– 2080 వరకల్లా 25 శాతం తగ్గనున్న ఆహారధాన్యాల దిగుబడి
– 2050 వరకల్లా 52 కోట్ల మందికి తాగునీటి సమస్య
గత 15 ఏండ్లలో 11 ఉష్ణ సంవత్సరాలు పలు అధ్యయనాల్లో వెల్లడి
న్యూఢిల్లీ: భూతాపం పెరగడం వల్ల తీవ్రంగా నష్టపోయే దేశాల్లో భారత్‌ ఒకటని పలు అంతర్జాతీయ అధ్యయనాల నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా మన దేశ వ్యవసాయరంగంపై ప్రభావం అధికంగా ఉంటుందని ఆ నివేదికలు తెలిపాయి. ఆహార భద్రతకు భంగం కలుగుతుందని చెబుతున్నాయి. వాతావరణంలో మార్పు వల్ల జరిగే నష్టాలకు మన దేశానికి మరెంతో సమయం పట్టదని తాజా అంచనాలు.
భారత వాతావరణశాఖ లెక్కల ప్రకారం మన దేశ ఉష్ణోగ్రత 1901 నుంచి 2018 వరకు సగటున పారిశ్రామిక దశ పూర్వంకన్నా 0.6 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరిగింది. ఈ శతాబ్దంలోనే భారత్‌లో 11 అధిక ఉష్ణ సంవత్సరాలు గత 15 ఏండ్లలో నమోదయ్యాయి. 2018 అధిక ఉష్ణోగ్రత నమోదు సంవత్సరాల్లో ఆరో స్థానంలో ఉన్నది. కర్బన ఉద్గారాల విడుదల ఇలాగే కొనసాగితే భూగోళం ఉష్ణోగ్రత 2100 వరకల్లా 3 నుంచి 5 డిగ్రీల వరకూ పెరుగుతుందని అంచనా. భారత్‌లాంటి ఉష్ణమండల దేశాలపై దీని ప్రభావం అధికంగా ఉండనున్నది.
ఇండియాలో ప్రధాన పంటల ఉత్పత్తి 2080 వరకల్లా 25 శాతం తగ్గనున్నట్టు ఇంటర్‌గవర్నమెంటల్‌

ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌(ఐపీసీసీ) అంచనా. దీనికితోడు ప్రస్తుతం (2019లో) 136 కోట్లుగా ఉన్న మన దేశ జనాభా 2030 వరకల్లా 150 కోట్లకు, 2050 వరకల్లా 164 కోట్లకు చేరుకోనున్నదని ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతం 770 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 2030 వరకల్లా 850 కోట్లకు, 2050 వరకల్లా 970 కోట్లకు చేరుకోనున్నది.
భూతాపం పెరగడం వల్ల 2050 వరకల్లా ప్రపంచవ్యాప్తంగా తృణధాన్యాల ధరలు 29 శాతం పెరగనున్నట్టు ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) నివేదికలో అంచనా వేశారు. ఆహార సరఫరా గొలుసు దెబ్బతింటుందని ఆ నివేదిక పేర్కొన్నది. మానవ చరిత్రలో మునుపెన్నడూ జరగని రీతిలో పొడినేల విస్తరణ, తాగుÛనీటి వనరుల తరుగుదల రికార్డవుతున్నట్టు నివేదిక పేర్కొన్నది. భూతాపం 2 డిగ్రీలు పెరిగితే ఇండియాలో 52 కోట్ల జనాభాకు తాగునీటి సమస్య ఎదురవుతుందని ఆ నివేదిక తెలిపింది. భూతాపం పెరగడం వల్ల పశుసంపద, మత్స్య సంపదపైనా ప్రతికూల ప్రభావం పడనున్నది.
రానున్న కాలంలో ఎదురు కానున్న పలు ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు జాతీయస్థాయిలో ఆధునిక వ్యవసాయ విధానాలను రూపొందించుకోవాలి. అందుకు సంబంధిత సాంకేతిక విభాగాలతో సమాలోచనలు నిర్వ హించి సమగ్ర ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉన్నది. 2011లోనే అందుకు అంకురార్పణ జరిగినప్పటికీ, ఆ దిశగా తగిన శ్రద్ధ చూపాల్సి ఉన్నది. వాతావరణ మార్పులను తట్టుకొని నిలిచేలా వ్యవసాయరంగంలో చేపట్టాల్సిన సంస్క రణల కోసం నేషనల్‌ ఇన్నోవేషన్స్‌ ఆన్‌ క్లైమేట్‌ రీసైలెంట్‌ అగ్రికల్చర్‌(ఎన్‌ఐసీఆర్‌ఏ)తో కలిసి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌(ఐసీఏఆర్‌) ఆధ్వర్యంలో పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. క్లిష్టమైన పరిస్థితుల్లో పంటల ఉత్పత్తి దెబ్బతినకుండా, పశుసంపద, మత్స్య సంప దకు నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ పరిశో ధనలు జరగాల్సి ఉన్నది. దేశంలోని ఐసీఏఆర్‌కు చెందిన ఏడు కార్యశాలల్లో ఈ పరిశోధనలు జరపాలని నిర్ణయిం చారు. క్లిష్ట పరిస్థితులు ఎదురు కానున్న 151 జిల్లాలను ఎన్‌ఐసీఆర్‌ఏ గుర్తించింది.
