ల.లి.త.
lalithap62@gmail.com

రాజ్యాన్నేలే బలమైన వ్యావసాయక సమూహంగా వుండిన రాజ్‌ గోండులు ఏకీకృత భారతీయ సమాజం లోపల రాజకీయంగా నిర్వచించబడిన ఒక కొత్త ఆదివాసీ హోదాలోకి ఎలా మారిపోయారన్నదే మైకల్‌ యార్క్‌ పరిశీలన.

ఆదిలాబాద్‌ రాజ్‌ గోండుల సుదీర్ఘచరిత్రలో మానవ విజ్ఞానవేత్త క్రిస్తోఫ్‌ వాన్‌ హైమెండార్ఫ్‌కు ప్రత్యేక స్థానం వుంది. గోండు జీవన విధానాన్ని హైమెండార్ఫ్‌ చరిత్రీకరిం చటం గోండుల అదృష్టం. ఆయన శిష్యుడు మైకల్‌ యార్క్‌ కూడా గురువుగారి లాగానే రాజ్‌ గోండులతో కలిసిపోయి, 1976-78ల్లో ఇప్పటి కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాని లోయలోని గిన్నెధరి గ్రామంలో వుంటూ అక్కడి ఆదివాసీ గూడేల్లో అధ్యయనం చేశారు. గోండుల దండారి పండుగనూ, పెళ్లి ఆచార విధులనూ ఆ ప్రాంతపు మేధావుల సహా యంతో స్పష్టంగా అర్థం చేసుకున్నారు. గోండులతో స్నేహాన్ని కొనసాగించారు. భారతదేశంలోని వివిధ సమాజాల మీద కూడా వైవిధ్యభరితమైన డాక్యుమెంటరీలెన్నో తీశారు.

మైకల్‌ యార్క్‌ 1500లకు పైగా తీసిన అపురూప మైన ఫోటోల్లో, దండారి పండుగ గురించి బి.బి.సి. కోసం తీసిన “”Raj Gonds: Reflections in a Peacock Crown” అనే డాక్యుమెంటరీలో, రెండు సవివరమైన వ్యాసాల్లో రాజ్‌ గోండుల జీవన విధా నాన్నీ తాత్వికతనూ పట్టుకున్నారు. యార్క్‌ రాసిన రెండు వ్యాసాల్లో మొదటిది గోండుల చుట్టరికాలు, పెళ్లిళ్ల వ్యవస్థను దక్షిణ భారతదేశపు చుట్టరికాల నేపథ్యంలో పరిశీలిస్తుంది. రెండవది ఆసిఫాబాద్‌, లక్శెట్టిపేట ప్రాంతాల్లో గోండు జీవితాల్లో వచ్చిన సామాజిక, ఆర్థిక పరిణామాలను వివరిస్తుంది. ఈ రెండు వ్యాసాల తెలుగు అనువాదాన్ని ‘వేలిత పాట’ (తీగ పాట) పుస్తకంగా తెలంగాణా గిరిజన సాంస్కృతిక పరిశోధన సంస్థ వెలువరించింది.

