెందిన 3 సీట్లను కలుపుకొన్నా ఆ సంఖ్యను చేరలేదు.

ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణ కాంగ్రెస్‌ సృష్టే: బీజేపీ
రాజస్థాన్‌ పరిణామాలను బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. సచిన్‌ పైలట్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపడంలేదని పేర్కొంది. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు కాంగ్రెస్‌ సృష్టి అని కేంద్రమంత్రి గజేంద్ర షేకావత్‌ ట్వీట్‌ చేశారు.

ఎస్‌ఓజీ నోటీసులతోనే రాద్ధాంతం?
గెహ్లోత్‌ తీరుపై సచిన్‌ పైలట్‌ గుర్రుగానే ఉన్నా పార్టీ చీలికకూ ప్రయత్నించలేదు. అయితే.. ఎస్‌వోజీ నోటీసులే ఆయన వేరుకుంపటికి కారణమైందని తెలుస్తోంది. గత నెల ఆయుధాల చట్టం కింద నమోదైన ఓ కేసుకు సంబంధించి స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌(ఎ్‌సవోజీ) పోలీసులు ఇద్దరు నిందితుల ఫోన్‌కాల్స్‌పై నిఘా పెట్టారు. వాటి ద్వారా కాంగ్రెస్‌ సర్కారు కూల్చివేతకు కుట్ర జరుగుతోందని పసిగట్టారు. కుట్ర, దేశద్రోహం కేసులు నమోదు చేసి వారిద్దరినీ అరెస్టు చేశారు. సీఎం గెహ్లోత్‌ సహా, సచిన్‌ పైలట్‌, పలువురు మంత్రు లు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ మహేశ్‌ జోషి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, సచిన్‌ పైలట్‌ వెంట ఉన్న ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల(కు్‌షవీర్‌ సింగ్‌, ఓంప్రకాశ్‌ హుద్లా, సురేశ్‌ టక్‌)కు కూడా శుక్రవారమే నోటీసులు జారీ చేశారు. దీంతో తనపై కుట్ర జరగబోతోందనే అనుమానంతో సచిన్‌ పైలట్‌ అప్రమత్తమయ్యారు.

అసెంబ్లీలో బలాబలాలివీ..
మొత్తం సీట్లు: 200
మ్యాజిక్‌ ఫిగర్‌: 101
కాంగ్రెస్‌ బలం: 107, బీఎస్పీకి చెందిన ఆరుగురిని కలిపి 113
బయటి నుంచి మద్దతు: బీటీపీకి చెందిన ఇద్దరు, ఆర్జేడీ ఎమ్మెల్యే ఒకరు, సీపీఎం నుంచి ఇద్దరు.. మొత్తం ఐదుగురు
బీజేపీ బలం: 72 మంది ఎమ్మెల్యేలు, మిత్రపక్షం ఆర్‌ఎల్పీకి ముగ్గురు ఎమ్మెల్యేలను కలుపుకొని 75
కొత్తగా రానున్న మద్దతు (అంచనా): సచిన్‌ పైలట్‌ సహా 30 మంది కాంగ్రెస్‌, స్వతంత్ర ఎమ్మెల్యేలు. దీంతో.. బీజేపీ బలం 105కు చేరనుంది

రాహుల్‌కు ఇరకాటం?
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ సర్కారును పడదోసిన జ్యోతిరాదిత్య సింధియా రాజస్థాన్‌ సర్కారును ఇరకాటంలో పారేస్తున్న సచిన్‌ పైలట్‌.. ఇద్దరూ కాంగ్రెస్‌ సీనియర్‌ రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితులు. ఇప్పటికే జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరగా.. సచిన్‌ పైలట్‌ కూడా వెళ్లిపోతే రాహుల్‌ గాంధీని ఇరకాటంలో పారేయనుందని విశ్లేషకులు అంటున్నారు.

Courtesy AndhraJyothy