2050 వరకల్లా వరిసాగు విస్తీర్ణం 7శాతం మేర, 2080 వరకల్లా 10 శాతంమేర తగ్గనున్నట్టు ఈ పరిశోధనా సంస్థలు అంచనావేశాయి. 2020కల్లా ఖరీఫ్‌లో మెక్కజొన్న సాగు విస్తీర్ణం 18 శాతం తగ్గనున్నట్టు అంచనా వేశారు. అయితే, 2018-19లో తక్కువ వర్షపాతం వల్ల మొక్కజొన్న సాగు తగ్గినప్పటికీ, ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు బాగానే కురిసినందున 2019-20 ఖరీఫ్‌ పంటకు ఢోకా లేదు.
ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోగల వరి రకాలు
కరువు పరిస్థితుల్ని తట్టుకునే నూతన వంగడాలను సృష్టించడంలో శాస్త్రవేత్తలు ఇప్పటికే కొన్ని ఫలితాలు సాధించారు. ఇంటర్నేషనల్‌ రైస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌తో కలిసి హజారీబాగ్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన సెంట్రల్‌ రెయిన్‌ఫెడ్‌ అప్‌ల్యాండ్‌ రైస్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ ‘సహభాగిధన్‌’ పేరుతో ఓ వరి వంగడాన్ని సృష్టించింది. 2010లో విడుదలైన ఈ వరి రకాన్ని కరువు నెలకొన్న తూర్పు భారత్‌లో ప్రవేశపెట్టి విజయవంతమయ్యారు. మిగతా వరి రకాల పంట కాలం 120 నుంచి 150 రోజులు కాగా, ఈ వరి రకం 105 రోజుల్లోనే కోతకొస్తుంది. ఆ సాగుభూమికి నీటి లభ్యత ఉంటే ఆ తర్వాత మరో పంట వేసుకోవచ్చు.
15 రోజులపాటు వరద నీటిలో మునిగినా మనగలిగే వరి రకాల్ని ఒడిషా, శ్రీలంకల్లో ఐఆర్‌ఆర్‌ఐ గుర్తించింది. సబ్‌-1 అనే జన్యువు వల్ల ఈ వరి వంగడాలకు ఆ శక్తి ఉన్నట్టు గుర్తించారు. దీంతో, జన్యు మార్పిడి(జీఎం) పద్ధతిలో వరదల్లోనూ మన గలిగే వరి వంగడాలు సృష్టించే వీలున్నది. ప్రతికూల వాతావరణాలను తట్టుకొని నిలిచేలా గోధుమ, పప్పు ధాన్యాలు, వేరుశెనగ, సోయా చిక్కుడు విత్తనాల సృష్టి కోసం ఐసీఏఆర్‌ పరిశోధనలు జరుపుతోంది.
మరోవైపు ఈ శతాబ్దాంతానికి(2100 వరకల్లా) భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల దిగువకే కట్టడి చేయాలని పారిస్‌ ఒప్పందం(2015) ద్వారా ప్రపంచ దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. అందుకు కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించే పారిశ్రామిక విధానాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత పెరుగుదలకు పారిశ్రామిక దశ(1850-1900) పూర్వస్థితిని కొలమాణంగా తీసుకుంటున్నారు. ఆ సమయంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 13.8 డిగ్రీలు. ఆ తర్వాత ఉష్టోగ్రత పెరుగుదల సగటు 0.8 డిగ్రీలు(2014 వరకు). భారత్‌లో మాత్రం 2014లో సగటు ఉష్టోగ్రత 28 డిగ్రీలు. వాస్తవానికి ఇంగ్లాండ్‌లో పారిశ్రామిక విప్లవం 1750 తర్వాత మొదలైంది.

Courtesy Navatelangana