రాజ్‌ గోండులు చాలా సిగ్గరి, ఒంటరి సమూహా నికి చెందిన మూలవాసులు. పటిష్టమైన కట్టుబాట్ల మధ్య బయటివాళ్లు ప్రవేశించటానికి వీలులేని ఒక గోత్ర వ్యవస్థను, దాని ప్రకారం స్థూలంగా ఎవరు ఎవరిని పెండ్లి చేసుకోవాలి లేదా చేసుకోకూడదు అన్న నియమాలను స్పష్టంగా యేర్పరచుకున్నారు. విశాలమైన ఈ గోత్రవ్యవస్థకు చాలా ప్రాధాన్యత వుంటుంది. పెర్సపేన్‌ అని పిలుచు కునే దేవతను పూజించటం నిరం తరంగా కొనసాగే వీరి మతాచారం. వ్యక్తుల సామాజిక అభివృద్ధి కూడా ఈ మతాచారంతోనూ తప్పనిసరిగా చేసుకోవలసిన మర్మి (మొదటి) పెళ్లితోనూ ముడిపడివుంటుంది. సంపూర్ణమైన మానవజన్మ భ్రమ ణాన్ని గోండులు ప్రతీకాత్మకంగా అయిదు జొన్న విత్తనాలుగా చెప్తారు. పెళ్లి జరిగినప్పుడు ఆ అయిదు విత్తనాలు అయిదు కొలతల విత్తనాలు అవుతాయి. చనిపోయి నప్పుడు అవి అయిదు కొలతల పిండిగా మారతాయి. కుటుంబాన్ని ప్రతీకాత్మకంగా ఇంటి పైకప్పు నిండా పరుచుకోవటం కోసం గుమ్మడిపాదు పంపే నులితీగలుగా (వేలిత వేలి) చెప్పుకుంటారు. ‘‘గోండుల ప్రాపంచిక దృక్పథానికి వంశానుక్రమం చోదకశక్తి కాదు. గోండుల పెండ్లి విధానం ఆదివాసీ లక్షణాలను కలిగివుంటూనే విస్తృతమైన దక్షిణ భారతీయ ద్రావిడ బంధుత్వాల పద్ధతిలో ఇమిడిపోయేలా వుంటుంది’’ అనేది యార్క్‌ ప్రతిపాదన. అనేక చిహ్నాలతో కూడిన మూలవాసుల పెళ్లిళ్ల విధానాన్ని అర్థం చేసుకొనేందుకు మానవవిజ్ఞాన శాస్త్రంలో రాడ్‌క్లిఫ్‌, బ్రౌన్‌లు చెప్పిన వంశానుక్రమ పద్ధతికంటే, నీధామ్‌, డ్యూమాంట్‌లు ఉపయోగించిన పెళ్లిసంబంధాల పద్ధతే ఎక్కువ ఉపయోగపడుతుం దంటూ, దీనిని రాజ్‌ గోండు సమాజానికి అన్వ యించి ఒప్పిస్తాడాయన.

అలాగే ఆదిలాబాద్‌ తూర్పు ప్రాంతంలో ఎన్నో ప్రభావాల వల్ల గోండు సమాజంలో వచ్చిన మార్పులను పరిశీలించి విలువైన ప్రతిపాదనలు చేశారు. సంచార వ్యవసాయం చేస్తూ ఎంతో కొంత స్వయంసమృద్ధమైన ఆర్థికవ్యవస్థలో బతికే అమాయక మూలవాసులు తమ ప్రాంతానికి వచ్చిన తెలుగు భూస్వాముల వల్ల నానాకష్టాలూ ఎదుర్కొన్నారు. సాంఘికంగా రాజ్‌ గోండులు తెలుగు రైతుల పక్కనే వాళ్లు తీసుకొచ్చిన కుల వ్యవస్థతో సహా బతకాల్సి వచ్చింది. భూస్వాముల బారి నుంచి తప్పించేందుకు ప్రభుత్వ పథకాలు భూమి పట్టాలూ బ్యాంకు రుణాలూ ఆశ్రమ పాఠశాలలూ ఉద్యోగాల రూపంలో వచ్చాయి. వీటిలోకి బ్యూరాక్రసీ, భూస్వాముల స్వార్థం జొరబడ్డాయి. ప్రభుత్వ నిబంధనా నియమావళిని అర్థం చేసుకో లేని ప్రజల వద్దకు యాంత్రికంగా పనిచేసే అధికా రులు రావటంతో పథకాల అమలులో మానవీయకోణం లుప్తమైపోయిన కేసులను చూశారు మైకల్‌ యార్క్‌.

ఇతర మూలవాసులు నాయక పోడులు, కొలాములతోనూ, అను బంధ సమూహాలవారైన పర్థాన్‌, తోటి, వొజారీలతోనూ గోండుల కుండే సామాజిక సంబంధాలను వివరిస్తూ కొన్ని దశాబ్దాలపాటు ఆర్థిక మార్పులతోపాటు ఇవి కూడా ఎలా మారుతూ వచ్చాయో యార్క్‌ సూక్ష్మంగా పరిశోధించారు. తెలుగు రైతుల ఆక్రమణ, సంస్కరణ ఉద్యమాల ప్రవేశంతో జరిగిన హైందవీకరణా, ప్రభుత్వ పథకాల జోక్యమూ మొదలైనవాటితో మరింత విస్తృతమైన సామాజిక సంబంధాలజాలంలోకి వచ్చిపడ్డారు గోండులు. రాజ్యాన్నేలే బలమైన వ్యావసాయక సమూహంగా వుండిన రాజ్‌ గోండులు ఏకీకృత భారతీయ సమాజం లోపల రాజకీయంగా నిర్వచించబడిన ఒక కొత్త ఆదివాసీ హోదాలోకి ఎలా మారిపోయారన్నదే యార్క్‌ పరిశీలన.

