ఏదేను వనంలో ఆదాము ఏవల్లా
కనీసం సిగ్గుపడడమైనా నేర్చుకోలేదుగానీ
అచల వృక్షానికి మహాసర్పంలా చుట్టుకుని
తినవద్దన్న పండ్లన్నీ తినేశాడు
పేదోళ్ళ శ్రమశక్తిని సమీకృత వ్యవసాయంలా చదును చేసి
దోపిడీకి నాట్లేశాడు..
వదిలేశాం!

పనిలేని కౌలు కూలీలు
పనికోసం పదే పదే జరీబుగా పండే దేశాన్ని దండెత్తినా
తెలుగు భూమిహార్లు నాగలిపట్టే అభినయాహార్యానికి
వరాలుగా ఎరువులూ, పంట బీమాలూ పిలిచిచ్చే
ప్రాయోజిత కార్యక్రమంలో

రుణ మాఫీలూ, ఇరవై నాలుగ్గంటల ఉచిత బిజిలీలని
బంగారు మోకులా పేనుకుపోయాడు
వదిలేశాం!!

ఈ రైతు బజార్లలో
ఢిల్లీ నుంచి ఇస్లామాబాద్ దాకా ఒకే భాష మాట్లాడతారుగానీ
ఆడదంటే ఆడ శరీరం కలిగివుండడమొక్కటే కాదుగానీ
పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉన్న పాపానికి
సమానత్వం ఫ్లాట్ఫారాలమీద ఉచిత ఫలాలనూ మోసుకెళ్ళే
అన్ని రైళ్ళనూ దౌర్జన్యంగా ఆపడం మొదలుపెట్టాడు…
వదిలేశాం!!!

తోటలో రాలిపోయిన నాలుగు మామిడి కాయలను
బక్కచిక్కినోడొకడు ఏరుకెళ్ళాడని
కొట్టి కొట్టి సర్కారు ఆఫీసులో చచ్చేలా ఉరేశాడు..
వదిలేద్దామా!
ఇంకా వాడిని వదిలేద్దామా!

– తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
(రాలిపోయిన మామిడికాయలు ఎత్తుకెళ్ళాడని
ఒక నిస్సహాయుడిని కొట్టి సర్కారు ఆఫీసులో
ఉరేశారన్న వార్త విని ఆవేదనతో)