ఆదివాసీ సంస్కృతులు, ముఖ్యంగా రాజ్‌ గోండుల గురించి గతంలో జరిగిన మంచి పరిశోధనల కోసం వెదుకుతున్న ఆకాశవాణి ఆదిలాబాద్‌ డైరెక్టర్‌ సుమనస్పతి మైకల్‌ యార్క్‌ కృషినంతటినీ బయటకు తీసుకువచ్చారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఫోటోలూ డాక్యుమెంటరీ ప్రదర్శనతో యార్క్‌ మళ్లీ తన స్నేహితులను ఆప్యాయంగా పలకరించారు. ఈ వ్యాసాలను తెలుగులోనికి అనువదించే పని నాకు అప్పజెప్పినప్పుడు కొంచెం సందేహించినా వాటిని చదివాక వీలైనంత సులువుగా ఇవి రాజ్‌ గోండులతోపాటు అందరికీ తెలుగులో అందాలనే తపన నాలో మొదలయింది. మూలంలో వున్న సారాన్నీ క్లిష్టమైన భాషనూ ప్రతిపాదన లనూ జాగ్రత్తగా తెలుగు చేయటానికి ప్రయత్నించాను. అనువాద సమయంలో కలిగిన కొన్ని సందేహాలను తీర్చుకొం దుకు సంపాదకుడు సుమన స్పతి కొంతమంది గోండులను సంప్రదించి, నా సందేహాలనూ తీర్చి, మొత్తానికి పొందికగా ఈ వ్యాసాలను పుస్తక రూపంలోకి తెచ్చారు. ఒక ప్రాంతాన్నీ ప్రజలనూ తక్కువ కాలంలోనే అంత లోతుగా పరిశీలించి ఆసక్తికరంగా వివరించిన మైకల్‌ యార్క్‌ ప్రతిభ నమస్కరించదగ్గది.

అతివేగంగా ప్రధాన స్రవంతిలో కలిసిపోతున్న మూలవాసుల సంప్రదాయాలూ చిహ్నాలూ పలుచన కావటం సర్వసాధారణం. నలభై ఏళ్ళ క్రితం గోండుల సృష్టి పురా ణాన్ని అయిదు రోజులపాటు మైకల్‌ యార్క్‌ ముందు పాడిన ‘తోటి’ కథా గాయకుడు వెడ్మ రాము జ్ఞాపకశక్తికి, మౌఖిక సంప్రదాయానికి కొనసాగింపు ఏదైనా వున్నదా అంటే సందేహమే. 125 గులకరాళ్లను పేర్చి అదే తన జ్ఞాపక సహాయకారి అని యార్క్‌కు చెప్పాడట రాము. ఒక సంప్రదాయ కథాగాయకుడి దగ్గర ధారణకు తోడ్పడే ఇంత నిశితమైన పద్ధతి వుండటం తన శాస్త్రీయ పాశ్చాత్య అవగాహనను దిగ్భ్రమకు గురి చేసిందని అంటారు యార్క్‌. కథాగాయకులు కను మరుగైపోతున్న ఈ రోజుల్లో గోండు యువతకు తమ పెద్దల్లో ఇంత అద్భుతమైన ధారణాశక్తి వుండేదని తెలుసుకోవలసిన అవసరం వుంది. అప్పుడే మౌఖిక సంప్రదాయాన్ని బతికించుకోవా లనే తపన పుడుతుంది. సమాజ నిర్మాణంలో తమ పెద్దలు విధించిన నియమాలు, ఆచారాల వెనుకనున్న భావజాలం, ఒక ప్రత్యేకమైన జాతిగా తమను నిలబెట్టాలన్న ప్రయత్నం ఎంత బృహత్తరమైనదో తెలుసుకోవటానికి, సమీప చరిత్రలో తమ సంప్రదాయ జీవితంలో వచ్చిన పెనుమార్పులను అర్థం చేసుకోవటానికి ఆదిలాబాద్‌ రాజ్‌ గోండు సమాజానికి మైకల్‌ యార్క్‌ కృషి ఎంతగానో పనికొస్తుంది.